Monday, March 25, 2024

అదానీ అవకతవకలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందే.. భారత రాష్ట్ర సమితి డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అదానీ వ్యాపార సామ్రాజ్యంపై హిండెన్‌బర్గ్ నివేదిక లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు జరపాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు అన్నారు. గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ అంశంపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఆందోళన చేశాయి. అంతకంటే ముందు 9 పార్టీలు ఉభయ సభల్లో చర్చకు పట్టుబడుతూ వాయిదా తీర్మానం నోటీసులిచ్చాయి. బీఆర్ఎస్ తరఫున కేకే రాజ్యసభలో వాయిదా తీర్మానం నోటీసులివ్వగా, లోక్‌సభలో ఆ పార్టీ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వర రావు నోటీసులిచ్చారు. అయితే సభ ప్రారంభమైన వెంటనే గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది. ఆ వెంటనే ప్రతిపక్ష పార్టీల నేతలు విజయ్ చౌక్ చేరుకుని మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో క్రోనీ క్యాపిటలిజం పాలన జరుగుతోందని అన్నారు. దేశంలో హిండెన్‌బర్గ్ నివేదికను మించిన పెద్ద సమస్య ప్రస్తుతం ఏదీ లేదని అన్నారు. అదానీ కంపెనీల్లో 33% లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పెట్టుబడులు పెట్టిందని, అదంతా ప్రజల సొమ్మేనని అన్నారు. అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అవకతవకలను హిండెన్‌బర్గ్ నివేదిక బహిర్గతం చేయడంతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లన్నీ భారీగా నష్టపోయాయని తెలిపారు. ఫలితంగా ఎల్ఐసీ కూడా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ దగ్గరే బొగ్గు కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తోందని కేకే మండిపడ్డారు.

ప్రభుత్వం చర్చకు భయపడుతోంది: నామా

- Advertisement -

అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక వ్యవహారంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని బీఆర్ఎస్ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వర రావు అన్నారు. చర్చ జరిగితే అన్ని అంశాలు బయటికొస్తాయని అధికారపక్షం ఆందోళన చెందుతోందని చెప్పారు. ప్రజలు తమ కష్టార్జితాన్ని పిల్లల ఉన్నత చదువుల కోసం, పెళ్లి కోసం, ఇతర అవసరాల కోసం ఎల్ఐసీలో పెడుతుంటారని, ఇప్పుడు ఆ సొమ్మంతా తీసుకెళ్లి అదానీ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టడం వల్ల కోట్లాది మంది ఎల్ఐసీ పాలసీదారుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని నామా ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ వ్యవహారంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంటే, మన దేశంలో చర్చ జరగకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై చర్చకు అనుమతించే వరకు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఉభయ సభల్లో పోరాడుతుందని అన్నారు.

అక్రమార్జనతో ప్రభుత్వాలను పడగొట్టే కుట్ర: కొత్త ప్రభాకర్ రెడ్డి

అక్రమ మార్గాల్లో అదానీ గడించిన సొమ్ముతో ప్రభుత్వాలను పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. అందుకే అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిట్టనిలువుగా ఎదిగేలా ప్రభుత్వ పెద్దలు సహకరించాలని ఆరోపించారు. ఇలాంటి అక్రమాలు, అవకతవలను హిండెన్‌బర్గ్ నివేదిక లేవనెత్తిందని చెప్పారు. గ్రామాల్లో ఎల్ఐసీతో సంబంధం లేని వ్యక్తి లేడని, అలాంటి ప్రజాధనాన్ని తీసుకెళ్లి అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని అన్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పట్టుబడుతూ అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో, శాసన మండళ్లలో తీర్మానాలు చేయాలని ప్రభాకర్ రెడ్డి అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement