Tuesday, March 26, 2024

నేటి సంపాద‌కీయం – వేస‌వి క‌ష్టాలు..!

వేసవి ప్రవేశంతో విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. పట్టణాల్లో, గ్రామాల్లో జనం కుతకుత ఉడికి పోతున్నారు. ఎన్నిసార్లు అనుభవంలోకి వచ్చినా, ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోసుకోలేకపోవడం ప్రభుత్వాల బలహీనత అనడం కన్నా, విద్యుత్‌ వాడకంలో ఎప్పటికప్పుడు ఊహకందని రీతిలో పెరుగుదల కనిపిస్తుండటమే. మనదేశంలో విద్యుత్‌ ఉత్పత్తి అధిక భాగం బొగ్గు ఆధారిత థర్మల్‌ కేంద్రాల్లోనే జరుగుతోంది. జలవిద్యుత్‌, పవన, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ సంస్థలు పనిచేస్తున్నా, వాటి నుంచి లభించే విద్యుత్‌ స్వల్పమే. బొగ్గు ఉత్పత్తి వల్ల పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయనీ, క్రమంగా అణువిద్యుత్‌పై ఆధారపడటం అలవాటు చేసుకోవాలని నాయకులు సమయం వచ్చినప్పుడల్లా మనకు ఉద్బోధలు చేస్తుంటారు. కానీ, అణువిద్యుత్‌ కూడా సమృద్దిగా లభ్యం కావడం లేదు. దేశంలో దాదాపు ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మన దేశంలో 22 అణువిద్యుత్‌ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. ఇతర మార్గాల ద్వారా ఉత్పత్తి జరిగే విద్యుత్‌ కన్నా, థర్మల్‌ కేంద్రాల నుంచి లభించే బొగ్గుతోనే విద్యుత్‌ ఉత్పత్తి అధికంగా జరుగుతోంది. థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి మందగిస్తే విద్యుత్‌ కొరత ఏర్పడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కొరతకు థర్మల్‌ కేంద్రాలనుంచి సకాలంలో బొగ్గు సరఫరా కాకపోవడమేనని వార్తలు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ డిమాండ్‌ 235మిలియన్‌ యూనిట్లు కాగా, 150 మిలియన్ల యూనిట్లు మాత్రమే లభ్యమవుతోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మే నెల నుంచి విద్యుత్‌ సరఫరా పరిస్థితి మెరుగవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణలో విద్యుత్‌ వినియోగం పరాకాష్టకు చేరుకుంటోంది. గతనెల చివరలోఒక్కరోజే 13,742 మెగావాట్ల విని యోగం జరిగినట్టు అధికారులు తెలిపారు. విద్యుత్‌ డిమాండ్‌ 15,000 మెగావాట్లకు పెరిగినా సరఫరా ఆగకుండా చూస్తామని అధికారులు తెలిపారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకుబొగ్గుగనుల నుంచి బొగ్గు సరఫరాకు రైలు వ్యాగన్ల రాక్‌లు తగినన్ని లేకపోవడం వల్లనే కొరత ఏర్పడుతోందన్న వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై రైల్వే అధికారులు వివరణఇస్తూ రైల్వే రాక్‌లను అందుబాటులోకి తెస్తున్నామనీ, ఈ కొరత తాత్కాలికమేనని స్పష్టం చేశారు.అటు రాక్‌లు, ఇటు విద్యుత్‌ ఉత్పత్తిలో మందగింపు తాత్కాలికమేనని అంటున్నారు. అంతిమంగా ప్రజలు తీవ్రమైన విద్యుత్‌ కొరత, కోతలను ఎదుర్కోవాల్సివస్తోంది. ఒక వంక పరిశ్రమలకూ, గృహ అవసరాలకూ కొరత ఉన్నా, ఉత్సవాలకూ, వినోద కార్యక్రమాలకూ, పెళ్ళ్ళిళ్ళు వంటి శుభకార్యక్రమాలకు కొరత లేకుండా విద్యుత్‌ అందుతున్నందుకు సంతోషించాల్సిందే. అయితే, ఈ కార్యక్రమాలకు ఆడంబరంగా, పటాటోపంగా వీధుల్లో విద్యుత్‌ దీపాల పందిళ్ళు వేసి వాడకం పెంచుతుండటం వల్లనే విద్యుత్‌ కొరత వస్తోందన్నవాదం కూడా తెరమీదికి వస్తోంది.

ఒక్క విద్యుత్‌ విషయంలోనే కాదు, వేసవిలో నీటి సరఫరా అంతంత మాత్రంగా ఉంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే భవన నిర్మాణాలు, మరమ్మత్తుల కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. దీని కోసం పలుకుబడి కలిగిన వారు కుళాయి కనెక్షన్లకు మోటార్లు బిగించి ఎక్కువ నీటిని పొందుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్‌, కుళాయి నీరు సామాన్యులకు మాత్రమే కొరతగా ఉంటోందనీ, వైభవంగా కార్యక్రమాలను నిర్వహించుకునే వారు సిబ్బందితో లోపాయికారీగా మంచిచేసుకుని అవసరమైనంత నీటినీ, విద్యుత్‌నీ వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏ కార్యక్రమానికి అయినా అవసరానికి మించి విద్యుత్‌, నీరు సరఫరా చేయడం తప్పే. అయితే, ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా అన్నీ యథాప్రకారం జరిగిపోతున్నాయి. గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. చెరువులు, ఏర్లు ఎండి పోవడం, పక్కనే కాలువలున్నా, నీటిని వాడుకునే సదుపాయాలు, అనుమతులు లేకపోవడంతో గ్రామీణులు నానా ఇక్కట్లకు గురి అవుతున్నారు. గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పరిస్థితి అధ్వాన్నంగా ఉంటోంది.

రోజుకు 12 గంటల సేపు కోతతో విద్యుత్‌ లేక ఎండల వల్ల ఉక్క పోతను భరించలేక ఇంటిపట్టున ఉన్న వారు సైత నరకాన్ని అనుభవిస్తున్నారు. చెట్లు, వృక్షాలను నరికి వేయడం వల్ల చల్లదనం కరవైపోతోందని గ్రామీణులు వాపోతున్నారు. పట్టణాలు, నగరాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో కూడా ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్న కారణంగా పచ్చదనం ఎక్కడా కనిపించడం లేదు. గొట్టపు బావుల్లో నీరు ఇంకి పోతోంది. కాలువల ద్వారా ప్రవహించే నీరు జనానికి అందడం లేదు. గతంలో వేసవి సెలవుల్లో గ్రామాలకు వెళ్ళి సేదతీర్చుకుందామని అనుకునే వారు. ఇప్పుడు గ్రామాల కన్నా పట్టణాలు, నయమనుకునే పరిస్థితి తలెత్తుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement