Friday, March 29, 2024

దేశంలో కొవిడ్‌ మృతులు 40 లక్షలు.. రాహుల్‌ గాంధీ ట్వీట్‌..

కొవిడ్‌ మహమ్మారికి దాదాపు 40 లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రపంచ వ్యాప్త కొవిడ్‌ మరణాలను బహిర్గతం చేయాలన్న డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నాలకు భారత్‌ అడ్డుపడుతోందంటూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’లో ప్రచురితమైన కథానాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అధికారిక లెక్కల కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ మరణాలు ఉండొచ్చని డబ్ల్యుహెచ్‌ఒ అంచనా వేసింది. దీనిని ప్రస్తావిస్తూ, మోడీ ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ టార్గెట్‌ చేశారు. ప్రధాని నిజం చెప్పరు. ఇతరులను నిజం మాట్లాడనివ్వరు. గతంలో నేను చేసిన వాదన నిజమని ఇప్పుడు నిరూపితమైంది. ఆక్సిజన్‌ కొరతతో ఎవరూ మరణించలేదని వారు ఇప్పటికీ అబద్దాలు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 40 లక్షల మంది పౌరులు మరణించారని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాల్ని అంగీకరించాలి. బాధిత కుటుంబానికి రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. మీ బాధ్యత నెరవేర్చండి అని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కాగా కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, దేశంలో 5.21 లక్షల మంది కొవిడ్‌తో మరణించారు. దేశంలో కరోనా మృతుల సంఖ్యను లెక్కించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జనాభాలో, విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను వర్తింపజేయడంలో ఔచిత్యాన్ని తప్పుబట్టింది. ఇదే అంశంపై తాజాగా ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన కథనాన్ని ఖండించింది. కొన్ని దేశాలకు అనుసరిస్తున్న విధానాన్ని భారత్‌కూ వర్తింపజేయడం తగదని పేర్కొంది. అయితే, తమ అభ్యంతరం ఫలితాల గురించి కాదనీ, దానికి అనుసరిస్తున్న విధానాన్నే తప్పు పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement