Tuesday, April 16, 2024

న్యూఢిల్లీ : పాలతో ప్రతీకారం

  • ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
  • హిస్సార్‌లో పొంగుతున్న ఉద్యమం
  • పెట్రో ధరలకు సమానంగా పాల ధరల పెంపు
  • మొన్న ఢిల్లీలో రైతులు.. ఇప్పుడు హిస్సార్‌లో పాడి రైతులు
  • అనూహ్యంగా ప్రజల ఆలోచనల్లో మార్పు
  • నచ్చని అంశాలపై పోరు బాటపడుతున్న జనం
  • వెూడీ ప్రభుత్వానికి కాక పుట్టిస్తున్న ఉద్యమాలు

దేశంలో పెట్రోల్‌ ధర లీటర్‌ వంద రూపాయలు దాటింది. డీజెల్‌ ధర కూడా నాలుగైదు రూపాయల తేడాతో దాదాపు అదే దశకొచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజెల్‌ ధరలపై జనం వ్యతి రేకత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం ఇటీవల తెచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాది రైతులు కథం తొక్కు తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని హిస్సార్‌ ప్రాంత రైతులు తాము ఉత్పత్తి చేసే పాల ధరను అనూహ్యంగా పెంచేశారు. తొలుత లీటర్‌ రూ.42 నుంచి 54లకు పెంచారు. కానీ వారి ఆగ్రహం చల్లారలేదు. ఏకంగా లీటర్‌ వంద రూపా యలు చేసేశారు. పెట్రోల్‌ ధరతో సమానంగా పాల ధర ఉండా ల్సిందేనంటూ పట్టుబట్టారు. హిస్సార్‌లో మొదలైన ఈ పాల ధర పెంపు ఉద్యమం ఇప్పుడు హర్యానా, పంజాబ్‌లకు పాకింది. అంచెలంచెలుగా ఉత్తరాది రాష్ట్రాలకు విస్తరిస్తోంది. పాల ధర పెంపు ఆర్థిక లాభం కోసం కాదు. ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి దీన్నొక మార్గంగా రైతులు ఎంచుకున్నారు. తాము మేతవేసి పెంచిన పశువుల నుంచి ఉత్పత్తయ్యే పాల ధర నిర్ణయించే హక్కు తమదేనంటూ ఈ ధర పెంపు ద్వారా వారు ప్రభుత్వానికి తేల్చిచెబుతున్నారు. ధర ఎంత పెరిగినా కిక్కురుమనకుండా పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్న వినియోగదార్లు నిత్యావసరమైన పాలను మాత్రం ధర పెంచితే ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఉద్యమ విధానంలో ఇదో మార్గం. ఆగ్రహాన్ని వ్యక్తపర్చడంలో ఇదో విధానం. ప్రభుత్వంపై తమ నిరసన ప్రదర్శనకు రైతులు ఇప్పుడు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో వారు ఎవర్నీ తిట్టడంలేదు.. కొట్టడంలేదు. ఎలాంటి హింసకు పాల్పడ్డంలేదు. కానీ ప్రతి మనిషిని స్పందింపజేయగలుగుతున్నారు. ఇది ఇప్పుడు దేశీయంగానే కాదు. అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది.
మహాత్ముడి కాలంలో ఆగ్రహం వ్యక్తంచేయడానికి సహాయ నిరాకరణ విధానాన్ని అనుసరించేవారు. అప్పుడున్నది విదేశీ ప్రభుత్వం. బ్రిటీష్‌ పాలకుల విధానాలపై ఆగ్రహం తలెత్తినప్పుడల్లా పన్నులు చెల్లించొద్దంటూ పిలుపునిచ్చేవారు. జనం అందుకు కట్టుబడేవారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం స్తంభించేది. చేతిఖర్చులకు డబ్బుల్లేక విలవిల్లాడే పరిస్థితి వచ్చేది. దీంతో తమ నిర్ణయాలపై వెనక్కి తగ్గేవారు. ప్రజలు, ప్రతినిధులతో చర్చలకు వచ్చేవారు. ఇలా అత్యంత శక్తివంతులైన బ్రిటీష్‌ పాలకులు కూడా తలొగ్గేలా మహాత్ముడు చెయగలిగేవారు.
స్వాతంత్య్రానంతరం దేశ ప్రజల్లో ఉత్సాహం తగ్గింది. నిస్తేజం పెరిగింది. స్వార్థం తప్ప సమాజం పట్ల బాధ్యత కొరవడింది. తమ లాభాల తప్ప విశాల ప్రయోజనాల దృక్పథం నుంచి బయటకొచ్చేశారు. తాను, తన కుటుంబానికి పరిమితమయ్యారు. సమాజం, దేశం కోసం త్యాగాలు చేసే లక్షణాల్ని పక్కనపెట్టేశారు. మనిషిలో నిర్వీర్యం పెరిగింది. ఉద్యమాన్ని మర్చిపోయాడు. చైతన్యాన్ని వదిలేశాడు. మెరుగైన జీవన ప్రమాణాల ఆతృత తప్ప ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాల్లో తప్పొప్పుల్ని ఎంచే నైతిక స్థైర్యం కూడా కోల్పోయాడు. పక్కనున్న మయన్మార్‌లో సాధారణ, అమాయక ప్రజలు అక్కడి సైనిక నియంతపై తిరుగుబాటు చేస్తున్నారు. గత నెల 1వ తేదీన సైన్యం ప్రభ ుత్వాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సాధారణ పౌరులు రోడ్లెక్కారు. ఎన్నికల్లో ఆధిక్యత సాధించిన ఆంగ్‌సాన్‌ సూకికీ పట్టంగట్టాలంటూ డిమాండ్‌ మొదలెట్టారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలంటూ ప్రపంచానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రతిరోజు ఆ దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి. సైన్యాన్ని దిగిపొమన్న డిమాండ్‌తో ప్రజలు రోడ్లెక్కుతున్నారు. వీరిపై సైన్యంతో పాటు వారి అనుకూల వర్గాలన్నీ విరుచుకుపడుతున్నాయి. రాళ్ళు, కర్రలతో దాడులు చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సైన్యం కాల్పులకు కూడా పాల్పడింది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆందోళనకారులు మరణించారు. అయినప్పటికీ వారెవరూ వెనుకంజ వేయడం లేదు. లక్ష్యాన్ని సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు. ఓ వైపు ప్రజలు పోరాటాలు చేస్తుంటే మయన్మార్‌లోని రాజకీయ పార్టీలు మాత్రం సైన్యం అదుపాజ్ఞలకు లోబడి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నాయి. సైన్యానికి ఎదురెళ్ళేందుకు సాహసించడం లేదు. కానీ సాధారణ పౌరులు తమ బాధ్యతను గుర్తెరిగారు. దేశాన్ని నియంతల పాలన నుంచి రక్షించుకునేందుకు కథం తొక్కుతున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు ప్రపంచం మొత్తం మయన్మార్‌పై దృష్టి పెట్టింది. అమెరికా కూడా ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణకు సహకరిస్తామని ప్రకటించింది.
భారత్‌లో దీర్ఘకాలంగా నిర్వీర్యమైన జనాల్లో ఇప్పుడిప్పుడే తిరిగి ఉత్సాహం పురుడు పోసుకుంటున్న వైనం హర్యానా పాల సంఘటనతో బహిర్గతమౌతోంది. మేథావులు, రాజకీయ నాయకులు, గొప్పగొప్ప సంస్కర్తలు కూడా మోడి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే సాహసం చేయడంలేదు. అలాంటిది ఓ సాధారణ, నిరక్షరాస్య రైతులు తమ పాల ఉత్పత్తుల ద్వారా మోడి నిర్ణయంపై వ్యతిరేకతను ప్రపంచం దృష్టికి తేవడంలో కృతకృత్యులౌతున్నారు. నిరసన మార్గాన్ని ప్రదర్శించడంలో వీరు సరికొత్త విధానానికి రూపకల్పన చేశారు. భవిష్యత్‌లో ఈ విధానం మరింత ప్రాచుర్యమయ్యే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement