Thursday, May 26, 2022

లంకలో మారని దృశ్యం..

పొరుగుదేశమైన శ్రీలంకలో పరిణామాలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. ప్రజల వ్యతిరేకతను తట్టుకోలేక ప్రధానమంత్రి పదవినుంచి తప్పుకున్న మహిందా రాజపక్స స్థానంలో మాజీ ప్రధాని రణిల్‌ విక్రమ సింఘేని దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స నియమించారు. ఆయన నియామకంతోనైనా పరిస్థితి సర్దుమణు గుతుందనుకుంటే అంతకన్నా, దేశంలోఆందోళనలు అంతకన్నా తీవ్రమయ్యాయి. దేశంలో ఆందోళనలు రాజపక్స కుటుంబ సభ్యులను అధికారం నుంచి దించేయాలన్న లక్ష్యంతోనే ప్రారంభమయ్యాయి. మహిందా తొలగినంత మాత్రాన పాలనలో మార్పువస్తుందని తాము భావించడం లేదనీ, దేశాధ్యక్షుడు గొటబాయ కూడా రాజీనామా చేసి తీరాల్సిందేనని ఆందోళన కారులు పట్టుబడుతున్నారు. రణిల్‌ విక్రమ సింఘేకి పాలనాను భవం ఉంది. గతంలో ప్రభుత్వాన్ని సమర్ధంగా నడిపినవారే. అయినప్పటికీ, ఆయన గొటబాయకు రబ్బరు స్టాంపు అవుతారన్నదిఆందోళనకారుల ఆరోపణ. నిజానికి విక్రమ సింఘే ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్‌ నేషనల్‌ పార్టీకి పార్లమెంటులో ఒకే స్థానం ఉంది. కానీ, పరిస్థితుల ప్రభావం, ఆయన అనుభవం దృష్ట్యా ఆ అవకాశం మళ్ళీ లభించింది. విక్రమసింఘే వివాదాస్పద నాయకుడు కాకపోవడం ముఖ్య కారణం. ప్రధానమంత్రి పదవిని ప్రతిపక్షనాయకుడు సాజిద్‌ ప్రేమదాసకూ, మరో సీనియర్‌ నాయకుడు శరత్‌ ఫోన్సెకాకు గొటబాట ఇవ్వచూపినా వారిద్దరూ అంగీక రించలేదు. గొటబాయ రాజీనామా చేస్తే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తామంటూ వారు స్పష్టం చేశారు. దేశంలో ఆర్థిక పరిస్థితి క్షీణించడానికి మహిందా రాజపక్స కారణమనీ, ఆయన సోదరుడు అధ్యక్ష స్థానంలో ఉంటే మహిందా తీసుకున్న నిర్ణయాలను తిరగతోడటం ఎలా కుదురుతుందంటూ ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్న హేతుబద్దంగానే ఉంది. అయితే, అధ్యక్షుడి అధికారాలను తగ్గించాలన్న డిమాండ్‌కి గొటబాయ అంగీకరిం చినట్టు కనిపిస్తోంది.

అయితే, ఆయనను దింపివేసేందుకు అవిశ్వాస తీర్మానా న్నిప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. దానిపై 17వ తేదీన చర్చ జరగనుంది. అయితే, అధ్యక్షుడిని తొలగించడం అంత సులభం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈలోగా కొత్త ప్రధాని విక్రమసింఘే పదవీ స్వీకారం చేసిన వెంటనే తన బాధ్యతలను చేపట్టారు. లంకను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేంచేందుకు ఆర్థిక సాయం చేసే దేశాల కన్‌సోర్టియమ్‌ను ఏర్పాటు చేశారు. పొరుగుదేశమైన భారత్‌తో కలసి పని చేయడానికి సిద్ధమేనని ఆయన ప్రకటించారు. లంకకు ఇదివరకే భారత్‌ సాయాన్ని అందించింది. మరి కొంత సాయాన్ని ఇచ్చేందుకు కూడా సంసిద్ధతను వ్యక్తం చేసింది. అయితే, అక్కడస్థిరమైన ప్రభుత్వం ఏర్పడకుండా, శాంతిభద్రతలు పునరుద్ధరణ కాకుండా లంకకు ఎంత సాయం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అది నిజమే, ఆందోళనకారులు గొటబాయ దిగిపోయేదాకా ఆందోళన కొనసాగిస్తామని తాజా ప్రకటన విడుదల చేశారు. అధికార పార్టీకి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. విక్రమ సింఘే దేశంలో శాంతిభద్రతల పరిస్థితిపై సైనికాధికారులతో చర్చించారు. అయితే.. సైన్యం కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేసినా ఆందోళనకారులు లెక్క చేయడం లేదు. ప్రస్తుత పరిస్థితి ఎన్నడూ ఏర్పడలేదని సీనియర్‌ నాయకులు అంటున్నారు. చైనా లంక పరిణామాలపై ఆచితూచి స్పందిస్తోంది.

మహిందా రాజపక్సే ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించడం చైనాకు మింగుడు పడలేదు. మహిందాను అడ్డుపెట్టుకుని లంకలోని ఆస్తులన్నింటినీ సొంతం చేసుకోవాలనుకున్న చైనాకు ఈ పరిణామం కంటకింపుగా ఉంది. విక్రమ సింఘే గతంలో అధికారంలో ఉన్నప్పుడు చైనాను వ్యతిరేకించారు.. అంతేకాక, విక్రమసింఘే భారత్‌కి సన్నిహితుడన్న సంగతి చైనాకు తెలుసు. చైనా తాజా స్పందనకు ఇదే కారణం. ప్రతిపక్ష నాయకుడు సాజిత్‌ ప్రేమదాస ఆందోళన విరమించడానికి మూడు షరతులు పెట్టారు.గొటబాయ పదవినుంచి దిగిపోవాలన్నది ప్రధానమైన షరతు. ఇందుకు గొటబాయ అంగీకరించడం లేదు. లంకలో ఆందోళనలు కొనసాగడానికి ఇదే ప్రధాన కారణం. ఇది పూర్తిగా లంక ఆంతరంగిక సమస్య. దానికి పరిష్కారం కనుగొనే బాధ్యత విక్రమ సింఘేపైనే ఉంది. కాగా విక్రమ సింఘేకు అధికార పార్టీలో ఒక వర్గం మద్దతు ప్రకటిం చినా, ఆయన నియామకం చెల్లదని ప్రతిపక్షానికి చెందిన సమగి జనబలవెలగయ నాయకుడు డిసిల్వా ప్రకటించారు. వీరందరినీ మహిందా ఉసిగొల్పుతున్నట్టు సమాచారం వామపక్షాలు కూడా రణసింఘేను వ్యతిరేకిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement