Thursday, April 18, 2024

ఒక్కో పోస్టుకు 50 మంది పోటీ.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఎలాగైనా జాబ్‌ కొట్టాలన్న గట్టి పట్టుదలతో సిద్ధమై పరీక్షలు రాసిన అనేక మంది అభ్యర్థులకు ఆకాంక్షను నెరవేర్చే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు సంక్రాంతి పండగకు ఒకరోజు ముందుగానే విడుదలయ్యాయి. మల్టీజోన్‌, రిజర్వేషన్ల వారీగా చూస్తే ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొప్పున మెయిన్స్‌కి ఎంపికయ్యారు. ప్రిలిమ్స్‌లో మొత్తం 25,050 మందిని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. మహిళా రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాల మేరకు సమాంతర విధానమే అనుసరించినట్లు స్పష్టంచేసింది. మెయిన్స్‌ పరీక్షల పూర్తివివరాలను ఈనెల 18న ప్రకటించనున్నట్లు- టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే గ్రూప్‌-1లో 503 పోస్టులకు గానూ మెయిన్స్‌కి 25050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మల్టీజోన్‌, రిజర్వేషన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున కాంపిటిషన్‌ కనిపిస్తోంది. రెండో మల్టీజోన్‌ అంధ్ర, బధిర మహిళల రిజర్వేషన్‌లో తగినంత మంది అభ్యర్థులు లేకపోవడంతో, ఆ పోస్టులకు 50 మంది చొప్పున ఎంపిక చేయలేకపోయినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సమానమార్కులు వచ్చిన వారీలో తెలంగాణ స్థానికులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లు కమిషన్‌ వెల్లడించింది. స్థానికుల్లో సమానమార్కులు వస్తే ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యమిచ్చినట్లు పేర్కొంది. మహిళలకు వర్టికల్‌ విధానంలో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు నోటిఫికేషన్‌లో టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

- Advertisement -

అయితే హైకోర్టు ఆదేశాల మేరకు సమాంతర విధానాన్ని అనుసరించినట్లు- కమిషన్‌ వెల్లడించింది. ఓఎంఆర్‌ పత్రంలో వ్యక్తిగత వివరాలను బబ్లింగ్‌ చేయకుండా తప్పుడుగా ఉన్నవాటిని మూల్యాంకనం చేయలేదని కమిషన్‌ పేర్కొంది. జూన్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపిన టీఎస్‌పీఎస్సీ ఈనెల 18న పరీక్షల పూర్తి విధానాన్ని ప్రకటించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో 503 పోస్టుల కోసం 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా గత ఏడాది అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 2లక్షల 85వేల 916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అక్టోబరు 29న ప్రకటించిన ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలు, సబ్జెక్టు నిపుణుల సిఫార్సు మేరకు 5 ప్రశ్నలను కమిషనన్‌ తొలగించింది. మొత్తం 150 ప్రశ్నల్లో అయిదింటిని తొలగించిన నేపథ్యంలో 145 ప్రశ్నలను 150కి దామాషా పద్ధతిలో లెక్కించి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు.

న్యాయ పరమైన చిక్కులు రావడంతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలవెల్లడిలో కొంత జాప్యం జరిగింది. బబ్లింగ్‌ చేసిన ఓఎంఆర్‌ సమాధాన పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ కొందరు అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేయగా, వాటిని హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లను నిలువు పద్ధతిలో కాకుండా సమాంతర విధానంలో పరిగణనలోకి తీసుకోవాలని పిటిషన్లు దాఖలు కాగా, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే వ్యవహరించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిలువు పద్ధతిలో కాకుండా సమాంతర విధానాన్నే పరిగణలోకి తీసుకున్నారు. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పుపై టీఎస్‌పీఎస్సీ వేచిచూసింది. ఆ తీర్పును టీ-ఎస్‌పీఎస్సీ సవాల్‌ చేయడంతో అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని, ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదల చేయవచ్చునని హైకోర్టు ధర్మాసనం అనుమతినిచ్చింది. ఆటంకాలు తొలగిపోవడంతో ప్రిలిమ్స్‌ ఫలితాలను ఎట్టకేలకు టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement