Saturday, April 20, 2024

దేశ రాజధాని గడ్డపై రైతన్నల ఐక్యత చిహ్నం.. రిపబ్లిక్ డే పరేడ్‌లో కనువిందు చేసిన ఆంధ్రప్రదేశ్ శకటం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కోనసీమ సాంస్కృతిక ప్రతీక, అన్నదాతల ఐక్యతకు చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ శకటం దేశ రాజధాని నడిబొడ్డున ఇండియా గేట్ సాక్షిగా సగర్వంగా కదిలింది. 450 ఏళ్లుగా కొనసాగుతున్న ‘ప్రభల తీర్థం’ సంస్కృతిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన శకటం కర్తవ్యపథ్‌లో కనువిందు చేసింది. గురువారం జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో ఈ ఏడాది 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు శకటాలు, 6 కేంద్ర ప్రభుత్వ విభాగాలు పొల్గొన్నాయి. శకటాల ప్రదర్శన ప్రారంభం కాగానే  “ప్రభల తీర్థం – మకర సంక్రాంతి సందర్భంగా రైతుల పండుగ” అనే థీమ్‌తో  ఆంధ్రప్రదేశ్ శకటమే ముందుగా కదిలి వచ్చింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ఆర్మీ అధికారుల సాక్షిగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటింది. ఆదిదంపతులు శివపార్వతుల ప్రతిరూపాలైన గరగలు, ప్రభలను కోనసీమ ప్రజలు కనుమ రోజున ఒక చోటకు తరలించి వేడుక జరుపుకోవడమే ప్రభల తీర్థంగా ప్రాచుర్యం పొందింది.

- Advertisement -

రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయమే ప్రజల ప్రధాన వృత్తి. అనాదిగా వ్యవసాయం చేస్తూ వస్తున్న ప్రజలు, దాంతో ముడిపడ్డ సంస్కృతి సాంప్రదాయాలను అలాగే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కోనసీమ ప్రాంతంలో మకర సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజున శివుడి ప్రతిరూపాలుగా ఏకాదశ రుద్రులను ఒక చోటకు చేర్చి వేడుక జరుపుకుంటారు. శివపార్వతులకు ప్రతిరూపాలైన ప్రభలు, గరగలను రంగురంగుల బట్టలు, రంగు కాగితాలు, నెమలి ఈకలు, వరి గుత్తులతో అలంకరిస్తారు. కొబ్బరి ఆకులు, చెరకు, అరటి చెట్లను ఊరేగింపుగా తీసుకువెళ్లడం సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమ ప్రాంతానికి అందాన్ని చేకూరుస్తుంది. వెదురు తోరణాలతో శివుని విగ్రహాలను అలంకరించి కోనసీమ ప్రాంతంలోని అన్ని గ్రామాల నుంచి భారీ ఊరేగింపుగా తీసుకెళ్తారు. ప్రజలు ప్రభల తీర్థం వద్దకు చేరుకుని బాణాసంచా కాల్చడం, సంప్రదాయ సంగీత వాయిద్యాలు, గరగ జానపద కళారూపాలు ప్రదర్శిస్తూ వేడుక చేసుకుంటారు.

సమాజంలో శాంతి, లోకకళ్యాణం కోసం ఏకాదశ రుద్రులు ఉత్సవ ప్రదేశంలో అంటే జగ్గన్నతోటలో సమావేశమవుతారని స్థానిక ప్రజల నమ్మకం. రైతులను సంఘటితం చేసేందుకు, వారి ఐక్యతను పెంపొందించేందుకు కోనసీమలో ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకోవడాన్ని పిఠాపురం రాజులు ఆదరించారు. పాతకాలం నాటి ఆచారాన్ని అదే జోరుతో ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. ఇదంతా ప్రతిబింబించేలా రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రభల తీర్థం శకటం గణతంత్ర దినోత్సవాల్లో అందరి మన్ననలు పొందింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement