Thursday, April 25, 2024

నేటి సంపాదకీయం-దేశం పరువుపోతోంది..

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్రమోడీ వాహనశ్రేణిని రైతులు ఒక ఫ్లైఓవర్‌పై అడ్డుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలాన్ని సృష్టిస్తోంది. ప్రధాని పరివారాన్ని అడ్డుకు న్నది తామేనని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రకటించింది.అయితే,ఈ ఘటనలో చోటు చేసుకున్న భద్రతాలోపం పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం దీనిపై విచారణ జరపనున్నది.ఈ వ్యవహారంలో తమ తప్పేమీ లేదని పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ చెబుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన తర్వాతనే రోడ్డుమార్గంలో ప్రధాని ఫిరోజ్‌పూర్‌ బయలుదేరారని కేంద్రం ఆధారాలతో సహా స్పష్టం చేస్తోంది.ఒక వేళ సుప్రీంకోర్టుఈ ఆధారాలను ప్రాతిపదికగా తీసుకుని పంజాబ్‌ ప్రభుత్వాన్ని తప్పు పడితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

అయితే, జరిగిన ఘటనలో తమ తప్పేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం చూస్తుంటే, ఈ వ్యవహారంలో బీజేపీతో అమీతుమీ తేల్చకోవాలని కాంగ్రెస్‌ సిద్ధమైనట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముఖ్యమంత్రికి ఫోన్‌ చేసి జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రధాని పర్యటన సాఫీగాజరిగేట్టు చూసి ఉండాల్సిందని ఆమె కూడా అభిప్రాయపడినట్టు వార్తలొచ్చాయి. ప్రజాస్వామ్యంలో దేశ ప్రధానికి జరిగిన అవమానంగా బీజేపీ భావిస్తోంది. అయితే, దేశంలో ఒమిక్రాన్‌ విజృంభణతో అన్ని కార్యక్రమాలు రద్దు అవుతున్న సమయంలో బీజేపీ నాయకులు ఫిరోజ్‌పూర్‌ బహిరంగ సభనుఎలా ఏర్పాటు చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి.

పంజాబ్‌ శాసన సభకు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లిdతో పాటు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. కనుక ఎన్నికల ప్రచార సభలనురాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదు.రాజకీయ లబ్ధి కోసమే అటు బీజేపీ వారూ, ఇటు కాంగ్రెస్‌వారూ ఆడుతున్న గేమ్‌ ప్లాన్‌లో భాగంగానే బుధవారం జరిగిన సంఘటన ను చూడాల్సి ఉంటుంది.ప్రధానమంత్రి తమ పార్టీ ప్రచారం కోసం ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశిస్తూ, ఎప్పటికప్పుడు మార్గదర్శక సూత్రాలను విడుదల చేస్తోంది. ప్రస్తుత పరిస్థితికి ఎవరు కారకులన్న ప్రశ్నకు ఇద్దరూఅని సమాధానం చెప్పుకోవల్సి ఉంటుంది.అయితే, ప్రధానమంత్రి పర్యటన సజావుగా జరిగేట్టు చూడటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. జరిగిన వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం హుందాగా సారీ చెప్పి ఉంటే ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారే పరిస్థితి ఉండేది కాదు.

బీజేపీ, కాంగ్రెస్‌లు అమీతుమీ తేల్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల దేశం ప్రతిష్ఠ దెబ్బతింటోంది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకులు చేస్తున్న ప్రకటనలతో ఇప్పటికే దేశ ప్రతిష్ట దెబ్బతింది. రైతుల డిమాండ్లు సమంజసమైనవే అయినా ఆ సంస్థ నాయకులు చేస్తున్న ప్రకటనలు హద్దులను అతిక్రమించినవిగా కనిపిస్తు న్నాయి. సాగు చట్టాలను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కూడా కిసాన్‌ యూనియన్‌ ఆందోళన కొనసాగిస్తోంది.ప్రధానమంత్రి పై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన వాహన శ్రేణిని కిసాన్‌ యూనియన్‌ అడ్డుకున్న మాట నిజమే కావచ్చు. కానీ, కొద్ది సేపు నిరసన తెలిపి ప్రధాని కాన్వాయ్‌ వెళ్ళేందుకు వీలు కల్పించి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదు . సాగు చట్టాల రద్దు విషయంలో ప్రధానమంత్రి పెద్ద మనసుతో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా పెద్దమనసుతో నిర్ణయం తీసుకోవాలి. అయితే, పార్టీ నాయకులు,కార్యకర్తల ఒత్తిడికి ఆయన కూడా రాజకీయ ప్రయోజనం వైపు మొగ్గి పోతున్నారేమోననిపిస్తోంది. పంజాబ్‌ ముఖ్యమంత్రి చన్నీ కూడా తన ధోర ణిని మార్చు కోవాలి. చిన్నదాన్ని భూతద్దంలో చూపిస్తున్నారంటూ ప్రకటించిన తీరు సవ్యంగా లేదు. ప్రధానమంత్రికి సారీ చెప్పడానికి బదులు ఆయన తన ప్రభుత్వ చర్యను సమర్ధించు కోవడం ఏ రకంగానూ సబబుగా లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement