Sunday, December 5, 2021

నేటి సంపాదకీయం–హింస పెరిగింది..!

ప్ర‌భ‌న్యూస్: మ‌హిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం విడుదల చేసిన ఒక నివేదిక ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‌ సమయంలో మహిళలపై హింస పెరగడానికి కారణాలపై ఈ విభాగానికి చెందిన బృందం ఆరాతీయగా, మగవారు రోజంతా ఇళ్ళలోనే గడపడం ముఖ్యమైనదిగా ఒక సర్వే లో వెల్లడైంది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో కూడా మహిళలపై దాడులు, ఉద్దేశ్యపూర్వకంగా తాకడం వంటి వేధింపులు పెరిగాయని నివేదిక వెల్లడిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు మామూలు రోజుల్లో కన్నా పెరిగాయని ఆ నివేదిక వివరించింది. మామూలు రోజుల్లో మహిళలు తమ పనుల్లో నిమగ్నమై ఉండటం వల్ల వారికి ఈ వేధింపులు ఎక్కువగా ఉండేవి కావనీ, కోవిడ్‌ సమయంలో ఇతరుల నుంచి ముఖ్యంగా బంధుమిత్రుల నుంచి మహిళలపై వేధింపులు పెరిగాయని ఆ నివేదిక వివరించింది.

అంతేకాకుండా కోవిడ్‌ వల్ల మహిళలకు ఇళ్లల్లో పని భారం పెరిగిందనీ, మగవారు ఇంట్లో ఉన్నా ఇంటిపనుల్లో స‌హాయ ప‌డ‌క‌పోవ‌డం ప్రధాన కారణమని ఈ నివేదిక వివరించింది. అలాగే, బయటికి వచ్చినప్పుడు కూడా, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, కోవిడ్‌ కారణంగా అనా రోగ్యం బారిన పడిన కుటుంబ సభ్యులకు మందులు, ఇతర వైద్య అవసరాలకు బయటకు వెళ్ళినప్పుడు వారిపై వేధింపులు పెరిగాయని సమితి నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడిస్తోంది. మహిళలపై హింస, వేధింపులు పెరగడానికి అనేక కారణాలున్నాయని సమితి నివేదిక పేర్కొంది. ఇంటికే పరిమితం కావల్సిన మహిళలు సాంఘిక, ఆర్థిక పరమైన సమస్యల కారణంగా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు తలెత్తడంతో వారు ఈ వేధింపులను ఎదుర్కోవడం అనివార్యం అవుతోంది. కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు, వేధింపుల వల్ల తాము వ్యాకులత చెందుతున్నామని ఈసర్వేలో 21 శాతం పైగామహిళలు వెల్లడించారు.

అలాగే కోవిడ్‌ సమయంలో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని ప్రతి ఐదుగురిలో ముగ్గురు వెల్లడించారు. ఆర్థిక సమస్యల సంగతి సరేసరి. భర్త ఉద్యోగం కోల్పోతే గృహిణులే బాధ్యతలను తీసుకుని ఇల్లు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడటం వల్ల బయటికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు మహిళలు పేర్కొన్నారు. మహిళలపై దాడులు, హింస పెరగడం ఒక ఎత్తు అయితే, బాధ్యతలు మరింతగా పెరగడం మరో ఎత్తు అని సమితి మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ సీమా బహోస్‌ పేర్కొన్నారు. మహిళల పట్ల సమాజం చూపు మారలేదనీ, కుటుంబ అవసరాల కోసం సరకుల కోసం, ఇతర వస్తువులకోసం బయటికి వెళ్ళే మహిళలపై మగవారి చూపులు, వెకిలి చేష్టలు మగువలను బాధిస్తున్నాయని. అవసరం ఉన్నా లేకపోయినా మహిళలను తాకేందుకు మగవారుచేసే ప్రయత్నాలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయ‌ని. మహిళల రక్షణకు గృహ హింస నిరోధక చట్టం వచ్చినా ఇళ్లల్లో బాధ్యతల పేరిట ఎన్నో విధాలుగా వారిపై హింస పెరుగుతోందని సమితి మహిళా విభాగం డైరక్టర్‌ పేర్కొన్నారు.

సంపాదన పరులైన ఆడవారే కుటుంబాలను పోషిస్తున్నారనీ, మగవారు ఇంటి ఖర్చుల గురించి పట్టించుకోవడం లేదనీ, ఆ విధంగా కూడా మహిళలు బాధలకు గురి అవుతున్నారని ఆమె పేర్కొన్నారు. మహిళలను వేధించేందుకు సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించుకోవడం సర్వసాధారణమైంది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌, వాట్స్‌అప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా యువతులనే కాకుండా పెళ్ళయిన వారిని వేధించడం, అవమానాలు భరించలేక వారు ఆత్మహత్యలకు సిద్దపడటం జరుగుతోంది. మహిళలపై హింస అనేది సామాజిక సమస్య అయింది. అలాగే, లింగ వివక్ష చాలా చోట్ల కొనసాగుతోంది. దీనిని ఎదుర్కోవడానికి ఆదర్శవంత మైన సమాజం నిర్మితం కావాలి. ఉపన్యాసాలనూ, ప్రసంగాలనూ ఆచరణలో పెట్టే వారు ఉంటేనే అది సాధ్యమవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News