Thursday, April 18, 2024

దశాబ్దాంతానికి 6 జీ సేవలు.. త్వరలో 5 జీ నెట్‌వర్క్‌..

న్యూఢిల్లి : కాంగ్రెస్‌ పాలనలో 2 జీ అవినీతి, విధానపరమైన అవకతవకల కారణంగా దేశంలోని అన్ని రంగాలలో అభివృద్ది దాదాపు పదేళ్ల పాటు కుంటుపడిందనీ, తాము అధికారంలోకి వచ్చిన తరువాత దేశం టెలికామ్‌ రంగంలో శరవేగంగా దూసుకెళ్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. 5జీ, 6జీ వైపు దేశం దూసుకెళ్తున్నదని అన్నారు. భారత టెలికం రెగ్యులేటర్‌ అథారిటీ (ట్రాయ్‌) రజతోత్సవాలలో ప్రసంగిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దశాబ్దం చివరినాటికి దేశంలో 6 జీ టెలికమ్‌ నెట్‌ వర్క్‌ను అందుబాటులో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో 3 జీ , 4 జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరి కొద్దినెలలో 5 జీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఆయా కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 5 జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తే 450 బిలియన్ల డాలర్లు భారత ఆర్థిక రంగానికి సమకూరుతాయని ఆయన అన్నారు. దేశంలో 6 జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి టాస్క్‌ఫోర్స్‌ పనిచేస్తున్నదని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

‘2 జీ హయాంలోని అవినీతి, నిరాశ, నిస్పృహ, విధానపరమైన లోపాలనుంచి దేశం బయటపడింది. 3 జీ నుంచి 4 జీకి, 5 జీ నుంచి 6 జీకి ఇప్పుడు భారత టెలికమ్యూనికేషన్‌ రంగం పరుగులు పెడుతున్నది’ అని మోడీ తెలియజేశారు. ఆరోగ్యకరమైన పోటీని సృష్టించడం వల్ల మన టెలికమ్‌ రంగం సామర్థ్యం సానపట్టినట్లు రాటుతేలిందని, స్వయం సమృద్ధి సాధించి… సమాజంపైన, ఆర్థిక రంగంపైనా బహుముఖ ప్రభావాన్ని చూపిస్తున్నదని మోడీ ప్రశంసించారు. ఈ సందర్భంగా మోడీ 5 జీ టెస్ట్‌ బెడ్‌ను ఆవిష్కరించారు. మద్రాస్‌ ఐఐటీ సారథ్యంలో ఎనిమిది సంస్థలు దీనిని అభివృద్ధి చేశాయి. ‘టెలికమ్‌ రంగంలోని సాంకేతిక అంశాలలో దేశం స్వయం సమృద్ధి సాధించడంలో ఈ 5 జీ టెస్ట్‌ బెడ్‌ అభివృద్ధి ఓ కీలక ముందడుగు. 5 జీ టెక్నాలజీ దేశ పాలనా తీరుతెన్నులలో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. వ్యక్తిగత జీవితంతో పాటు… వాణిజ్యం, వ్యాపార రంగంలో కూడా

విప్లవాత్మకమార్పులు వస్తాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మౌలికసదుపాయాల కల్పన, సరకు రవాణా రంగాలలో వృద్ధి వేగం పెరుగుతుంది. ఇది ఉద్యోగ అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది’ అని మోడీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘అనుసంధానమే దేశ ప్రగతి వేగాన్ని నిర్ధారిస్తుంది. అందువల్ల అన్ని స్థాయిలలో కూడా ఈ అసుసంధానాన్ని ఆధునీకరించాల్సి అవసరం ఉంది’ అని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి గ్రామం ఇప్పుడు ఆప్టికల్‌ ఫైబర్‌తో అనుసంధానమైనదని ఆయన అన్నారు. 2014కు పూర్వం వంద గ్రామాలకు కూడా ఈ కెనెక్టివిటీ లేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు దాదాపు 2.5 లక్ష గ్రామపంచాయతీలకు బ్రాడ్‌ బాండ్‌ కనెక్టివిటీ ఉందని అన్నారు. దేశంలోని పేదలలోకెల్లా పేదవారికి కూడా మొబైల్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే దేశంలోనే మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చామని ఆయన తెలియజేశారు. ఒకప్పుడు కేవలం 2 మాత్రమే ఉన్న ఈ యూనిట్లు ఇప్పుడు 200 దాటాయని ఆయన చెప్పారు. టెలిడెన్సిటీ, ఇంటర్‌నెట్‌ వినియోగదారుల విషయంలో ఇండియా అత్యంత వేగంగా విస్తరిస్తున్నదని మోడీ తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement