Friday, April 19, 2024

ఇంట్లో వేలాడుతున్న పాములు.. అద్దె కట్టే వరకు అంతేనన్న యజమాని

పాములు కనిపించాయంటే చాలు మనం ఆమడదూరం పారిపోతాం. అదే ఆ పాములు ఇంట్లో ప్రత్యక్షమైతే? ఇంకేమైనా ఉందా? కానీ జార్జియాకు చెందిన హ్యారీ పగ్లిస్ అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. టిబిలిసి ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న హ్యారీ.. భార్యాపిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. ఇటీవల ఇక్కడ భారీగా వర్షాలు కురిశాయి. దీంతో ఆ ఇంటి పైకప్పు పెచ్చులు బాగా ఊడిపోయాయి.

అంతవరకూ అయితే ఏదోలా అడ్జస్ట్ అయిపోయేదే ఆ కుటుంబం. కానీ ఆ పెచ్చులు ఊడిన ప్రాంతాల నుంచి పాములు వేలాడుతుండటం హ్యారీ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో తను, తన కుటుంబం ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన హ్యారీ.. వెంటనే ఇంటి ఓనర్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. ఎలాగైనా ఆ పాములను తీయించాలని మొరపెట్టుకున్నాడు. అయితే ఆ యజమానురాలు మాత్రం షాకింగ్ సమాధానం ఇచ్చింది. ‘నువ్వు రెండు నెలలుగా అద్దె కట్టలేదు. ముందు అద్దె బాకీ చెల్లించు. ఆ తర్వాత పాముల సంగతి చూస్తా’ అంటూ తాపీగా బదులిచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోని హ్యారీ కుటుంబం.. ఆ పాములు ఉన్న ఆ ఇంట్లోనే భయంభయంగా రెండ్రోజులు గడిపింది. చివరకు తన గోడును సోషల్ మీడియా ద్వారా బయటపెట్టుకున్నాడు. ఆ ఇంట్లో పాములు వేలాడుతున్నఫొటోలను నెటిజన్లతో పంచుకున్నాడు హ్యారీ. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement