Friday, June 2, 2023

నేటి సంపాద‌కీయం – బీహార్ అసెంబ్లీలో లాఠీఛార్జి..!

బీహార్‌ అసెంబ్లీ లో ముష్టియుద్ధాలు, కుర్చీలు విసురుకోవడాలు కొత్త కాకపోయినా మంగళవారం జరిగిన సంఘటనలు ఇటు ప్రభుత్వంలోనూ, అటు ప్రతిపక్ష కూటమిలోనూ సంయమనం లోపించిందనడానికి నిదర్శనం. బీహార్‌ పోలీసుల కు విస్తృత అధికారాలిచ్చే స్పెషల్‌పోలీసు బిల్లుకు వ్యతిరేకంగా ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ నేతృత్వంలో ఐదు పార్టీల కూటమి సభ్యులు స్పీకర్‌ విజయ కుమార్‌ సిన్హాను అసెంబ్లీ లో ఆయన స్థానం వద్దకు వెళ్ళనివ్వకుండా అడ్డుకునేం దుకు గంటల తరబడి బైఠాయింపు జరిపారు. వారిని కదిలించడం మార్షల్స్‌ వల్ల కాకపోవడంతో సభలోకి పోలీసులను పిలిపించారు. చట్ట సభల్లోకి పోలీసుల ప్రవేశం అనేది పార్లమెంటరీ సంప్రదాయాలకు వ్యతిరేకం. అయినప్పటికీ ఎంత సేపటికీ ప్రతిపక్ష సభ్యులు బైఠాయింపును విరమించకపోవడమే కాకుండా, కుర్చీలనూ, ఇతర ఫర్నిచర్‌ను విరిచేసి పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులను పిలిపించడం అనివార్యమైంది. స్పీకర్‌ను తన స్థానంలోకి వెళ్ళనివ్వకుండా మహిళా ఎమ్మెల్యేలు అడ్డుుకోగా, సభావేదిక ముందు మిగిలిన ప్రతిపక్ష నాయకులు అడ్డుగా నిలిచారు. ఆర్‌జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ హయాంలో అసెంబ్లీ లో సభ్యులు పరస్పరం కొట్టుకోవడం, తిట్టు కోవడం సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌ ప్రతిపక్ష నాయకునిగా ఆనాటి దృశ్యాలను తలపింపజేసే రీతిలో మంగళవారం అసెంబ్లీ ని రణరంగంగా మార్చారు. పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చే బిల్లులను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపార్టీ వ్యతిరేకిస్తుంది. అధికారంలోకి రాగానే అదే పని చేస్తుంది. సీఎం, జేడీయూ నాయకుడు నితీశ్‌ కుమార్‌ బీహార్‌ లోప్రజాస్వామ్య హక్కుల కోసం ఉద్యమాలను నడిపిన నాయకుడు. లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అనుచరునిగా పోలీసుల దురుసు ప్రవర్తనను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు. ఇప్పుడు ఆయనే ఈ బిల్లును తెచ్చారంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోంది. అయితే, ఆర్‌ జేడీనాయకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అల్లర్లు, గందరగోళాలు సృష్టిస్తున్నదృష్ట్యా ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి చట్టానికి కోరలు ఉండాల్సిందేనని నితీశ్‌ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. అసోం లో కూడా పోలీసుల ప్రత్యేకాధికార బిల్లులను అక్కడ ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వ్యతిరేకించడం రివాజు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అది ఒక ప్రచారాంశంగా మారింది. ప్రత్యేకాధికారాలంటే పోలీసులు తమకు అనుమానం వచ్చిన వారిని వారంట్‌ లేకుండా పట్టుకుని పోయి జైల్లో పెట్టేందుకు అధికారం. ఇలాంటి బిల్లులను ఏ రాజకీయ పార్టీ కూడా సమర్ధించదు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలనునియంత్రించేందుకు తెస్తూ ఉంటుంది. బీహార్‌లో అధికార, ప్రతిపక్షాలన్నింటిలోనూ నేరచరితులు ఎక్కువ మంది ఉన్నారు. గతంలో ఆర్‌ జేడీలో మాత్రమే నేరచరితులు ఎక్కువమంది ఉండేవారు. ఇప్పుడు బీజేపీ,జనతాదళ్‌ (యు)లలో కూడావారి సంఖ్య ఆర్‌ జేడీ ఎమ్మెల్యేలతో పోటీ పడే రీతిలో ఉంది. అసెంబ్లీ లోనే కాకుండా, ఆర్‌ జేడీ నిర్వహించిన చలో అసెంబ్లీ ర్యాలీ కార్యక్ర మంలో కూడా ఆర్‌జేడీ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు దురుసుగా వ్యవహరించార‌నీ, జుట్టుపట్టుకుని విచక్షణా రహితంగా కొట్టారని తేజస్వి యాదవ్‌ ఆరోపించారు. ర్యాలీ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా కెమెరామన్‌లపై కూడా పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జి చేసిన దృశ్యాలను ఆర్‌జేడీ జాతీయ మీడియాకు విడుదల చేసింది. అసెంబ్లీ లో సీఎం నితీశ్‌ కుమార్‌ సమక్షంలోనే పోలీసులు అతిగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. పరిస్థితి అంతవరకూ వెళ్ళకుండా నితీశ్‌ ప్రతిపక్ష నాయకులను పిలిపించి చర్చించి ఉండా ల్సింది. అలాగే, పోలీసులకు విస్తృత అధికారాలిచ్చే బిల్లును వాయిదా వేసి ఉండాల్సింది. ఈ ఘటనలకు ఈ బిల్లు పైకి ఒక కారణంగా కనిపిస్తున్నా, ఆర్‌జేడీ సభ్యులు అడుగుడుగునా అడ్డుపడుతుండ టంతో ఓరిమి నశించి సభ్యులను బయటకు పంపడానికి పోలీసు చర్యకు ఉపక్రమించాల్సి వచ్చిందన్న వివరణలో అసత్యం లేకపోవచ్చు. అసెంబ్లీ లో బిజినెస్‌ అడ్వ యిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించిన అంశాలపైనే చర్చించాల్సి ఉండగా. ఆ సంప్రదా యానికి తిలోదకాలు ఇవ్వడం వల్లనే ఆ సభలు రణరంగాలుగా మారుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement