Thursday, April 25, 2024

నేటి సంపాదకీయం–రాజకీయ హ్రస్వదృష్టి!

ప్ర‌భ‌న్యూస్ : ప్ర‌భుత్వం దిగి వచ్చేవరకూ పోరాడతామంటూ ప్రకటించిన పార్టీలే, ప్రభుత్వం దిగివచ్చిన తర్వాత దానిని స్వాగతించాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసమే నంటూ తేలికగా మాట్లాడటం ఆధునిక రాజకీయాలకు చిహ్నంగా కనిపిస్తోంది. మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు నిరవధికంగా సాగించిన ఆందోళనకు ఎట్టకేలకు ప్రధానమంత్రి స్పందించి వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంట్లో గెలుపోటముల ప్రసక్తి తీసుకుని రావడం అనుచితం. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక లను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఈ నిర్ణయాన్ని ప్రకటించారంటూ ఎద్దేవా చేయడం రాజకీయ విజ్ఞత అనిపించుకోదు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందంగా కాకుండా ప్రజల నాడిని గమనించి నిర్ణయం మార్చుకున్న పాలకులు వెనకటి కాలంలో నూ ఉన్నారు. చరిత్రలోవారు రాజనీతిజ్ఞులుగా నిలిచిపోయారు.

అలాగే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ సాగు నీటి చట్టాలను ఉపసంహరించుకోవడంలో అంతర్లీనంగా రాజకీయ లబ్ధి ఉంటే ఉండవచ్చు. కానీ, అదే ప్రధాన కారణం అనడం న్యాయం కాదు. అలాగే, కోవిడ్‌ సమయంలో నిరుపేద వర్గాల కోసం ప్రవేశపెట్టిన ఉచిత రేషన్‌ను పొడిగించడంలో కూడా రాజకీయ ప్రయోజనాన్ని చూసే ప్రబుద్ధులు ఉంటే అది వారి హ్రస్వదృష్టి అనే అనుకోవాలి, రాజకీయ పార్టీలన్నింటి లక్ష్యం ప్రజలకు మేలు చేయడమే అయినప్పుుడు ప్రజోపయోగక రమైన నిర్ణయాలపై ఆక్షేపణలు తెలపడం అర్ధం లేని విషయం. దేశ రాజకీయాల్లో పరిపక్వత, పాలనారంగంలో అనుభవం కలిగిన నాయకునిగా పేరొందిన నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సైతం సాగు చట్టాలను ఉత్తరప్రదేశ్‌ ఎన్నిక ల దృష్ట్యా రద్దు చేశారనడం న్యాయం కాదు.

రైతుల కోసం ఆయన సుదీర్ఘ కాలంగా పోరాడు తున్న మాట నిజమే. ఢిల్లి సరిహద్దుల్లో సింఘు వద్ద రైతులు జరుపుతున్న ఆందోళనకు మద్దతు ప్రకటించిన పవార్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సానుకూల దృష్టితో చూడాల్సింది పోయి రాజకీయ దృష్టితో వ్యాఖ్యానించడం ఆందోళనను ఇంకా పూర్తిగా విరమించని రైతు సంఘాల నాయకులకు ప్రతికూల సంకేతాలు ఇవ్వడమే. రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పుడు ప్రభుత్వంతో చర్చలకు రైతు సంఘాల ప్రతినిధులు ముందుకు వచ్చి తమకు అభ్యంతరకరమైన అంశాలను కొత్త చట్టంలో చేర్చ కుండా జాగ్రత్తపడాలి. అంటే మద్దతు ధరకు చట్టబద్దత కోసం పట్టుబడుతున్న రైతులు కొత్తగా చేసే చట్టంలో ఆ విషయాన్ని చేర్పించేట్టు ఒత్తిడి తేవాలి. బయట ప్రసంగాలూ, హెచ్చరికలు చేసినందువల్ల ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం ఓ మెట్టు దిగి వచ్చినప్పుడు, రైతు సంఘాల సమన్వయ కమిటీ కూడా మెట్టు దిగడం ఆదర్శమవుతుంది.

దేశం ఇప్పటికే కోవిడ్‌ వల్ల తీవ్రమైన ఆర్థిక నష్టాలకు లోనయింది. కేంద్రం కోట్లాది ప్రజలకు వ్యాక్సిన్లు ఉచితంగా పంపిణీ చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వర్గాలకు ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీచేస్తోంది. ఈ తరుణంలో రైతులు ప్రభుత్వానికి సహకరిస్తే వారికి మంచి పేరు వస్తుంది. ప్రధానమంత్రి నిరంతర వార్తా స్రవంతుల్లో ఏమాత్రం భేషజం, బెట్టు లేకుండా సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. దీనికి కొన్ని వర్గాలు తప్ప దేశం మొత్తం మీద రైతాంగం అంతా హర్షామోదాలను వ్యక్తం చేసింది.

ప్రధానమంత్రి ప్ర కటన తర్వాత కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్‌ తోమార్‌ చేసిన ప్రకటన రైతుల్లో అనుమానాలను రేకెత్తించినట్టుగా కనిపిస్తోంది. ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకున్నా, వాటిలోని మౌలికాంశాలు యథాతథంగా ఉంటాయన్న అర్థం వచ్చేట్టు ఆయన చేసిన ప్రకటనపై సమాజంలోని ఇతర వర్గాలు కూడా ఆక్షేపణ తెలిపాయి. రైతుల ఉద్యమం సుదీర్ఘంగా కొనసాగడానికి మంత్రులు చేస్తూ వచ్చిన ప్రకటనలే కారణం కావచ్చు. సాగు చట్టాల విషయంలో ప్రధానమంత్రి మొదటి నుంచి పట్టువిడుపుల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. అయితే వ్యవసాయ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు తరుచూ చేసే ప్రకటనలు రైతాంగాన్ని గందరగోళంలోకి నెట్టాయి. దాంతో వారు మరింత దృఢ వైఖరితో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రధానమంత్రి స్పష్టంగా ప్రకటన చేసిన తర్వాత రైతులు కూడా తమ ఉద్యమాన్ని విరమించుకోవడం దేశ శ్రేయస్సు దృష్ట్యా అత్యవసరం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement