Saturday, November 27, 2021

నేటి సంపాదకీయం–వెూడీ విజ్ఞతకు నిదర్శనం

ప్ర‌భ‌న్యూస్: కేద్రం తీసుకుని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాల పట్ల రైతుల్లో వెల్లువె త్తిన నిరసనను అర్థం చేసుకోవడానికి మోడీ ప్రభుత్వానికి ఏడాది పట్టింది .ఈ చట్టాల వల్ల దేశంలో కోట్లాది రైతులు పరాధీనులు అవుతారని రైతు సంఘాల నాయకులే కాకుండా, వ్యవసాయరంగ నిపుణులు హెచ్చరించినా కేంద్రం ఓ పట్టాన దిగిరాలేదు. కార్తీక పౌర్ణమి సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ జయంతి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతుల్లో అధిక భాగం సిక్కులే కావడంతో వారికి తీపి కబురు అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం నాడు ఈమూడు చట్టాలనురద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కోట్లాది ప్రజలను సంతృప్తి పర్చే ప్రకటనను చేసినందుకు ఆయనను అన్ని వర్గాల వారూ అభినందిస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న అసెంబ్లి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఈ ప్రకటన చేసి ఉంటారన్న వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరం కాదు.

ఈ చట్టాలు నల్ల చట్టాలనీ, రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తాయని చెబుతున్నా ప్రభుత్వం ఇంతవరకూ స్పందించనందుకు ఇంకా చాలా ఆరోపణలే వచ్చాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తెచ్చే చట్టాలన్నీ ప్రజానుకూలంగానూ, ప్రజామోదంగానూ ఉంటాయని చెప్పలేం. కొన్ని చట్టాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా, అవి కొన సాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ రంగం మన దేశంలో ఇప్పటికీ కోట్లాది మందికి ఉపాధిని కల్పిస్తోంది. దేశ చరిత్రలో తొలిసారిగా చట్టరూపం ధరించిన బిల్లులను రద్దు చేసేవరకూ రైతులు నిరవధిక దీక్షను కొనసాగించడం ఇదే ప్రథమం. ఇది రైతులు సాధించిన విజయమంటూ భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేష్‌ తికాయిత్‌ చేసిన వ్యాఖ్యల్లో అతిశయోక్తి లేదు. రైతుల ఆందోళనను విరమింపజేయడానికి కేంద్రం వివిధ స్థాయిల్లో వివిధ ప్రతినిధి వర్గాలతో సంప్రదింపులు జరిపింది.

అవేమీ ఫలించలేదు. తరతరాలుగా రైతులు భూములను నమ్ముకుని లాభదాయకమైన పంటను పండిస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులను ఈ విషయంలో ప్రోత్సహిస్తూ వచ్చింది. కానీ, ఈ చట్టాలు అమలులోకి వస్తే, ప్రభుత్వం చెప్పిన పంటనే వేయాలన్న షరతు రైతుల హక్కులను హరించేదిగా ఉంది. అంతేకాకుండా, రైతులు పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటించడం కూడా ఆనవాయితీగా ఉంది. కొత్త చట్టాల ప్రకారం మద్దతు ధర విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్ల రైతులు పట్టు విడవకుండా ఆందోళన సాగించారు. ఢిల్లి సరిహద్దుల్లో ప్రారంభమైన ఈ ఆందోళనలో ముందుగా పంజాబ్‌ రైతులు, తర్వాత హర్యానా, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ రైతులు చేరారు. ఉత్తరాది రైతుల ఉద్యమం అనీ , కొన్ని వర్గాలకే పరిమితమైన ఆందోళన అని ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కొట్టివేసినా, కాలక్రమంలో రైతుల సంఖ్య పెరగడంతో అది మహోద్యమంగా మారింది. ఈ సందర్భంగా 700మంది పైగా రైతులు ప్రాణాలు కోల్పాయారు.

వీరిలో కొందరు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఈ ఉద్యమం వల్ల అధికార పార్టీ పునాదులు కదిలిపోయే ప్రమాదం ఏర్పడింది. అయితే, ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. రైతుల్లో 70 శాతం మంది రెండు ఎకరాల లోపు వారే ఉన్నారు. ఈ కొత్త చట్టాల వల్ల వారికే ఎక్కువ నష్టం. అంతేకాదు, పంటను ఎక్కడికైనా తీసుకెళ్ళి విక్రయించుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా, దాని రవాణా ఖర్చులు ఎవరిస్తారు. వరి పంటను కొనుగోలు విషయమై తెలంగాణలో కేంద్ర, రాష్ట్రాల మధ్య రగులుతున్న వివాదాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఈ నేపధ్యంలో కొత్త చట్టాలు మరిన్ని సమస్యలు సృష్టిస్తాయని గ్రహించిన ప్రభుత్వం దిగివచ్చి వీటిని రద్దు చేయనున్నట్టు ప్రకటించడం విజ్ఞతకు తార్కాణం. మోడీ రాజనీతిజ్ఞతకు నిదర్శనం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News