Saturday, May 21, 2022

నేటి సంపాద‌కీయం – మంటల మధ్య మహిందా రాజీనామా..

శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స సోమవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా కోసం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదుల నేతృత్వంలో వేలాది మంది ఆందోళన సాగిస్తున్నారు. ఈ ఆందోళనలు రక్తసిక్తమైన సందర్భాలు కూడా ఉన్నాయి. సోమవారం నాడు కూడా అధ్యక్ష భవనం వద్ద జరిగిన ఘర్షణలో అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు అమరకీర్తిపై ఆందోళనకారులు దాడి చేయడంతో ఆయన కన్నుమూశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి రాజ పక్స సోదరులు కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ఆహారం, మందులు, నిత్యావస రాలకు కొరత ఏర్పడటానికి మహిందా రాజపక్స, దేశా ద్యక్షుడు, ఆయన సోదరుడు గొటబయ రాజపక్స, ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న మరో సోదరుడు కారణమన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ప్రభుత్వ పదవుల్లో రాజపక్సకు మారులు కూడాఉండేవారు. ముఖ్యమైన పదవులు, నిధులు అన్నీ రాజపక్స కుటుంబానికే దక్కుతున్నాయని ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. దేశంలో పరిస్థితి బాగున్నంత వరకూ ఎవరూ పట్టించు కోలేదు. విదేశీ మారక ద్రవ్య నిధులు నిండుకున్నాయి. ఆహార ధాన్యాల కొరత తీవ్రంగా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ కొరత ప్రపంచవ్యాప్తంగా ఉన్నదాని కంటే లంకలో ఎన్నో రెట్లు ఎక్కువగాఉంది. ఆఖరికి కోడిగుడ్డు ధర కూడా బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోదేశంలో ఆకలి కేకలు ఎక్కువయ్యాయి. ప్రజల నుసముదాయించడానికి గొట బాయ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి ఇంత దారుణంగా తయారవడానికి కరోనాయే కారణమంటూ రాజపక్స సోదరులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అసలు విషయం ఏమంటే మూడేళ్ళ క్రితం ఈస్టర్‌ పండుగ నాడు చర్చిలో జరిగిన పేలుళ్ళలో వందలాది మంది మరణించారు.

దాంతో శ్రీలంక ప్రధాన ఆదాయ వనరుఅయిన పర్యాటకం ఘోరంగా పడిపోయింది. దాంతో ఆదాయం బాగా తగ్గింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇతర ఆర్థిక సహాయ సంస్థల నుంచి తీసుకున్నఅప్పులన్నీ రాజపక్స సోదరులు విదేశీ బ్యాంకుల్లోని తమ ఖాతాలకు తరలించారని ప్రజాస్వామ్యవాదులు ఆరోపిస్తున్నారు. రాజపక్స గతంలో కూడా ప్రధానిగా, దేశాద్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్‌టిటిఈ)తో దశాబ్దాల పాటు సాగిన అంతర్యుద్ధంలో దేశంలో వనరులన్నీ ఖాళీ అయ్యాయి. ఈ యుద్దంలో రాజపక్స మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు నిర్ధారించడంతో శ్రీలంకకు రుణాలిచ్చేందుకు ఏ దేశమూ ముందుకు రాలేదు. అయినప్పటికీ ఐఎంఎఫ్‌ రెండు సార్లు రుణాలను ఇచ్చింది. ఈ నేపధ్యంలో రాజపక్స సోదరుల రాజీనామాకు దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. మహిందా, గొటబాయ తప్ప మిగిలిన వారంతా రాజీనామా చేశారు. ఆరుగురు మంత్రులు రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దేశాధ్యక్షుడు గొటబాయకు శిరోభారంగా ఉన్న సమయంలో సోమవారం నాడు ఎన్నడూ లేని విధంగా ప్రతి పక్షాలు భీకరమైన ఆందోళన నిర్వహించాయి. రాళ్ళు, కర్రలు, చేతికి ఏది అందివస్తే దానిని విసురుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు. సైన్యం రంగంలోకి దిగినా ఆందోళనకారులు లెక్క చేయలేదు. దాంతో కర్ఫ్యూను విధించారు.

కర్ఫ్యూని కూడా లెక్క చేయకుండా మహిందా రాజీనామా కోసం ప్రజలు ఆందోళన చేయడంతో చివరికి విధిలేని పరిస్థితిలో ఆయన తన రాజీనామాని దేశాధ్యక్షునికి పంపారు. దేశాధ్యక్షుడు కూడా రాజీ నామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. దేశంలో సంక్షోభం ప్రారంభమైన తర్వాత ఇంత తీవ్ర రూపందాల్చడం ఇదే మొదటి సారి. ప్రజలు తమ ప్రాణాలను లెక్క చేయడం లేదు. రాజపక్స కుటుంబసభ్యుల ఉక్కుపిడికిలి నుంచి బయటపడేందుకు ఎంతటికైనా తెగిస్తామని ఆందోళనకారులు బహిరంగంగానే ప్రకటించారు. పరిస్థితి ఇంతగా క్షీణిం చడానికి మహిందాయే కారణమని దేశంలో ఏ పార్టీకీ చెందని వారు సైతం వ్యాఖ్యా నిస్తున్నారు. ప్రతిపక్షాల ఆందోళన ప్రారంభమైన తొలి రోజుల్లోనే అతడు రాజీనామాచేసి ఉంటే రక్తపాతం నివారింపబడేదని వారంటున్నారు. రాజపక్స చాలా మొండి మనిషి అని తమిళ టైగర్లతో అంతర్యుద్ధం సమయంలోనే రుజువైం దనీ, అటువంటి వ్యక్తి తిరిగి ప్రధాని కావడం దేశానికి పట్టిన అరిష్టమని బహిరంగం గానే విమర్శిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభానికి పూర్తిగా రాజపక్స సోదరులే కారణమన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట. దేశంలో టైగర్లదాడుల సమయంలో కూడా ఇలాంటి దారు ణమైన పరిస్థితులు ఏర్పడలేదని జనం వాపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement