Monday, December 9, 2024

అమరావతి : వేగంగా వెలుగొండ

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు పీడిత ప్రాంతా లకు వరప్రసాదినిగా భావిస్తున్న వెలుగొండ ప్రాజెక్టులో కీలక నిర్మాణ దశ అయిన రెండో టన్నెల్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొదటి టన్నెల్‌ పనులు ఇప్పటికే పూర్తి కాగా కొన్ని అనివార్యమైన సాంకేతిక కారణాలతో వాయిదాపడ్డ రెండో టన్నెల్‌ ను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీ-వల ఆదేశాలు జారీ చేసింది. ఏడు నెలల నిర్దేశిత సమయంలో రెండో టన్నెల్‌ పూర్తయ్యేలా పనులను పర్యవేక్షించాలని అధికారులకు ప్రభుత్వం నుంచి తాజాగా ఆదేశాలు అందాయి. శ్రీశైలానికి వరద వచ్చే ఏడాదిలోని సుమారు 45 రోజుల కాలాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా వెలుగొండ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. రెండు టన్నెళ్ళ ద్వారా రోజుకు 11582 క్యూసెక్కు ల చొప్పున 43.5 టిఎంసీల నీటిని ఒడిసి పట్టి ప్రకాశంలోని పశ్చిమ ప్రాంతం, నెల్లూరు, కడప జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేయటమే వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, కొండెపి నియోజవర్గాల్లో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 84 వేల ఎకరాలు, వైఎస్సార్‌ కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో 27,200 ఎకరాలు..మొత్తం 4,47,200 ఎకరాలకు సాగు నీరు, 15.25 లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చేలా వెలుగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
సహాయ పునరావాసంపై దృష్టి
రెండో టన్నెల్‌ పూర్తయ్యలోపు వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని నల్లమలసాగర్‌ నిర్వాసితుల సహాయ పునరావాస (ఆర్‌ అండ్‌ ఆర్‌) పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి టన్నెళ్ళకు నీటిని పంపించి నల్లమలసాగర్‌ ను నింపితే ఈ ఏడాది అక్టోబరు నాటికే అనేక ప్రాంతాలకు కృష్ణా జలాలు అందుబాటు-లోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగానే రెండో టన్నెల్‌ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెండో టన్నెల్‌ కోసం అమెరికాకు చెందిన రాబిన్స్‌ సంస్థ నుంచి డబుల్‌ షీల్డ్‌ టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌ ను దిగుమతి చేసుకుని గతంలోనే పనులు ప్రారంభించినప్పటికీ టీ-బీఎం, కన్వేయర్‌ బెల్టులో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో నిర్దేశిత సమయంలో సొరంగ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇపుడు రాబిన్‌ సంస్థ ప్రతినిధులు వచ్చి బోరింగ్‌ మిషన్‌ లోని విడి భాగాలకు మరమ్మతులు చేయటంతో ఒక వైపు మిషన్‌ తోనూ, మరో వైపు కార్మికులతోనూ టన్నెల్‌ ను పూర్తి చేసే పనిలో ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. మొత్తం 7383 మీటర్ల పొడవున రెండో టన్నెల్‌ తవ్వకం పనులు వేగంగా కొనసాగుతున్నట్టు- ఇంజనీర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement