Wednesday, November 27, 2024

AP | కూటమి ఐక్యతకై ప్రత్యేక కార్యాచరణ.. అనగాని సత్యప్రసాద్

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 4 (ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో కూటమి ఐక్యతకై ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం రూపొందించి, నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో శ్రీ సత్యసాయి జిల్లా కూటమి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇతర నాయకులతో ప్రత్యేకంగా సమావేశమ‌య్యారు. సుమారు రెండు గంటలకు పైగా జిల్లాకు సంబంధించిన నాయకులతో పలు సమస్యలపై చర్చించారు.

అనంతరం ఇన్చార్జి మంత్రి సత్య ప్రసాద్ మాట్లాడుతూ… జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకుల మధ్య సఖ్యత ఉండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కానీ ఒకటి, రెండు నియోజకవర్గాల పరిధిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమించి, జిల్లాలో త్వరలో జరగబోవు సహకార, సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి తరుపున పోటీ చేసే అభ్యర్థులనే అత్యధికంగా గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కే పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురుందేశ్వరి సహకారం, సూచనల మేరకు పనిచేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.

ఇదే సందర్భంగా టీడీపీ చేపట్టిన సభ్యత్వ‌ నమోదు కార్యక్రమంపై కూడా ప్రత్యేకంగా చర్చించడం జరిగిందన్నారు. ఎన్నికల ముందు పార్టీ కోసం కష్టించి పనిచేసిన కూటమిలోని నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇచ్చి తగిన న్యాయం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం, ఇంకా ఐటీ రంగ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి ఎంతో ఉందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి రంగాల్లో పయనించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తారని నమ్మకం టీడీపీ పార్టీగా తమకుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాల పరిధిలో కూటమిని మరింత పటిష్ట పర‌చ‌డంలో భాగంగా త్వరలోనే నియోజకవర్గాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రంలో కూటమిని తిరుగులేని శక్తిగా తయారుచేయాలనేదే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, ఎంపీ బి కే పార్ధసారథి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకటప్రసాద్, ఎమ్మెస్ రాజు, పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement