Friday, March 29, 2024

న్యూఢిల్లీ : ప్రమాదపు అంచుల్లో డ్యామ్ లు

భారతదేశ అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టులది కీలకభూమిక. వ్యవసాయ ఆధారిత దేశపు గతిని మార్చి, ఆర్థికవ్యవస్థ పురోభివృద్ధికి బాటలు వేసింది ఈ ఆనకట్టలే. దేశంలోని అనేక సమస్యలకు భారీ ప్రాజెక్టులు పరిష్కారాలు చూపుతాయని భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ బలంగా విశ్వసించారు. అదే నమ్మకంతో బహుళార్థ సాధక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వీటిని భారతదేశపు ఆధునిక దేవాలయాలని సగర్వంగా ప్రకటించారు. ఇలాంటి జలాశయాలు సాగునీటి అవసరాలకే పరిమితం కాకుండా, గృహ, పరిశ్రమ అవసరాలనూ కీలకంగా మారాయి. వ్యవసాయ, గ్రామీణ ఆర్థికవ్యవస్థ అభివృద్ధిని వేగవంతమైన పారిశ్రామికీ కరణ, పట్టణీకరణతో అనుసంధానం చేయడంలో బహుళార్థక ప్రాజెక్టులు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 4,407 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో దాదాపు 1000 ప్రాజెక్టులు యాభై ఏళ్ల కిందట నిర్మించబడ్డాయి. స్వతంత్ర భారతావని తొలినాళ్లలో నిర్మించిన ఈ జలాశయాలు ప్రస్తుతం వృద్ధాప్య దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యం, భద్రత ప్రమాదపు అంచుల్లోకి చేరుతోంది. నిర్వహణ పరంగా ఎక్కువ ఖర్చు అవుతుంది. అవక్షేపణ కారణంగా కార్యాచరణ సామర్థ్యం కూడా క్షీణిస్తున్నది. ఈ అంశాలను కెనడాకు చెందిన ఐక్యరాజ్యసమితి వర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వాటర్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌ నివేదిక ఒకటి వెల్లడించింది. వాతావరణ మార్పులు కూడా ఆనకట్టల అవశేష దశను వేగవంతం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కాలంచెల్లిన ప్రాజెక్టుల నిర్వహణ వ్యయాన్ని- ప్రయోజనపై భారత్‌ విశ్లేషించుకోవాలని, వాటి కార్యాచరణ, పర్యావరణ భద్రతను నిర్దారించడానికి సకాలంలో భద్రత సమీక్షలు నిర్వహించాలని సూచించింది. అదే సమయంగా జలాశయాలకు దిగువ ప్రాంతాల నివాసితుల భద్రతను నిపుణులు ఎప్పటికప్పుడు నిర్ధారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
నివేదికలోని కీలకాంశాలు..
– ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు వృద్ధ్యాప్య దశకు చేరుకున్నాయి. ఇవన్నీ 20వ శతాబ్దపు తొలినాళ్లలో లేదా ద్వితీయార్థంలో నిర్మించినవే.
– ఇప్పటికే అనేక పాత ఆనకట్టలు డిజైన్‌ సందర్భంగా నిర్దేశించిన జీవితకాలాన్ని దాటిపోయాయి. అయినా నేటికీ సేవలు అందిస్తూనే ఉన్నాయి.
– ఇండియాలో 2025 నాటికి ఇలాంటి 50 ఏళ్లు నిండుతున్న ప్రాజెక్టులు దాదాపు 1000దాకా ఉన్నాయి. వీటిలో అన్ని ఆనకట్టల జీవితకాలం అర్దశతాబ్దంగా నిర్వచించలేం. వాటి డిజైన్లను బట్టి 30-40 ఏళ్ల జీవితకాలం కలిగిన ప్రాజెక్టులూ కొన్నివున్నాయి.
– దూరదృష్టితో కూడిన డిజైన్‌, చక్కటి నిర్వహణ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు జీవితకాలం 100 ఏళ్ల దాకా ఉండొచ్చని నిపుణుల అంచనా.
– ఏదేమైనా 50 ఏళ్లు దాటిన ప్రాజెక్టు భద్రత సామర్థ్యం ప్రమాదానికి చేరువవుతున్నట్లే భావించారి. గేట్లు, మోటార్లు, ఆనకట్టల భాగాలు తరచూ మరమ్మతులకు గురవుతుంటాయి.
– అందువల్ల నిర్మాణ సమయంలో నిర్దేశించిన కాలం తర్వాత ఆనకట్టలను తొలగించాల్సి ఉంది. కానీ ఎక్కడా అలా జరగడం లేదు.
ప్రాజెక్టుల ఆయుష్సు?
ప్రపంచంలోని ఆనకట్టలలో 55 శాతం భారత్‌ సహా కేవలం నాలుగు ఆసియా దేశాల్లోనే ఉన్నాయి. నీటి సరఫరా, ఇంధన ఉత్పత్తి, వరద నియంత్రణ, నీటిపారుదల విషయంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయని ఐరాస విశ్వవిద్యాలయానికి చెందిన డుమిండా పెరెరా, వ్లాదిమిర్‌ స్మఖ్తిన్‌ అభిప్రాయపడ్డారు. నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా క్షీణిస్తున్నది. ఈ అంశాలను నిర్దిష్టంగా శోధించేందుకు ప్రపంచంలో ఎక్కడా ప్రయత్నాలు జరగడం లేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మించాక కాలక్రమంలో ఏదశలోనైనా నిర్మాణ సమస్యలు తలెత్తుతాయి. ఎప్పటికప్పుడు సాధారణ తనిఖీలు, మరమ్మతులు లేకుంటే వృద్ధాప్యపు ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది. అంతర్జాతీయ కమిషన్‌ ఆన్‌ లార్జ్‌ డ్యామ్స్‌ (ఐసీఓఎల్‌డీ) సిఫారసులను జాగ్రత్తగా అమలు చేయడం, సరైన నియంత్రణ చర్యలతో ప్రాజెక్టుల జీవితకాలం వందేళ్లకుపైబడినా ప్రమాదం ఉండదని డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ (డీఆర్‌ఐపీ) డైరెక్టర్‌ ప్రమోద్‌ నారాయణ్‌ వివరించారు. 1980 తర్వాత నిర్మించిన ప్రాజెక్టులు అరుదుగా సంభవించే గరిష్ట వరద, గరిష్ట భూకంపాల తీవ్రతకు అనుగుణంగా నిర్మించబడ్డాయి. ఇతర దేశాలతో పోల్చితే ప్రస్తుతం ఇండియాలోని ప్రాజెక్టుల సగటు ఆయుర్ధాయం 42 ఏళ్లు మాత్రమేనని వివరించారు.
ఇండియా జలాశయాలు..సవాళ్లు
భారత్‌లో 4,407 భారీ ప్రాజెక్టులున్నాయి. అత్యధిక ఆనకట్టలు కలిగిన దేశాల్లో మూడవ స్థానం. చైనా (23,841), అమెరికా (9,263) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 2025 నాటికి ఇండియాలో 50 ఏళ్లు నిండిన ప్రాజెక్టులు 1115దాకా ఉంటాయి. 30 ఏళ్ల దాటేవి 4250 ఉండొచ్చు. మొత్తంగా 64 ప్రాజెక్టులు 150 ఏళ్లు దాటనున్నాయని అధ్యయనం వెల్లడించింది. 2019 జల్‌శక్తి మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం ఇండియాలో 5,334 భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత ఆనకట్టలు క్షీణతకు ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వాటిలో ఎక్కువభాగం మట్టి-భూమి పొరలను కుదించడం ద్వారా నిర్మించబడ్డాయి. కాంక్రీటు భాగం తక్కువ. అందుచేత ఏళ్లు గడిచేకొద్దీ వాటి సామర్థ్యం క్షీణిస్తుంది. రెండవ ప్రతికూల అంశం వర్షపాతం. ప్రతీఏటా సీజన్‌లో సాంద్రీకృత వర్షపాతం నమోదవుతుంది. ఇది ఆనకట్టలపై ఒత్తిడిని పెంచుతుంది. మూడవ సమస్య జలాశయాల్లో సిల్ట్‌, శిథిలాలు పేరుకుపోవడం మూలంగా నీటి సామర్థ్యం తగ్గిపోతుంది. మరోవైపు వరద విపత్తులు ప్రాజెక్టుల సామర్థ్యానికి పరీక్షగా మారుతుంటాయి. వరద కాల్వలు సరిగా పనిచేయనప్పుడు గట్టులోని ఒకవైపు కోతకు గురవుతుంటుంది. భారతదేశంలో 44శాతం ఆనకట్టల వైఫల్యాలకు వరదలే కారణమని తేలింది. మిగతా వాటిలో స్పిల్‌వే సామర్థ్యం, పైపులు వేయడం, పనితనం తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల దెబ్బతింటున్నాయి.
