Saturday, April 20, 2024

భారత్ నుంచి శ్రీలంకకు 2.7లక్షల టన్నుల ఇంధనం.. కృతజ్ఞతలు తెలిపిన జయసూర్య

న్యూఢిల్లి : ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు భారత్‌ అత్యవసర సహాయానికి ముందుకొచ్చింది. ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు బియ్యాన్ని ఎగుమతి చేస్తుండగా.. తాజాగా చమురు సరఫరాతో మరింత సాయం అందించింది. ఇప్పటి వరకు ఆ దేశానికి 2.7లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా పలు రకాల ఇంధనాలను సరఫరా చేసింది. ఈ మేరకు శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. భారత్‌ నుంచి ఇంధన కొనుగోళ్లకు 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాయంలో భాగంగా బుధవారం 36,000 మెట్రిక్‌ టన్నుల పెట్రోల్‌, 40000 మెట్రిక్‌ టన్నుల డీజిల్‌తో రెండు కన్సైన్‌మెంట్‌లను శ్రీలంకకు అందజేసినట్లు చేసినట్లు భారత ఎంబసీ వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ క్రెడిట్‌ లైన్‌ కింద 2,70,000 మెట్రిక్‌ టన్నులకు పైగా పలు రకాల చమురును సరఫరా చేసినట్లు తెలిపింది.

పెద్దన్నకు రుణపడి ఉంటాం: జయసూర్య..

సంక్షోభ సమయంలో భారత్‌ అందిస్తోన్న సాయం పట్ల ఆ దేశ మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య స్పందిం చారు. భారత్‌ను పెద్దన్నగా అభివర్ణించారు. ”మా పొరుగు దేశం, పెద్దన్న అయిన భారత్‌ మాకు ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుంది. భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మేం రుణపడి ఉంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంక్షోభం నుంచి కోలుకోవడం అంత సులువైన పని కాదు. కానీ, భారత్‌ లాంటి దేశాలు ఆదుకుంటే దీన్ని నుంచి త్వరగా బయటపడతామని ఆశిస్తున్నాం” అని జయసూర్య తెలిపారు. కాగా, తాజా పరిస్థితులపై పార్లమెంట్‌ స్పీకర్‌ హెచ్చహరికలు చేశారు. ఈ సంక్షోభం కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఆకలితో అలమటిస్తామని స్పీకర్ మహింద యాప అబేయవర్ధనే హెచ్చరించారు. ఆహారం, గ్యాస్‌, విద్యుత్తు కొరత మరింత క్షీణించనుందని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement