Friday, March 29, 2024

భక్తుల దారెటు…ఆంక్షలు ఆపేయటమా ?

కరోనా రెండో దశ శరవేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ఆలయాల్లో భక్తులను దర్శనాలకు అనుమ తించడంపై దేవదాయశాఖ పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగాపెరుగుతోంది. గత వారం రోజుల వ్యవధిలో 15 వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెపుతున్నారు. ఇప్పటికే ప్రజలకు సంబంధించి కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు మీమాంసలో పడ్డారు. గత నెల మూడో వారం నుంచి ప్రధాన ఆలయాల్లో నిత్య అన్నదానం కార్యక్రమాలను నిలిపేశారు. ఆలయాల సందర్శనకు వచ్చే భక్తులకు ప్యాకెట్ల రూపంలో సాంబారు అన్నం, దద్దోజనం సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తుల దర్శనాల విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలను రెండు మూడు రోజుల్లో తీసుకునే అవకాశం ఉన్నట్లు దేవదాయశాఖ వర్గాల సమాచారం. ఇప్పటికే సోమవారం నుంచి తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు సర్వదర్శనం నిలిపేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రత్యేక దర్శనాల విషయంలో సైతం పరిమితులు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో మిగిలిన ఆలయాల్లోని పరిస్థితులపై చర్చ జరుగుతోంది. గతేడాది మార్చి 22న లాక్ డౌన్ విధించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో భక్తుల దర్శనాలు ఆపేశారు. కేవలం అధికారులు, అర్చకుల సమక్షంలో నిత్యకైంకర్యాలు నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో జూన్ 12వ తేదీ నుంచి ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతి చ్చారు. తొలి రోజుల్లో ఆన్లైన్ ద్వారా భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తూ క్రమేపీ పరిస్థితులు చక్కబడ్డ తర్వాత పరిమితిని తొలగించారు. మరోసారి కరోనా ఉధృతి పెరుగుతున్న క్రమంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనే సందేహాలు భక్తుల్లో నెలకొన్నాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అధికారుల ఎదుట రెండు ప్రత్యమ్నాయాలున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి పూర్తిగా భక్తుల దర్శనాలు ఆపడం, రెండోది పరిమితం చేయడం. మరి అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది తొందరలోనే స్పష్టమవుతుందని దేవదాయశాఖ వర్గాలు చెపుతున్నప్పటికీ.. ఉన్నతాధికారుల నిర్ణయాలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement