Sunday, June 20, 2021

రెండు నెలల్లో రెండు కోట్లకు పైగా ఉద్యోగాలు హుష్ కాకి

కరోనా మహమ్మారి దేశంలో లక్షలాది మందిని పొట్టనబెట్టుకోవడమే గాక, కోట్లాది మందికి ఉపాధిని దూరం చేస్తోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండగా.. కేవలం గత రెండు నెలల్లో 2 కోట్లకుపైగా ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఏప్రిల్‌, మే నెలల్లో దేశవ్యాప్తంగా 2.27 కోట్ల మంది బతుకుదెరువు కోల్పోయి రోడ్డునపడ్డారని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) సీఈవో మహేశ్‌ వ్యాస్‌ తెలిపారు. ‘దేశంలో 40 కోట్ల మంది ఉద్యోగులున్నారు. ఇందులో 2.27 కోట్ల మంది గడిచిన రెండు నెలల్లోనే ఉద్యోగాలను కోల్పోయారు. ఇందుకు కరోనా పరిస్థితులే కారణమని వివరించారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం అసంఘటిత రంగం కంటే సంఘటిత రంగంపైనే ఎక్కువగా ఉందని వ్యాస్‌ వెల్లడించారు. లాక్‌డౌన్లతో తక్షణ ప్రభావం అసంఘటిత రంగంపై పడిందని, అయితే సంఘటిత రంగాన్ని తదనంతర పరిణామాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే చిరు వ్యాపారులు తదితర అసంఘటిత రంగంలోనివారికి దూరమైన ఉపాధి మళ్లీ లభిస్తున్నదని, కానీ ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేస్తున్నవారు ఉద్యోగాలు కోల్పోతే తిరిగి రాని పరిస్థితులున్నాయన్నారు. ఒకవేళ దొరికినా అవి అర్హతకు తగిన ఉద్యోగాలు కావన్న ఆయన కొత్త కొలువులకు ఏడాదైనా సమయం పట్టవచ్చని అంచనా వేశారు.

గత ఏడాది కరోనా వైరస్‌ మొదలైన దగ్గర్నుంచి ఇప్పటిదాకా గృహస్తుల ఆదాయం ఏకంగా 97 శాతం క్షీణించిందని సీఎంఐఈ సర్వేలో తేలింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 1.75 లక్షల గృహస్తుల అభిప్రాయాలతో సర్వే జరిగింది. ఇందులో కేవలం 3 శాతం మందే తమ ఆదాయం పెరిగినట్లు చెప్పారు. 55 శాతం మంది క్షీణించినట్లు చెప్పగా, 42 శాతం మంది ఏడాది క్రితం ఎలా ఉందో అలాగే ఉందన్నారు. దీంతో ద్రవ్యోల్బణం ఆధారంగా 97 శాతం మంది ఆదాయాలు పడిపోయినట్లు తేల్చామని వ్యాస్‌ అన్నారు. కాగా.. గతేడాది మే నెలలో నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో 23.5 శాతంగా ఉందని, లాక్‌డౌనే దీనికి కారణమని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News