వాతావరణ మార్పుల ప్రభావం
ఏళ్లు నిండిన ప్రాజెక్టులపై వాతావరణ మార్పులు నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ప్రాజెక్టుల సామర్థ్య క్షీణతలో ఇదొక ముఖ్యకోణం. మారుతున్న వర్షపాత నమూనాలు, వరద హెచ్చుతగ్గుల మూలంగా ప్రాజెక్టులోకి నీటి ప్రవాహాన్ని సరిగ్గా అంచనా వేయడం సాధ్యంకాదు. డిజైన్‌లో ఊహించిన దానికి భిన్నంగా ఒక్కోసారి ప్రవాహాలు వస్తుంటాయి. మునుపటి డిజైన్‌ పరిమితులు సమకాలీన పరిస్థితులకు సరిపోకపోవచ్చు. కేరళలోని పెరియార్‌ నదిపై తమిళనాడు సరిహద్దులో 126 ఏళ్ల కింద నిర్మించిన ముల్లపెరియార్‌ ఆనకట్టే ఇందుకు ఉదాహరణ అని ఐరాస నివేదికలో పేర్కొనబడింది. 152 అడుగుల రిజర్వాయర్‌ సామర్థ్యం కలిగిన ఈ ఆనకట్ట, గణనీయమైన నిర్మాణ లోపాలను చూపుతోంది. పైగా ఈ ప్రాజెక్టు భూకంప ప్రభావిత ప్రదేశానికి చేరువగా ఉంది. వందేళ్లు దాటినందున భవిష్యత్‌ ప్రమాదాలను తట్టుకునే సామర్థ్యం దీనికి తక్కువేనన్నది పలు అధ్యయనాల సారాంశం. దీనితోపాటు తెహ్రీడ్యామ్‌ సహా హిమాలయ ప్రాజెక్టులు కొన్ని భూకంప ప్రాంతంలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని కొయినా డ్యామ్‌, వార్నా డ్యామ్‌ కూడా సున్నిత ప్రాంతాల్లోనే నిర్మించబడ్డాయి.
డ్యామ్‌ల నిర్వీర్యం ప్రక్రియ…
కాలం చెల్లిన, నదీ ప్రవాహాన్ని తట్టుకోలేని, నిర్వహణ సామర్థ్యం భారంగా మారిన నేపథ్యంలో, దిగువ ప్రాంత ప్రజల భద్రత కోణంలోనూ ఇలాంటి డ్యామ్‌లను నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. భారత్‌లో ఆనకట్టలను పవిత్రమైనవిగా భావిస్తున్నందున ఇలాంటి ప్రక్రియకు మొగ్గుచూపడం లేదు. డీకమిషనింగ్‌ అనేది కేవలం పర్యావరణ కార్యకర్తల ఆందోళన, చర్చలకే పరిమితం అవుతోంది. 50-60 ఏళ్లు దాటిన ప్రాజెక్టుల భద్రతను ఎప్పటికప్పుడు మదింపుచేసి తదనుగుణంగా నిర్వీర్యం ప్రక్రియను అమలుచేయాలి. కానీ అలా జరగడం లేదు. పైగా వీటిని ధ్వంసం చేయాలంటే భారీ మొత్తంలో ఖర్చవుతుంది. మళ్లిd కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి వ్యయభారం, సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ పరిస్థితికి దేశం సిద్ధంగాలేదు. కనీసం రిజర్వాయర్లలో పేరుకుపోయిన అవక్షేపాల తొలగింపు, ప్రవాహన పునరుద్ధరణ, వరద నియంత్రణపైనా శ్రద్ధవహించడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement