Thursday, March 28, 2024

నేడే లోహాలో కెసిఆర్ బ‌హిరంగ స‌భ‌…గులాబీమ‌యంగా ప‌ట్ట‌ణం..

లోహా – మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలోని లోహా పట్టణం బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాల్గొనే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. లోహా పట్టణంలోని బైల్‌ బజార్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలో సభాప్రాంగణం ముస్తాబైంది. స్టేజీతోపాటు దాదాపు 50 వేల నుంచి 70 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కుర్చీలు, డేరాలతోపాటు వేసవి నేపథ్యంలో సభికుల కోసం కూలర్లను సైతం అమర్చారు. బహిరంగ సభ నేపథ్యంలో కంధార్‌, లోహా పట్టణాలు గులాబీమయమయ్యాయి. ప్రధాన రహదారులను గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో సుందరంగా తీర్చిదిద్దారు.

సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు లోహా పట్టణ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. లోహాలోని ఓ బీఆర్‌ఎస్‌ అభిమాని ఇంట్లో తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి నేరుగా పట్టణంలోని బైల్‌ బజార్‌ సభాప్రాంగణానికి చేరుకుంటారు.. అక్క‌డ జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తారు..

ఇక సభ ఏర్పాట్లను బోధన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు షకీల్‌, జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర కిసాన్‌ సమితి అధ్యక్షుడు మాణిక్‌రావు కదం, కంధార్‌ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే, కన్నాడ్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ జాదవ్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, స్పోర్ట్స్‌ అథారిటీ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ కో కన్వీనర్‌ రాఘవ తదితరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement