Monday, January 30, 2023

మహిళా బెంచ్‌.. మరో సంస్కరణ!

సర్వోన్నత న్యాయస్థానంలో మహిళలకు ప్రత్యేకంగా ఒక ధర్మాసనం (బెంచ్‌) తొలిసారిగా 2013లో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది తీవ్ర సంచలనాన్ని రేపింది. మహిళలకు ప్రత్యేక ధర్మాసనం సర్వోన్నత న్యాయస్థానంలో ఏర్పాటు చేయగా, దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళా కోర్టులు అప్పటికే పని చేస్తున్నాయి. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నట్టే వారికి సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు, ధర్మాసనాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో ఒక ప్రత్యేక బెంచ్‌ని ఏర్పాటు చేశారు. ఇది సుప్రీంకోర్టులో మూడవ మహిళా ధర్మాసనం. రెండవ ధర్మాసనాన్ని 2018లో ఏర్పాటు చేశారు. దేశంలో పెరుగుతున్న నేరాల్లో బాధితులు ఎక్కువగా మహిళలే. అయితే, వారి తరఫున వాదించే న్యాయవాదుల సంఖ్య బాగా తక్కువ. దేశంలో ఉన్న న్యాయవాదుల్లో 15 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు పార్లమెంటులో తెలిపారు. మహిళా న్యాయవాదులలో మేఘాలయ అగ్రస్థానంలో ఉందనీ, జమ్ము, కాశ్మీర్‌లో బార్‌ కౌన్సిల్‌ (న్యాయవాదుల మండలి) అసలు లేనేలేద ని ఆయన తెలిపారు.

- Advertisement -
   

దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో న్యాయవాదుల సంఖ్య నాలుగు లక్షలు కాగా, వారిలో మహిళా న్యాయవాదుల సంఖ్య 8.7 శాతం. నిజానికి ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువ మంది మహిళా న్యాయవాదులు ఉండాలి. దేశ వ్యాప్తంగా మహిళలపై లైంగిక నేరాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి. మొదటి రెండు రాష్ట్రాల్లో పురుషాధిపత్యం ఎక్కువ ఉండటం వల్ల మహిళలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ హయాంలోనూ, ఇప్పుడు బీజేపీ పాలనలోనూ మహిళ లపై దాడులు ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే, పేరొందిన నాయకుల కుమారుల ప్రమేయం ఉన్న కేసులకు సంబంధించినవి మాత్రమే వెలుగు చూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించిన హత్రాస్‌ ఘటన తర్వాత అలాంటి వెలుగు చూడని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మహిళలపై దాడుల గురించి జాతీయ స్థాయి మీడియాకు తెలియజేయడమే కాకుండా, హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో వాదనలు చేస్తున్న మహిళా న్యాయవాదులలో తీస్తా సెతల్వాడ్‌ వంటి వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారి గళాలను అణచివేయ డానికి ప్రభుత్వం వారిపై అక్రమ కేసులను బనాయిస్తోంది.

దేశంలో మహిళల తరఫున వాదించే న్యాయవాదుల లో మహిళలు అతి తక్కువ మంది ఉన్నారు. ఢిల్లి, అసోం, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో బార్‌ కౌన్సిళ్ళు అసలు పని చేస్తున్నాయో లేవో తెలియదు. బార్‌ కౌన్సిళ్ళకూ,బార్‌ (ధర్మాసనాలకూ) మధ్య సమన్వయం ఉండాలని అర్థ శతాబ్దం క్రితం ఆనాటి చీఫ్‌ జస్టిస్‌ కోకా సుబ్బారావు సూచించారు.. అలాగే, మహిళల కేసుల విచారణకు మహిళా బెంచ్‌లు ఉండాలన్న సూచనలు అప్పుడే వచ్చాయి. అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. చాలామంది న్యాయవాదులు రాజకీయ పార్టీల న్యాయవాదులు కావడమో, లేకవాటితో సంబంధాలు పెట్టుకోవడమో జరుగుతోంది. ఈ కారణంగా న్యాయవాదులున్నా కొన్ని కేసుల్లో బాధితులకు న్యాయం జరగడం లేదు. ఇలాంటి ఇతివృత్తాలపై సినిమాలు కూడా వచ్చాయి. మహిళల కేసులను మహిళలే వాదించుకునే అవకాశం రావాలనీ, ఆ కేసులను విచారణ జరిపే అవకాశం మహిళా న్యాయ మూర్తులకే దక్కాలన్న డిమాండ్‌ చాలా కాలంగా వినిపిస్తోంది. తమిళనాడులో మద్రాసు హైకోర్టులో ఇలాంటి అవకాశం కల్పించారు.

లైంగిక దాడులపై విచారణను మహిళా జడ్జీలకు కాకుండా ఇతర బెంచ్‌లకు వెళ్తే, బాధితులు తమ బాధలను చెప్పుకోలేకపోతున్నారనీ, ముఖ్యంగా, వ్యక్తిగత విషయాలను చెప్పుకునేందుకు బిడియ పడుతున్నారనీ, అందువల్ల లైంగిక దాడుల కేసుల విచారణను మహిళా న్యాయమూర్తులకు అప్ప గిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందని మహిళా సంఘాలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వి రమణ ఉన్నప్పుడు న్యాయవాదుల సం ఘాల్లోనూ, ధర్మాసనాల్లోనూ మహిళల సంఖ్య పెరగాలని తరచూ సూచిస్తూ ఉండేవారు.ఇప్పుడు ఏర్పాటైన మహిళా ధర్మాసనం ముందు 32 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నా యి. ప్రస్తుత మహిళా ధర్మాసనంలో ఉన్న జస్టిస్‌ నాగ రత్నమ్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. ఆమె 2027లో ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. అయితే, మహిళల పై జరుగుతున్న దాడులకు తీవ్రంగా, శీఘ్రంగా స్పందించే వారుంటేనే మహిళలకు న్యాయం జరుగుతుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement