Saturday, April 20, 2024

బియ్యం ఎగుమతులపై ఆంక్షలు?

న్యూఢిల్లి : దేశీయంగా ధరలు అదుపు చేయడం కోసం గోధుమలు, చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం త్వరలో బియ్యం ఎగుమతులపై కూడా పరిమితులు విధించవచ్చునని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గోధుమలు, చక్కెర ఎగుమతులపై భారత్‌ విధించిన నిషేధం… ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు బియ్యం ఎగుమతులపై కూడా ఆంక్షలు విధిస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చునని అంటున్నారు. బియ్యం ఎగుమతులలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉన్న ఇండియా గనుక ఈ నిర్ణయం తీసుకుంటే… కోట్లాది మంది ఆకలి కేకలకు అంతులేకుండా పోతుంది. ప్రపంచ దేశాల ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతుందని వారు కలవరం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో బియ్యం ఎగుమతుల ఆంక్షలు వెలువడవచ్చునని, అయితే, అందువల్ల దేశంలో ధరలు ఏమాత్రం దిగివస్తాయన్నది మాత్రం ప్రశ్నార్థకమేనని వారు అంటున్నారు. అయితే, ఈ అంచనాపై వ్యాఖ్యానించడానికి ఆహార మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులెవరూ అందుబాటులో లేరు. దేశంలో అవసరానికి మించి బియ్యం నిల్వలున్నాయి.

ధరలు కూడా అదుపులోనే ఉన్నాయి. దేశ ప్రజల ప్రధాన ఆహారం బియ్యం, గోధుమలే. ప్రజాపంపిణీ వ్యవస్థలో అత్యధికంగా పంపిణీ అవుతున్నది కూడా ఈ రెండే. ప్రజాపంపిణీ అవసరాల కోసం రాష్ట్రాలు సేకరించే గోధుమల పరిణామం నిరుటితో పోల్చుకుంటే ఈసారి సగానికి పైగా తగ్గిపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో… ప్రజాపంపిణీలో గోధుమలకు రానున్న లోటును బియ్యంతో భర్తీ చేయాలని, ఎక్కువ బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందువల్ల దేశంలో బియ్యం నిల్వల స్థాయిని పెంచుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement