Thursday, March 28, 2024

జీఎస్టీ రద్దుతోనే చేనేతకు చేవ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న నేపథ్యంలో చేనేత వస్త్రాలపైనా, ఇతర చేతివృత్తుల వస్తువులపైనా వస్తు, సేవాపన్ను (జీఎస్టీ)ను రద్దు చేయాలన్న డిమాండ్‌ ఇరు రాష్ట్రాల్లో ఊపందుకుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎస్‌ఎం ఎస్‌ఈ) పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నామనీ, స్టార్టప్‌లకు రాయితీలు ఇస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెప్పుకుంటోంది. ఇప్పుడంటే ఆంగ్ల పదాలతో ఇవన్నీ వచ్చాయి కానీ, తరతరాలుగా చేనేత, కమ్మరి, కుమ్మరి వృత్తులను నమ్ముకుని జీవనాన్ని గడుపుతున్న వారు కోట్లలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ముఖ్యంగా చేనేత కార్మికుల అపురూప కళా వైభవానికి బ్రిటిష్‌ పాలకులు కూడా ఎంతో ప్రశంసించారు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి బ్రిటిష్‌ పాలకులకు కానుకగా ఇచ్చిన తెలుగు చేనేత కార్మికుల వృత్తి నైపుణ్యాన్ని సమయం వచ్చినప్పుడల్లా పొగుడుతూ ఉంటారు. కానీ, వారు అందిస్తున్న చేనేత వస్త్రాల వెనుక ఎంత కష్టం ఉందో కనీసం ఊహించరు. చేనేత, ఖద్దరు పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని జాతిపిత మహా త్మాగాంధీ స్వాతంత్య్రానికి ముందే ప్రచారం చేశారు. ముఖ్యంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసమే ఆయన ఖద్దరు ప్రచారం చేశారు. కానీ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గాంధీజీ ప్రబోధించిన కార్యక్రమాలను పెడ చెవిన పెట్టారు. ఎంతోమందికి జీవనాధారంగా ఉన్న చేనేతపై జీఎస్టీ వేయడం తగదని చేనేత సంఘాలు, వాటికి మద్దతు ఇచ్చే పార్టీలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మహజర్లు, వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు ఇదే విష యమై పలు సంఘాల నేతలు అర్జీలు సమర్పించారు.

తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు, రేపు పర్యటనకు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోనూ, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో బ్యానర్లు కట్టారు. జీఎస్టీ విధింపు వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుందన్నది నేత కార్మికుల వాదన. ఆధునిక పోకడలు ఎల్లెడలా విస్తరించిన తరుణంలో ఉత్పత్తి వ్యయం పెరుగుదలతో చేనేత వస్త్రాల ధరలు పెరిగితే వీటి వైపు జనం చూడరన్న భయం సహేతుకమైనదే. జీఎస్టీ విధింపుతో చేనేత పరిశ్రమ మూలపడుతుందనే భయాలు అందరినీ పట్టుకుని పీడిస్తున్నాయి. ఈ రంగానికి అవసరమైన నూలు, రంగులు, ఇతర ముడి సరకులను సబ్సిడీపై అందించాల్సిన ప్రభుత్వం జీఎస్టీ విధించడం అంటే పిడుగులు వేయడమే. చేనేత రంగంలో ఆదాయం లభించకపోవడంతో ఈ రంగంపై ఇంతకాలం ఆధారపడి జీవించిన వారు ఇప్పుడు పెద్ద నగరాల్లో కళ్ళు జిగేలుమనిపించే వస్త్ర దుకాణాల్లో ఉద్యోగులుగా మారుతున్నారు. ఇంతకాలం స్వయం పోషకత్వం కలిగిన ఈ వర్గాలు ఇప్పుడు పరులపై ఆధారపడి జీవించాల్సిన దుస్థితి నెలకొంటోంది. కరోనా సమయంలో అందరికన్నా ఎక్కువ కష్టనష్టాలకు గురైంది చేనేత కార్మికులే. అలాగే, పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై జీఎస్టీ విధించిన ప్రభుత్వం బడుగు వర్గాల జీవనోపాధిని దెబ్బ తీసింది. తెలంగాణ, రాయల సీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్రలలో చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నవారు జీఎస్టీ పెంచడం వల్ల ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

ఎన్నిసార్లు, ఎంత మందికి మొరపెట్టుకున్నా తమ కష్టాలు తీరే మార్గం కనిపించడం లేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైతుల నడ్డివిరిచిన సాగు చట్టాలను తెచ్చినప్రభుత్వం దేశవ్యాప్తంగా నిరవధిక ఆందోళనల ఫలితంగా ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. అదే మాదిరిగా పేద, బడుగు వర్గాలపై భారం మోపే పన్నులను ఉపసంహరించుకోవాలని ఈ వర్గాలు కోరుతున్నాయి. మంత్రులు, ఇతర ప్రముఖులు తమ ప్రాంతాల్లో పర్యటనలకు వచ్చినప్పుడు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను క్రమంగా ప్రైవేటీకరిస్తున్న ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు చేయూతనివ్వక పోగా కొత్తగా భారం మోపి అవి తిరిగి కోలుకోలేని స్థితిలోకి నెట్టేస్తోంది. కేంద్రం నుంచి బకాయిలు రావడం లేదని రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కుల వృత్తులు చేసుకునే వారూ, ఇతర అల్పా దాయ వర్గాలు బతుకు తెరవు కరవై వీధిన పడుతున్నా యి. ఒక్క చేనేత విషయంలోనే కాకుండా చేతివృత్తుల వారిని ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక నైనా బడుగు, బలహీన వర్గాల ఉపాధి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్వత్రా అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. సన్నకారు, చిన్నవృత్తుల వారికి తగినంత ప్రోత్సాహం ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యం. ఎంతసేపూ పెద్ద నగరాలు, పెద్ద పారిశ్రామికవేత్తల సమస్యల పైనే ప్రభుత్వం దృష్టి పెడుతోందన్న అపప్రథ ఇప్పటికే వచ్చింది. దానిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement