Friday, March 29, 2024

వ్యక్తిగత డేటా దుర్వినియోగానికి 500 కోట్లు జరిమానా.. డేటా రక్షణ బిల్లుకు సవరణ

వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్రం సవరణ చేసింది. కొత్త సంస్కరణలతో కూడిన ముసాయిదాను ప్రజల సంప్రదింపుల కోసం శుక్రవారం విడుదల చేసింది. డేటా ఉల్లంఘనలకు నిరోధించేందుకు అవసరమైన భద్రత చర్యలు తీసుకోవడంలో విఫలమైన సంస్థలకు రూ.500 కోట్ల వరకు జరిమానా విధించేలా కఠిన నిబంధనలు రూపొందించారు. సమాచార దుర్వినియోగానికి పాల్పడితే విధించే జరిమానాలను భారీగా పెంచాలని ముసాయిదాలో ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనుట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ముసాయిదా ప్రకారం చట్టంలోని నిబంధనలు పాటించడంలో విఫలమైన సంస్థలకు గరిష్టంగా రూ.500 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఉల్లంఘన స్థాయిలు, తీరును బట్టి జరిమానాలు ఉంటాయి. కంపెనీలు సేకరించే వ్యక్తిగత సమాచారం స్థానికంగానే నిల్వచేయడం, నిల్వచేసే కాలపరిమితి, మునుపటి సమాచారాన్ని తొలగించడం వంటి అంశాలు ముసాయిదా బిల్లులో ఉన్నాయి. ఈ చట్టం అమలుకోసం డేటా ప్రొటెక్షన్‌ బోర్డు ఆఫ్‌ ఇండియాను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. కొత్తగా రూపొందించిన ముసాయిదా బిల్లు డిసెంబర్‌ 17 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

త్వరలో పార్లమెంట్‌ ముందుకు..

- Advertisement -

సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ వేదికల్లో చోటుచేసుకునే సమాచార ఉల్లంఘనలను నియంత్రించేందుకు, వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం 2019లోనే తీసుకొచ్చింది. ఉల్లంఘనలకు పాల్పడే సంస్థలకు రూ.15 కోట్లు లేదా , సంస్థ టర్నోవర్‌లో 4శాతం జరిమానా విధిస్తామని పేర్కొంది. అయితే, దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో, బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపడం జరిగింది. దీనిని పరిశీలించిన జేసీసీ 80కిపైగా సూచనలు చేసింది. దీంతో నాలుగేళ్ల చర్చల తర్వాత, ప్రభుత్వం ఆగస్టు 3న వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు- 2019ని ఉపసంహరించుకుంది.

దాని స్థానంలో సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌, ‘సమకాలీన డిజిటల్‌ గోప్యతా చట్టాలను అందించే కొత్త వెర్షన్‌ కోసం ముసాయిదా రూపొందించింది. కొత్త డ్రాప్ట్‌ మునుపటి డేటా స్థానికీకరణ ఆదేశాన్ని సులభతరం చేసింది. ఇది అనేక పెద్ద బహుళజాతి సాంకేతిక కంపెనీలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం అవసరమైన అంశాలను పరిశీలించిన తర్వాత, వ్యక్తిగత డేటాను భారత్‌కు వెలుపల భూభాగాలకు బదలీ చేసుకోవచ్చు.

కఠిన నిబంధనలతో ముసాయిదా..

కొత్త ముసాయిదాకు డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు- 2022 అని పేరు పెట్టారు. ఇది డేటాను సేకరించడానికి షరతులతోపాటు, డేటా ప్రాసెస్‌ చేయబడే వ్యక్తుల సమ్మతిని నిర్దేశించింది. ఎవరిదైనా డేటా తీసుకునే ముందు, విశ్వసనీయ వ్యక్తి వారికి తప్పనిసరిగా, వారి కోరిన భాషలో నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర ‘డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా’ని నియమించుకోవడానికి ముసాయిదా బిల్లు వీలు కల్పిస్తుంది. నిబంధనలకు విరుద్ధమైన వాటిని బోర్డు నిర్ణయిస్తుంది. నిబంధనలు పాటించని వారికి జరిమానాను కూడా విధిస్తుంది. వ్యక్తిగత డేటా ఉల్లంఘన జరిగినప్పుడు ప్రభావితమైన ”డేటా ప్రిన్సిపల్స్‌”కు తెలియజేయడంలో విఫలమైతే రూ. 500 కోట్ల వరకు బోర్డు జరిమానా విధించవచ్చు. పిల్లల వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన బాధ్యతల నిర్వహణలో విఫలమైతే, రూ. 200 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం ఉద్దేశ్యం ఏమిటంటే, వ్యక్తులు తమ డేటాను రక్షించుకునే హక్కును, చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం వ్యక్తిగత డేటాను ప్రాసెస్‌ చేయవలసిన అవసరం రెండింటినీ గుర్తించే విధంగా డిజిటల్‌ వ్యక్తిగత డేటాను ప్రాసెస్‌ చేయడానికి వీలు కల్పిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement