Sunday, February 5, 2023

21 అండమాన్ దీవులకు పరమవీరచక్ర గ్రహీతల పేర్లు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాన మంత్రి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పరాక్రమ్ దివస్ సందర్భంగా అండమాన్ దీవుల్లో ఇప్పటి వరకు పేరు పెట్టని 21 పెద్ద దీవులకు కేంద్ర ప్రభుత్వం పరమవీరచక్ర గ్రహీతల పేర్లతో నామకరణం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ రక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన సైనికులను స్మరించుకుంటూ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీరచక్రను ఇప్పటి వరకు పొందిన 21 మంది సైనికాధికారులు, సైనికుల పేర్లను అండమాన్ దీవులకు పెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక నమూనాను సైతం ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. భావితరాలు చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతాయని, అండమాన్ – నికోబార్ దీవులకు ఇదొక చారిత్రాత్మకమైన రోజు అని ప్రధాన మంత్రి అన్నారు.

అమరవీరుల పేర్లు పెట్టిన 21 దీవులు నిరంతరం ప్రేరణనిస్తాయని వ్యాఖ్యానించారు. అండమాన్ – నికోబార్ దీవుల చరిత్రను గుర్తుచేస్తూ ఇక్కడ మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారతదేశంలో మొదటి స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడిందని ప్రధాని తెలియజేశారు. వీర్ సావర్కర్ సహా ఆయనలా అనేక మంది ఈ నేలపై దేశం కోసం త్యాగం చేశారని అన్నారు. అండమాన్ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సెల్యూలర్ జైలు స్వాతంత్ర్య సమరయోధులు ఎదుర్కొన్న కష్టాన్ని, బాధను గుర్తుచేస్తుందని అన్నారు. వలస పాలన నుంచి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించడం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అండమాన్ దీవుల్లోని రాస్ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా పేరు మార్చిందని ఆయన గుర్తుచేశారు. అలాగే నీల్, స్వరాజ్ దీవులు స్వరాజ్, షహీద్ దీవులుగా మారాయని తెలిపారు.

- Advertisement -
   

అండమాన్‌లో నేతాజీ తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చోటే ఆకాశమంత భారత జెండాను ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రదేశాన్ని సందర్శించే దేశవాసులందరి హృదయాల్లోనూ దేశభక్తిని నింపుతున్నట్టవుతుందని అన్నారు. నేతాజీ జ్ఞాపకార్థం నిర్మించనున్న కొత్త మ్యూజియం, మెమోరియల్ అండమాన్ పర్యటకాన్ని మరింత చిరస్మరణీయంగా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం అనేక మంది అనేక విధాలుగా పోరాడి ప్రాణత్యాగాలు చేశారని, కానీ ఇంతకాలంగా అలాంటి ఎంతోమంది నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయ్యాయని ప్రధాని అన్నారు. గత 60-70 ఏళ్లుగా జరగాల్సిన కార్యక్రమాలు గత 8-9 సంవత్సరాలుగా తాము చేపట్టామని అన్నారు. దేశంలోని ఈ ప్రాంతంలో 1943లో స్వతంత్ర భారతదేశంలో మొదటి ప్రభుత్వం ఏర్పడిందని, దానిని దేశం గర్వంగా అంగీకరిస్తోందని ఆయన నొక్కి చెప్పారు.

ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురవేసి దేశం నేతాజీకి నివాళులర్పించిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా నేతాజీ జీవితానికి సంబంధించిన ఫైళ్లను డిక్లాసిఫై చేయాలన్న డిమాండ్‌ను ప్రధాని నొక్కి చెప్పారు. 21 దీవులకు పేరు పెట్టడం వెనుక ఉన్న ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ విశిష్ట సందేశం ఉందని ప్రధాని చెప్పారు. ఇది దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల శౌర్యం, పరాక్రమానికి సంబంధించిన సందేశమని ప్రధాని అన్నారు. 21 మంది పరమవీర చక్ర విజేతలు భారతమాతను రక్షించేందుకు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారని, భారత సైన్యంలోని వీర సైనికులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారని, వివిధ భాషలు, మాండలికాలు మాట్లాడే వారని, విభిన్న జీవనశైలిలో జీవించారనిప్రధాన మంత్రి చెప్పారు. వారిని ఏకం చేసిన మాతృభూమి పట్ల అచంచలమైన భక్తిని ప్రదర్శించారని తెలిపారు. “సముద్రం వివిధ ద్వీపాలను కలుపుతున్నట్లుగా, ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన భారతమాత యొక్క ప్రతి బిడ్డను ఏకం చేస్తుంది” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

అండమాన్ దీవులకు పేరు పెట్టడం ద్వారా పరమవీర్ చక్ర అవార్డు గ్రహీతలకు మాత్రమే కాకుండా భారత సాయుధ దళాలకు అంకితం చేసినట్టేనని మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మన సైన్యం యుద్ధాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేసిన ప్రధాని, మన సైనిక బలగాలు అన్ని రంగాల్లో తమ శౌర్యాన్ని నిరూపించుకున్నాయని అన్నారు. ముఖ్యంగా వక్రీకరించిన సైద్ధాంతిక రాజకీయాలతో దశాబ్దాల తరబడి ఉన్న న్యూనతాభావం, ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల దేశ సామర్థ్యాన్ని గుర్తించడంలో గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ మరియు నికోబార్ వంటి సముద్ర ద్వీప ప్రాంతాల అభివృద్ధి దశాబ్దాలుగా విస్మరణకు, నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు. సింగపూర్, మాల్దీవులు, సీషెల్స్ వంటి అభివృద్ధి చెందిన ద్వీప దేశాలతో పోల్చితే అండమాన్, నికోబార్ దీవుల విస్తీర్ణం చాలా పెద్దదని, కానీ వాటిని అభివృద్ధి చేయకపోవడం వల్ల వెనుకబడిపోయాయని అన్నారు.

అభివృద్ధి చెందిన ద్వీపదేశాలతో సరిసమానంగా.. ఇంకా చెప్పాలంటే వాటి కంటే ధీటుగా అభివృద్ధి చెందేందుకు అన్ని అవకాశాలు, అర్హతలు ఈ దీవులకు ఉన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ దీవులకు సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఈ దీవుల్లో డిజిటల్ యుగం మొదలైందని, అభివృద్ధి దిశగా దీవులు ముందుకు దూసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement