Thursday, April 18, 2024

న్యూఢిల్లీ : కరోనా…జాగ్రత్తలు పాటిస్తూనే మహమ్మారిపై పోరు – వ్యాక్సిన్ తో జనంలో ధీమా!

దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనికి రాలేదు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మహమ్మారి పీడ విరగడౌతుందన్న ధైర్యం, భరోసా మాత్రం జనంలో కనిపిస్తున్నది. ప్రపంచానికి మహమ్మారి విసిరిన సవాల్ ను ఎదుర్కొనే విషయంలో భారత సైంటిస్టులు చూపిన చొరవ, వేగం, సత్ఫలితం ప్రపంచ దేశాలను అబ్బురప రిచిందనడంలో సందేహం లేదు. అసలు వ్యాక్సినేషన్ విషయంలో భారత్ మొదటి నుంచీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నది. మహమ్మారిని ఎదుర్కొనడంలో మన సైంటిస్టుల సత్తా ప్రతిభ కారణంగా ప్రపంచ దేశాలలో భారత పట్ల గౌరవం పెరిగింది. అదే సమయంలో పొరుగుదేశం అయిన చైనా ఇదే మహమ్మారి విషయంలో అనుసరించిన వైఖరిలోని కపటత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. అగ్రరాజ్యం అమెరికాతో ప్రారంభమై వరుసగా ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి విషయంలో దోషిగా చైనాను అభివర్ణించాయి. కరోనా మూలాలను కనుగొనే ప్రపంచ ఆరోగ్య సంస్థ యత్నాలను ఆ దేశం అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు, కుట్రలను ప్రపంచ దేశాలు ఏవగించుకున్నాయి. అదే సమయంలో కరోనా మహమ్మారిపై పోరు విషయంలో ముందు వరుసలో నిలిచిన భారత్ నే ప్రశంసలతో ముంచెత్తాయి. తాను స్వయంగా మహమ్మారితో పోరాడటమే కాకుండా…ప్రపంచ దేశాల పోరాటానికి ఇతోధిక సహాయాన్ని అందించి ఇండియా ఉదారతకు ప్రపంచం మొత్తం ఫిదా అయ్యిందని చెప్పవచ్చు.  సరిగ్గా నేటికి ఏడాది కిందట  దేశంలోకి ప్రవేశించిన కరోనా  కలకలం సృష్టించింది. అన్ని రంగాలపైనే తీవ్ర ప్రభావాన్ని చూపింది. అదే సమయంలో మనలో మనోనిబ్బరాన్ని పెంచింది. సమష్టిగా మహమ్మారిని ఎదుర్కొనగలమన్న విశ్వాసాన్ని ఇచ్చింది. వైద్యులపై గౌరవాన్ని పెంచింది.  లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు, ఆంక్షలు, నిబంధనలను పాటించడంలో భారతీయులు చూపిన క్రమశిక్షణ, ఆర్థికంగా కుదేలైనా మళ్లీ కోలుకుంటామన్న నమ్మకంతో చూసిన సహనం అద్భుతం. అందుకే  దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. భారతీయుల సంకల్పానికి, మనో నిబ్బరానికీ ఇది నిలువెత్తు నిదర్శనంగా చూడాలి.      సంఖ్య లోనూ, తీవ్రతలోనూ గణనీయమైన రీతిలో కరోనా తగ్గుముఖం పట్టణం శుభపరిణామం. అయితే ఈ దశలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  దేశ జనాభాలో 21 శాతం మంది  కరోనాకు ప్రభావితం అయ్యారన్నది ఒక అంచనా. దేశంలో హెర్డ్ ఇమ్యుూనిటీ రావాలంటే వైరస్ ప్రభావితుల శాతం కనీసం 40 దాటాలి. దీనిని బట్టి చూస్తే మహమ్మారిని పై పోరాటంలో ఇప్పుడు మనం అత్యంత కీలక దశలో ఉన్నాం. జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగడం ద్వారా మాత్రమే పూర్తి విజయం సాధించగలం. వైరస్ అందుబాటులోకి వచ్చింది కదా అన్న నిర్లక్ష్యం తగదు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వంద శాతం పూర్తయ్యే వరకూ కరనా జాగ్రత్తలు పాటించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement