Thursday, April 18, 2024

ఓటర్ల నమోదుకు ఆధార్ కంప‌ల్స‌రీ కాదు.. ఎన్నికల సంఘం స్పష్టీకరణ

ఆధార్‌ను సమర్పించనందున ఓటర్ల జాబితాలోని ఎంట్రీలను తొలగించవద్దని ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. ఈ సమస్యపై మీడియా కథనాలకు కమిషన్‌ ప్రతిస్పందించింది. ”ఫారం 6బిలో ఆధార్‌ను సమర్పించడం స్వచ్ఛందంగా జరుగుతుందని గమనించాలి. ఆధార్‌ను సమర్పించనందువలన ఓటర్ల జాబితాలోని నమోదు ఏదీ తొలగించబడదు” అని పోల్‌ ప్యానెల్‌ తెలిపింది. ఎలక్ట్రోరల్‌ రోల్‌ సమాచారాన్ని లింక్‌ చేయడానికి, ప్రామాణీకరించడానికి ఓటర్ల నుండి ఆధార్‌ సేకరణను వ్యక్తిగత ప్రాతిపదికన నిర్వహించాలని పేర్కొంటూ జులై 4వ తేదీన అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు పంపిన లేఖను కూడా ప్యానెల్‌ ప్రస్తావించింది.

ఎలక్ట్రోరల్‌ రోల్‌ సమాచారంతో ఆధార్‌ నెంబర్‌ను లింక్‌ చేయడం సులభతరం చేయడానికి, ఓటర్ల ఆధార్‌ సమాచారాన్ని అభ్యర్థించడానికి సవరించిన రిజిస్ట్రేషన్‌ ఫారమ్‌లలో ఒక నిబంధన చేర్చబడింది. ప్రస్తుత ఓటర్ల ఆధార్‌ నెంబర్లను సేకరించేందుకు కొత్త ఫారమ్‌ 6బి కూడా అందుబాటులో వుంది. ఒకవేళ ఓటరు ఆధార్‌ నెంబర్‌ను అందించలేకపోతే ఫారమ్‌ 6బిలో జాబితాలో పేర్కొన్న పదకొండు ఇతర పత్రాలలో ఏదైనా ఒకదాన్ని అందించాల్సి వుంటుందని లేఖలో పేర్కొన్నట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement