FIDE Women’s World Cup | వరల్డ్ కప్ విజేతగా దివ్య..

  • ఉత్కంఠ‌ టైబ్రేకర్‌లో హంపిపై ఘన విజయం !

భారత యువ చెస్ ప్లేయర్‌ దివ్య దేశ్‌ముఖ్ (వయస్సు 19) ఫిడే మహిళల వరల్డ్ కప్‌ 2025లో చరిత్ర సృష్టించారు. ఫైనల్‌ మ్యాచ్‌ టైబ్రేకర్‌ వరకు వెళ్లిన పోరులో… భారత సీనియర్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిపై విజయాన్ని సాధించి ప్రపంచ కప్‌ విజేతగా అవతరించారు.

ఫైనల్లో, మొదటి రాపిడ్ గేమ్ డ్రాగా ముగిసింది, కానీ 75-మూవ్‌ల పోరాటం తర్వాత దివ్య రెండవ రాపిడ్‌ను గెలుచుకుంది. చివరి స్కోరు దివ్యకు 1.5, హంపికి 0.5గా నమోదైంది. తెల్లపావులతో ఆడిన దివ్య మెరుగైన ప్రదర్శనతో హంపిపై ఒత్తిడి పెంచి విజయం సాధించడం విశేషం.

ఈ ఘన విజయంతో దివ్య భారతదేశ 88వ గ్రాండ్‌మాస్టర్గా గుర్తింపు పొందారు. ఆమెకు ఇది ఇప్పటివరకు కెరీర్‌లో అతిపెద్ద విజయంగా నిలిచింది.

అనుభవంపై యంట్ టాలెంట్ దూకుడు

కోనేరు హంపి అత్యంత అనుభవం కలిగిన చెస్ ప్లేయర్ కాగా, దివ్య దేశ్‌ముఖ్‌ మాత్రం అంతగా అనుభవం లేని యంగ్ టాలెంట్. నాగపూర్‌కు చెందిన దివ్య, 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా పొందారు. 2023లో ఆసియా ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచారు. చెస్ ఒలింపియాడ్‌లో మూడు బంగారు పతకాలు దక్కించుకున్న దివ్య, 2024లో తొలిసారిగా 2500 ఎలో రేటింగ్‌ను దాటారు.

ఈ టోర్నీలో దివ్య అనేక మైలురాళ్లను దాటి విజయం సాధించారు. ప్రీక్వార్టర్‌ఫైనల్‌లో ప్రపంచస్థాయి ప్లేయర్ జు జినర్పై విజయం, క్వార్టర్‌ఫైనల్‌లో ద్రోణవల్లి హారికపై గెలుపు, సెమీఫైనల్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ జాగ్‌పై గెలవడం వంటి ఘన విజయాలు ఆమె ప్రయాణాన్ని విశేషంగా వెలుగులోకి తెచ్చాయి.

Leave a Reply