Friday, April 19, 2024

న్యూఢిల్లీ : మాఫియాకు ముకుతాడిలా!

ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ

ఒకప్పుడు ఆదర్శంగా విద్యార్థి, కార్మిక సంఘాల పనితీరు
రోజురోజుకూ పెరిగిపోయిన రాజకీయ జోక్యం
రానురాను మారిన ధోరణి.. హింసాత్మక వైఖరికి ప్రాధాన్యం
యూనియన్ల నుంచి మాఫియా గ్యాంగ్‌లుగా మారుతున్న వైనం
పోర్టులు, గనులు సహా అన్ని రంగాల్లో వారిదే పెత్తనం
మాస్టర్‌ చిత్రం ఇతివృత్తం.. వాస్తవాల దర్పణం
రాజకీయ పార్టీల జోక్యానికి కళ్లెం వేస్తేనే మంచిరోజులు
నిపుణుల సూచనలు

ఇలయ దళపతి విజయ్‌ నటించిన మాస్టర్‌ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం వీక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందులో ఒక అనాధ బాలుడు లారీ యూనియన్‌లను అడ్డంపెట్టుకుని మాఫియాగా మారిన వైనాన్ని సవివరంగా చూపించారు. అలాగే బాలనేరస్థుల కోసం నిర్వహిస్తున్న సంస్కరణ పాఠశాలల్ని కరడుగట్టిన నేరస్థుల్ని తయారు చేసే కార్ఖానాలుగా, బినామీ నేరస్థుల్ని రూపుదిద్దే కేంద్రాలుగా ఎలా తయారు చేస్తున్నారో కళ్ళముందుంచారు. ఇది చిత్రాలకే పరిమితం కాదు. వాస్తవ జీవితంలోనూ దేశంలోని పలు చోట్ల మాఫియాలు ఈ విధంగానే రూపుదిద్దుకుంటున్నాయి…

దేశంలో వివి ధ రంగాల్లో మాఫియా సంస్కృతి పెచ్చుమీరుతోంది. ఇందుకు కారణం ఎవరు? ప్రస్తుత రాజకీయ వ్యవస్థే. స్వాతంత్య్రమొచ్చిన తొలినాళ్ళలో యువతలో నాయకత్వాన్ని పెంచి పోషించే లక్ష్యాలుండేవి. ఇందుకోసం పాఠశాల స్థాయి నుంచి కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యార్ధుల్లో పోటీతత్వాన్ని అలవర్చేవారు. ఇందుకోసం అంతర్గత ఎన్నికలు నిర్వహించేవారు. ఇవి విద్యార్థి దశ నుంచి నాయకత్వం పటిమ పెరిగేందుకు దోహదపడేది. అలాగే సేవా భావాన్ని పెంపొందించేవి. ఇప్పటికీ యూరోప్‌తో పాటు పలు దేశాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. తద్వారా విద్యార్థి దశ నుంచి కొత్త నాయకత్వం పుట్టుకొస్తోంది. రాన్రాను భారత్‌లో విద్యార్థి సంఘాల్లో రాజకీయాలు ప్రవేశించాయి. ఇవి హింసాత్మక ధోరణికి తెరదీశాయి. దీంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. తత్ఫలితంగా ఇలాంటి ఎన్నికల్ని ప్రభుత్వాలు రద్దు చేశాయి.
అలాగే కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా అన్నిరంగాల్లోనూ కార్మిక సంఘాలుండేవి. ఇవి కార్మిక చట్టాలకనుగుణంగా పనిచేసేవి. పోర్టులు, రైల్వేలు, ఆర్‌టీసీ, బొగ్గు గనులు, రవాణా.. ఇలా అన్నిరంగాల్లోనూ ఈ యూనియన్లు విస్తరించాయి. వీటిలో నాయకత్వానికి ప్రజాస్వామ్యయుతంగా పోటీలు జరిగేవి. విజేతలు కార్మిక సంక్షేమం, భద్రతలకు ప్రాధాన్యతనిస్తూ యూనియన్‌ కార్యకలాపాల్ని నిర్వహించేవారు. కర్ణాటకలోని మంగళూరులో పుట్టి బీహార్‌లో రాజకీయ నాయకుడిగా ఎదిగిన జార్జ్‌ ఫెర్నాండేజ్‌ ముందుగా కార్మిక నేతగానే సుప్రసిద్ధుడయ్యారు. దేశంలోని అన్ని ప్రధాన రేవుల్లోనూ ఆయన కార్మిక సంఘాల్ని నెలకొల్పారు. ఆయన పిలుపును కార్మికులు వేదంలా భావించేవారు. ఆయన ఆదేశాలకు కట్టుబడుండేవారు. సమ్మెకు పిలుపిస్తే దేశంలో కార్మిక సంఘాలన్నీ ఒకతాటిపైకొచ్చేవి. రైళ్ళు, రేవులు, గనులు, రవాణా ఇలా.. మొత్తం వ్యవస్థలన్నీ స్తంభించిపోయేవి. రోడ్లపై బస్సులు, ఆటోలు, రిక్షాలు కూడా నడిచేవికాదు. ఇలాంటి పరిస్థితి నుంచి కార్మిక సంఘాలు తప్పుదారి పట్టాయి. బీహార్‌ బొగ్గు గనుల్లో కార్మిక సంఘాలే మాఫియాకు ఊపిరపోశాయి. కొందరు కార్మిక నాయకుల సాయంతో బొగ్గు మాఫియా రూపుదిద్దుకుంది. మొత్తం గనుల్ని తమ గుప్పెట పట్టి ఆదేశాలు జారీ చేస్తోంది.
పలు పోర్టుల్లో కార్మిక వర్గాలు మాఫియాను పెంచి పోషించాయి. వారి ఆదేశాలకు అనుగుణంగానే రేపుల్లో కార్యకలాపాలు జరిగే దుస్థితిని కల్పించాయి. లారీలు, ఇతర వాహనాల నుంచి రేవుపై ఆధారపడ్డ అన్ని వర్గాలను ఈ మాఫియా శాసించడం మొదలెట్టింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికార్లు, రేవు పాలకులు, ప్రజాప్రతినిధులు, రవాణాదార్లు ఎవరైనా ఈ మాఫియా ఆదేశాలకనుగుణంగా నడవాల్సిన పరిస్థితి తలెత్తింది. వారి డిమాండ్‌లు నెరవేర్చిన అనంతరమే రేవుల్లో పని మొదలయ్యే దుస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం కార్మిక సంఘాల్ని పరోక్షంగా రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడమే.
కార్మిక నాయకులకు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు సహకరించడం, వారి అంతర్గత ఎన్నికల్లోకి రాజకీయ నాయకులు ప్రవేశించడం. వారిపై ఆధిపత్యం సాధించే ప్రయత్నంలో పరోక్షంగా పాలకులే మాఫియా ఎదుగుదలకు కారణమౌ తున్నారు. ఆ తర్వాత మాఫియా వల్లో చిక్కుకుని రేవులు, వివిధ పరిశ్రమలు సతమతమౌ తున్నాయి. ఈ పరిస్థితి తొలగాలంటే కార్మిక సంఘాల అంతర్గత వ్యవహరాల్లోకి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రవేశించకుండా దూరం పెట్టాలి. అప్పుడే ఈ వ్యవస్థల్లో మాఫియాను రూపుమాపే అవకాశముంటుందని పరిశీల కులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement