Thursday, April 18, 2024

నేటి సంపాద‌కీయం – ఆప‌రేష‌న్ గంగ‌కు మ‌ద్ద‌తు.!

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్ధినీ విద్యార్ధుల ను ఆపరేషన్‌ గంగ పేరిట స్వదేశానికి తరలించే కార్యక్రమం అనుకున్న రీతిలో సాఫీగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి అందరి మద్దతు లభిస్తోంది. ఇందుకు కృషి చేస్తున్న మన విదేశాంగ, రక్షణ, ఇమ్మిగ్రేషన్‌ తదితర శాఖల అధికారులు, సిబ్బందిని అందరూ అభినందిస్తున్నారు. ముఖ్యంగా, విదేశాంగ మంత్రి జై శంకర్‌, ఇతర మంత్రుల చూపుతున్న శ్రద్ధాసక్తులను విద్యార్ధుల తల్లి దండ్రులే కాకుండా రాజకీయాలకు అతీతంగా ప్రముఖ నాయకులంతా శ్లాఘిస్తున్నారు. కేంద్రంపై సమయం వచ్చినప్పుడల్లా ధ్వజమెత్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పూర్తి మద్దతు ప్రకటిస్తూ లేఖ రాయడం గమనార్హం. రాజకీయంగా ఎన్ని వైరాలున్నప్పటికీ దేశ ప్రయోజనాలకు సంబంధించి దేశంలో పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాలన్న సిద్ధాంతాన్ని అనుసరించి మోడీ తీసుకుంటున్న చర్యలకు తాను మద్దతు ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అలాగే, శాంతి వైపు ప్రపంచాన్ని నడిపించే బాధ్యతను భారత్‌ తీసుకోవాలని ప్రధాని ఆమె కోరారు. వివిధ రాష్ట్రాల్లో సీఎంలు, సంబంధిత శాఖల మంత్రులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ పౌరులను రప్పించడంలో చొరవ చూపుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే మాదిరి చొరవను ప్రదర్శించి హెల్ప్‌ లైన్‌ల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. అలాగే, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్ధినీ విద్యార్ధులను స్వదేశానికి తీసుకుని రావడంలో ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ మాత్రమే కాకుండా ప్రైవేట్‌ విమాన సర్వీసులు కూడా సాయమందిస్తున్నాయి. అయితే, చాలా మంది విద్యార్ధినీ విద్యార్ధులు ఎంబెసీల్లో తెలియజే యకుండా వచ్చేస్తుండటం వల్ల చెక్‌ పోస్టుల వల్ల చిక్కుబడి పోతున్నారు. తగిన ఆవాసాలు లేక, గడ్డకట్టే చలిలోవారు నిరీక్షించాల్సి వస్తోంది. అలా రావద్దని హెచ్చరిస్తున్నప్పటికీ ఆ మారణ హోమం జరుగుతున్న ప్రాంతం నుంచి ఎంత వీలైనంతే అంత త్వరగా బయట పడాలన్న ఆత్రుతతో ఎవరికీ చెప్పకుండా బయలు దేరి కష్టాలు పాలవుతున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. మొత్తం 16వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌లో చిక్కుకోగా, వారిలో 14వందల మంది పైగా తెలుగు వారు ఉన్నట్టు సమాచారం ఐదువందలు మినహా మిగిలిన వారంతా హైదరాబాద్‌, విజయవాడలకు చేరుకున్నారు.

వియత్నాం, పాక్‌, చైనా, బంగ్లాదేశ్‌, తదితర దేశాల్లో యుద్ధాలు జరిగినప్పుడు మన దేశం తీవ్రంగా వ్యతిరేకించింది. యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాల చెక్‌ పోస్టుల వద్ద చిక్కుకుని పోయిన మన విద్యార్ధులను రప్పించేందుకు కేంద్ర మంత్రులను పంపుతున్నారు. విద్యార్ధినీ విద్యార్ధులు తమ అనుభవాలు చెబుతుంటే తల్లితండ్రులకే కాకుండా, నిరంతర వార్తా స్రవంతుల్లో వీక్షించిన వారికి అసంకల్పి తంగా కళ్ళంట నీళ్ళు జలజల రాలుతున్నాయి. తిండి లేకపోయినా తాగేందుకు నీరు లేక తాము పడిన అవస్థల గురించి విద్యార్ధినీ విద్యార్ధులు చెబుతుంటే, ఇన్ని కష్టాలను తెచ్చి పెట్టిన రష్యాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా యుద్ధం గురించి కబుర్లే. ఇటీవల కాలంలో ప్రజలను ఇంతగా కదిలించిన సాయుధ ఘర్షణలు లేవనిఅంటున్నారు. బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దారి తీసిన యుద్ధం జరిగినప్పుడు ఛానల్స్‌ విస్తృతి ఇంతగా లేనందువల్ల దూర్‌దర్శన్‌ ప్రసారం చేసిన దృశ్యాలనే వీక్షించేవారు. చంటి పిల్లల తల్లుల ఆక్రందనలు, మృత శిశువుల దృశ్యాలు చూసినప్పుడు పుతిన్‌ది రాతి గుండె అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. యుద్ధం మానవజాతికి శత్రువు. అది ఎక్కడ, ఎప్పుడు, ఎవరి మధ్య జరిగినా వేలాది మంది ప్రాణాలను బలిగొంటుంది. అందుకే, యుద్ధాన్ని నివారించాలని ప్రపంచ దేశాలన్నీ ఎలుగెత్తి కోరుతున్నాయి. ఉక్రెయిన్‌ కు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ దేశాలు మద్దతు ప్రకటించాయి. యుద్ధాన్ని విరమింపజేయాలని రష్యాను డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రష్యాపట్ల గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement