Monday, November 11, 2024

నేటి సంపాద‌కీయం – పేరులోనే పెన్నిధి

శుభకృత్‌ నామ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. పేరు లోనే ఉంది పెన్నిధి అన్న చందంగా ఈ ఏడాది పేరులోనే శుభం స్ఫురిస్తోంది. గడిచిన రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ఎన్నో కష్టనష్టాలకు లోనయిన ప్రజలు ఈ ఏడాదయినా శుభాలు జరగాలని కోరుకుంటున్నారు. శుభాల కోసం ఎదురు చూస్తున్నారు. పండితులు కూడా అదే మాట చెబుతున్నారు. ఈ ఏడాది ప్రజలు సకల శుభాలతో వర్ధిల్లుతారని దైవజ్ఞులు ఇప్పటికే తమ పంచాంగాల్లో స్పష్టం చేశారు. పురాణాలను పుక్కిటి పురాణాలని తేలిగ్గా మాట్లాడేవారున్నట్టే, పంచాంగాల్లో రాసినవన్నీ జరుగుతాయా అని హేళన చేసేవారు మనలో ఉన్నారు. అలా మాట్లాడేవారే, ఏదైనాపని ప్రారంభించే ముందు తిథి, వార, నక్షత్రాలు చూసుకుంటారు. తాము ప్రారంభించే పనులు విజయవంతం కావాలనీ, తమకు ఆర్థికంగా కలసిరావాలనీ, ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని ఆకాంక్షించని వారెవరూ. అలాంటి వారందరికీ పంచాంగాలు, దైవజ్ఞుల అవసరం ఉంటుంది. పంచాంగాలలో ఆదాయ, వ్యయాలను చూసుకోని వారెవరు? ఒక వేళ చూసుకోకపోతే కోయవాళ్ళు కనిపిస్తే, దారికాచి అడ్డగించినట్టు ఏ అరుగు మీదో, చెట్టుకిందో కూర్చుని తమ భవిష్యత్‌ గురించి ప్రశ్నలు సంధించని వారెవరు? ఆ విధమైన ఆసక్తి, ఆత్రుత ఉండటం తప్పుకాదు. కానీ, తాము అన్నింటికీ అతీతులమని చెప్పి, చాటుమాటుగా జాతకాలు చూపించుకునే వారు, నక్షత్రాల దోషనివారణ కు పూజలు చేయించేవారు ఎంతో మంది ఉన్నారు. తెలుగువారికి అరవై సంవత్సరాలున్నాయి.

శుభకృత్‌ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరుగుతుందని పంచాంగ కర్తలు పేర్కొంటున్నారు. నక్షత్రాల నడకను బట్టి, గ్రహ గతులననుసరించి పంచాంగాలను గణిస్తారు. పంచాంగాల్లో రాసినవన్నీ జరుగుతాయా అంటే, ఎవరి నమ్మకాలు వారివి. అలా నమ్మేవారి కోసమే పంచాంగాలు ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా పుట్టుకొస్తు న్నాయి. ఖగోళ శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పంచాం గాన్ని గణిస్తారు. పంచాంగంలో నక్షత్రాల దోషాలను ముందుగా హెచ్చరించి, ఉపశమనం కోసం సంబంధిత దేవతలకు పూజలు, గ్రహ శాంతులు చేయిస్తూ ఉంటారు. ఇవి కూడా నమ్మకానికి సంబంధించిన విషయాలే. పంచాంగాల రూపకల్పన గణిత శాస్త్ర ప్రాముఖ్యం ఎక్కువ ఉంది. అంకెలు మనుషుల జీవితాలను తారు మారు చేస్తుంటాయి. పంటలు ఎలా పండుతాయో, వరదలు, వర్షాల ప్రభావం ఏమేరకు ఉంటుందో పంచాంగ కర్తలు నక్షత్రాల నడకననుసరించి ముందుగా తెలియజేస్తారు. ఉగాదికీ, పంచాంగ శ్రవణానికీ మధ్య సంబంధంఉంది. ఉగాది నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. నిజానికి కాలానికి కొలమానం లేదు. కానీ, నియమబద్ధమైన జీవనం కోసం నిబద్ధతతో కూడిన క్రమశిక్షణను అలవర్చుకోవడం కోసం మనిషి నిమిషాలు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలను ఏర్పరుచుకున్నాడు. ఆద్యంతములు లేని ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో ఎవరూ నిర్దిష్టంగా చెప్పలేరు. పురాణాల్లో ఉదహరించే అంశాలు కూడా మనిషి మేధన నుసరించి సేకరించినవే. సంవత్సరాదినాడు సూర్యుని తేజస్సు ప్రభావంఎక్కువ ఉంటుంది.

చలిగాలులు పోయి వేడి గాలులు వీస్తాయి. వాతావరణాన్ని బట్టే మనిషి జీవన విధానం మారుతూ ఉంటుంది. ఈ మార్పులకు సంకేతంగానే మనం తీసుకునే ఆహారం మారుతూ ఉంటుంది. చలువ చేసే పదార్ధాలను సేవించేందుకు ప్రాధాన్యం ఇస్తాం. మన ఆహారంలో ఆరు రుచులు ఉన్నాయి. వాటిని సమపాళ్ళలో స్వీకరించాలని తెలియజెప్పేందుకే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఉగాదినాడు సేవించడం ఒక సంప్రదాయం. వేపపువ్వు, మామిడి ముక్కలు, చెరకు, బెల్లం, కొత్త చింతపండుతో తయారు చేసే ఉగాది పచ్చడిని మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలతో అన్వయిస్తుంటారు .అన్ని రుచులనూ సమానంగా ఆస్వాదించాలన్న సంకేతం ఉగాది పచ్చడిలో ఉంది. అలాగే, జీవితంలో ఒడిదుడు కులు, కష్టాలు,సుఖాలు, ఎత్తు పల్లాలు కూడా సహజం. వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తిని, మానసిక స్థయిర్యాన్నీ, కష్టాలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగి పోకుండా సమ్యక్‌ శక్తిని, సంయమనాన్ని అలవ ర్చుకోవాలన్నదే ఉగాది పచ్చడి ఇచ్చే సందేశం. రజో, తమో గుణాలను అదుపులో ఉంచుకుంటే మనుషుల మధ్య పొరపొచ్చాలు సంభవించవు. మనిషిలోఉండే కామ, క్రోథ, లోభ, మద, మోహ, మాత్సర్యాల నే అరిష డ్వర్గాలను అదుపులో ఉంచుకునేందుకు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఉదయమే సేవించాలని మన పెద్దలు ప్రబోధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement