Tuesday, April 23, 2024

ఏపీలో మళ్లీ వర్షాలు.. పెన్నా నదికి పోటెత్తుతున్న వరద..

ప్రభన్యూస్‌ : పెన్నానది కర్నాటకలోని నందికొండల్లో పుట్టి అనంతపురం జిల్లా నుంచి పోతున్నా..గడచిన 25 సంవత్సరాలుగా ఈ నదిలో చుక్క నీరు ప్రవహించలేదు. పీఏబీ ఆర్‌ డ్యాం, మిడ్‌ పెన్నార్‌ జలాశయాలకు తుంగభద్ర, హంద్రీనీవా ద్వా రా వచ్చే నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లుగా మారిపోయాయి. రెండు ప్రాంతాల నుంచి నీరు వస్తుండగా..తాజాగా అప్పర్‌ పెన్నార్‌ (పేరూరు) జలాశయం నిండటంతో 12 వందల క్యూసెక్కులను కిందకు వదిలారు. పిఏబిఆర్‌ జలాశయం నిర్మాణానికి రూ.150 కోట్లకు పైగా ఖర్చుపెట్టి పదిటి ఎంసీల సామర్థ్యంతో నిర్మించినా.. కేవలం ఐదు టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయలేని పరిస్థితి. జలాశయం జల్లెడెలా కారిపోతోంది. దీంతో మిడ్‌ పెన్నార్‌ కు నీరు చేరుతోంది. మిడ్‌ పెన్నార్‌ (గార్లదిన్నె) డ్యాం నిండిపోవడంతో వెయ్యి క్యూసెక్కులు కాలువలకు మరో 15 వందల క్యూసెక్కులు పెన్నానదికి వదిలి పెడుతున్నారు. పెన్నా నదిపై మరో జలాశయం తాడిపత్రి నియోజకవర్గంలో చాగల్లు వద్ద నిర్మించారు.

అక్కడి పరిసరాల్లో కురిసిన వర్షాలకు డ్యాం నిండిపోయి కిందకు వదులుతున్నారు. పెనకచర్ల నీరు చేరితే మరింత వరద నీరును కిందకు పంపాల్సి ఉంటుంది. చిత్రావతి బేసిన్‌ లో యోగివేమన, చిత్రావతి రిజర్వాయర్ల గేట్లు ఎత్తి వెయ్యి క్యూసెక్కులు దాకా కిందకు వదులుతున్నారు. జలాశయాల నుంచి నీరు కిందకు వదులుతుండ టంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిపరివాహక ప్రాంతాల రైతులు, ప్రయాణికులు, ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ఎవరూ నదులవైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టాంటాం వేస్తున్నారు. జిల్లాఎస్పీ ఫకీరప్ప ప్రత్యేకంగా సిబ్బందిని అప్రమత్తం చేసి వాగులు, వంకల వద్ద సిబ్బందిని కాపలాగా ఉంచారు.

మరో మూడు రోజులు పాటు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రత్యేక హెల్ప్‌ లైన్లను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా వర్షాల వల్ల సాగు భూముల్లో ఊట నీరు ప్రవహిస్తోంది. దీంతో పంటలు దెబ్బతింటాయని ఊట నీటిని బయటకు పంపించడానికి పోలాల చుట్టు కాలువలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చీని,అరటి, బొప్పాయి, దానిమ్మ,ద్రాక్ష తదితర పండ్లతోటలు, టమోట, మిర్చి, వంగ, కాకర, బీన్స్‌, బిరకాయ తదితర కాయగూరలు పండిస్తున్న రైతులు పోలాల్లో ఉన్న వూట నీటిని బయటకు పంపడానికి నానా తిప్పలు పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement