Friday, April 26, 2024

న్యూఢిల్లీ : మెగా ప్రాజెక్టులే ‘టూ రిచ్’ సెంటర్లు!

  • ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
  • భారీ నిర్మాణాలపైనే ఆసక్తి
  • భారత్‌లోనూ భారీ కట్టడాలు
  • కాశ్మీర్‌లో ఎత్తయిన రైలు వంతెన
  • మొతేరా స్టేడియం, వరల్డ్‌ వన్‌ టవర్‌
  • 900కి.మీ చార్‌ధామ్‌ మహా మార్గ్‌
  • భారీ ప్రాజెక్టులతో దీర్ఘకాలిక ప్రయోజనాలు… నిపుణుల విశ్లేషణలు

ప్రపంచవ్యాప్తంగా దేశాల ఆలోచనా ధోరణి మారింది. ఒకప్పుడు పురాతన కట్టడాల్ని తమ దేశ వారసత్వ సంపదగా ప్రదర్శించేందుకు దేశాలు ఆసక్తి చూపేవి. వాటిని చూసేందుకు ప్రపంచ పర్యాటకులొచ్చేవారు. రాన్రాను ఇలాంటి వాటి పట్ల ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లింది. ఇందుకనుగుణంగా ఆధునిక భారీ నిర్మాణాల్ని పర్యాటక కేంద్రాలుగా ప్రదర్శించాలన్న ఉత్సుకత వివిధ దేశాల్లో ఏర్పడింది. ఇలాంటి నిర్మాణాల విషయంలో దేశాల మధ్య పోటీ పెరిగింది. పర్యాటకులు కూడా రాజులు కట్టిన కోటలు, పూర్వీకులు నిర్మించిన మండపాలు, ప్రక ృతి సిద్ధమైన కొండలు, లోయలు చూసేందుకంటే కూడా ఆధునిక నిర్మాణాల్ని వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగా ప్రపంచ పటంలోనే స్థానం సంపాదించేలా భారత్‌ కూడా భారీ మెగా ప్రాజెక్టుల నిర్మాణం మొదలెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన, ఎత్తౖౖెన, పొడవైన నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పనలో ముందడుగేయడంతోపాటు వీటిని చూసేందుకు ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది.
ప్రపంచంలోనే ఎత్తయిన రైలు వంతెనను భారత్‌లో నిర్మించారు. జమ్మూకాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో బక్కల్‌, కౌరీల మధ్య 1315మీటర్ల పొడవైన వంతెనను 1110కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది భూమికి 359మీటర్ల ఎత్తున నిర్మాణమైంది. కాశ్మీర్‌ రైల్వే ప్రాజెక్టులో ఉదంపూర్‌, శ్రీనగర్‌, బారాముల్లా విభాగంలో కట్రా, బనిహల్‌ల మధ్య ఈ వంతెన అత్యంత కీలకమైంది. 260 కిలోమీటర్ల గాలి వేగాన్ని కూడా ఇది తట్టుకోగలదు. దీనిపై నుంచి రైళ్ళు 160కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. తీక్షణమైన పేలుళ్ళను కూడా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం కలిగిన ఇనుము, ఉక్కుల్తో దీన్ని నిర్మించారు. దీనిపై నుంచి రైల్లో ప్రయాణించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతినిస్తోంది. అలాగే అహ్మదాబాద్‌లో నిర్మిస్తున్న మోటేరా స్టేడియం, మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం కంటే అతిపెద్దది. సర్దార్‌పటేల్‌ పేరిట నిర్మిస్తున్న ఈ స్టేడియంలో ఒకేసారి లక్షా10వేల మంది కూర్చుని క్రీడల్ని వీక్షించొచ్చు. దక్షిణముంబయ్‌లోని లోయర్‌పరేల్‌లో నిర్మిస్తున్న వరల్డ్‌ వన్‌ టవర్‌ అత్యాధునిక అతిపెద్ద నివాస సముదాయంగా గుర్తింపు పొందనుంది. 117 అంతస్తుల్తో 440 మీటర్ల ఎత్తున దీన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన నివాస సముదాయంగా దీన్ని పరిగణిస్తున్నారు. దీని నిర్మాణానికి 290మిలియన్‌ డాలర్లు వ్యయం చేస్తున్నారు. అలాగే గుజరాత్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫైనాన్స్‌ టెక్‌ సిటీని గుజరాత్‌లో 8.5మిలియన్‌ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మీస్తున్నారు. ఇదో కొత్త నగరం. దీన్ని అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా రూపుదిద్దుతున్నారు. ఇందులో 80మీటర్ల ఎత్తుగల 200కుపైగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. 20బిలియన్‌ డాలర్లను దీని నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చార్‌ధామ్‌ యాత్రకున్న ప్రపంచ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని చార్‌థామ్‌ మహామార్గ్‌ నిర్మాణం చేపట్టారు. కేదార్‌నాధ్‌, బద్రీనాద్‌, యమునోత్రి, గంగోత్రి క్షేత్రాల్ని ఈ ప్రాజెక్ట్‌ కలుపుతుంది. సుమారు 900కిలోమీటర్ల జాతీయ రహదారిగా దీని నిర్మాణం సాగుతోంది. ఎత్తయిన కొండలు, లోతైన లోయల మీదు 12వేల కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత పర్యాటక ఆసక్తి గొలిపే రహదారిగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ముంబయ్‌ ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ శివాజీ మెమోరియల్‌ కూడా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందగలిగే ఆకర్షనీయ నిర్మాణం. ఆరేబియా సముద్రంలో 126 మీటర్ల పొడవైన చత్రపతి శివాజీ విగ్రహాన్ని 84మీటర్ల పెడస్టల్‌పై ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం వరకు నాలుగులైన్ల రహదారిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం 25వేల కోట్లు వ్యయం చేస్తున్నారు. 1.30లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు సాగుతున్నాయి. అలాగే దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లిd, ముంబయ్‌, కలకత్తా, చె న్నైలను కలుపుతూ రైల్వే ఫ్రైట్‌ కారిడార్‌ల నిర్మాణం సాగుతోంది. ఇదికూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచే నిర్మాణ ప్రక్రియే. వీటి వల్ల దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ప్రపంచ స్థాయి ప ర్యాటకుల్ని ఇవి ఆకర్షిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి ప్రయత్నం జరగడంలేదు. ఈ రాష్ట్రంలో ఒక్క మెట్రో నగరం కూడా లేదు. విశాఖ లేదా అమరావతిల్లో ఇలాంటి భారీ నిర్మాణాలకు అవకాశముంది. ఈ దిశగా ప్రభుత్వం యోచించాలి. లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్‌ ఏ విధంగానూ ఆకర్షించగలిగే పరిస్థితుండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి భారీ నిర్మాణాలు కొన్ని దశాబ్దాల పాటు సాగుతాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించినా ఏళ్ళ తరబడి ఇవి కొనసాగుతూనే ఉంటాయి. మోడి ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్‌లో ప్రారంభించిన భారీ ప్రాజెక్టులు ఇప్పటికీ నిర్మాణ దశలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మొదలెట్టే ప్రాజెక్ట్లు పూర్తయి ప్రజల వినియోగంలోకొచ్చేసరికి తామధికారంలో ఉంటామా లేదా అన్న సందిగ్ధాన్ని పక్కన పెట్టి రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement