Thursday, March 28, 2024

నేటి సంపాద‌కీయం – చేతులెత్తేసిన శ్రీలంక‌..

శ్రీలంక దివాళాతీసింది. తమ దేశం తీసుకున్న రుణాలను తిరిగి తీర్చలేని స్థితిలో ఉందనీ, రుణదాతలు దయ చేసి తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని శ్రీలంక ఆర్థిక శాఖ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రకటన ఒకటి వెలువడుతుందని అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు గడిచిన కొద్ది రోజులుగా అంచనా వేస్తూనే ఉన్నారు. రుణాలు తిరిగి తీరిస్తే ఆహార ధాన్యాలు, మందులు, ఇతర నిత్యావసరాలు దిగుమతి చేసుకునేందుకు ఖజానా ఖాళీ అయిన దృష్ట్యా వీలు కుదరదని ప్రభుత్వం వివరించింది. శ్రీలంక విదేశీ రుణం 5,600 కోట్ల డాలర్లు ఉంది. ఏటా 600 కోట్ల డాలర్లను అప్పులు, వడ్డీ కింద చెల్లిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు సరిపోకపోవడంతో అధిక వడ్డీలకు వివిధ దేశాల నుంచి రుణాలు తీసుకుంది. లంకను ఆదుకునేందుకు భారత్‌ చేయగలసాయం చేసింది. తాజాగా 200 కోట్ల డాలర్ల సాయాన్ని అందించింది. లంక ఆర్థిక శాఖ ప్రకటన చూస్తే, భారత్‌కి రావల్సిన బకాయిలన్నీ వదులుకో వల్సిందేనని స్పష్టం అవుతోంది. లంకకు ఈ దుస్థితి ఎదురు కావడానికి కరోనా సమయంలో లాక్‌డౌన్‌ ప్రక టించడమేనని దేశ ప్రధాని మహిందా రాజపక్స చెబు తుండగా, ఆయన అనుసరించిన అనాలోచిత విధానాలే కారణమని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి.

గతంలో ఏ ప్రధానమంత్రి తీసుకోనిరీతిలో రాజపక్స చైనా నుంచి, ఇతర దేశాలనుంచి అధిక వడ్డీలకు రుణాలు తెచ్చారనీ, ఆ రుణాలపై వడ్డీలు చెల్లించడానికే అధిక నిధులు వెచ్చించాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు వివరించాయి. రాజపక్స చైనా వలలో పడి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇది రాజకీయ ఆరోపణ కాదు. దేశంలో ఆర్థిక వేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. దేశంలో ఆహారోత్పత్తి తగ్గడానికి మహిందా రాజపక్స తీసుకున్న అనాలోచిత విధానాలు కారణం. తరతరాలుగా భారత్‌ లంకకు సాయపడుతుండగా, భారత్‌తో మైత్రిని కొనసాగించడానికి బదులు రాజపక్స చైనాను నమ్మి దేశాన్ని నట్టేట ముంచారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. దేశంలో కరెంట్‌ లేక పరిశ్రమలు మూత పడ్డాయి. ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు జరగడం లేదు. ఆక్సిజన్‌ సిలిండర్లు లేవు. కరోనా సమయంలో భారత్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు పంపింది. అలాగే, ఇటీవల భారత్‌ శ్రీలంకకు బియ్యాన్ని కూడా కాకినాడ రేవు ద్వారా పంపింది. రుణాలు, ఆహార ధాన్యాలను మన దేశం నుంచి తీసుకుంటూ చైనాకు రాజపక్స మద్దతు ప్రకటించడాన్ని ఆ దేశంలో జాతీయవాదులు, సీనియర్‌ నాయకులు సరిపెట్టుకోలేకపోతున్నారు. ఈ దుస్థితికి రాజపక్స అనాలోచిత విధానాలు కొంత కారణం అయితే, చైనా దురాశ మరికొంత కారణం.

విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఇటీవల కొలంబోలో పర్యటించినప్పుడు ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత్‌ ఆదుకోవాలని దేశంలోని రాజకీయ పార్టీలు చేతులెత్తిమొక్కాయి. అయితే, ఇతర దేశాలకు సాయాన్ని అందించడంలో కొన్ని పరిమితులు కూడాఉంటాయన్న సంగతిని జైశంకర్‌ గుర్తు చేశారు. లంకలో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొనడానికి చాలా కాలం పడుతుంది. అక్కడి తమిళులు మన తమిళనాడులోని వారితో సంబంధబాంధవ్యాలను కలిగి ఉన్న కారణంగా ఇప్పటికే చాలా మంది అక్రమ మార్గాల్లో తమిళనాడుకు చేరుకున్నారు. లంక నుంచి తమిళ శరణార్దుల తాకిడి పెరగడంతో తమిళనా డుతోఆహార ధాన్యాలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ రెండు సార్లు కేంద్రం దృష్టికి తెచ్చారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా లంక క్రికెటర్లు ఐపీఎల్‌ మ్యాచ్‌లలో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశం తగలబడుతుంటే, ఇంకా క్రికెట్‌ మ్యాచ్‌లేమిటి, స్వదేశానికి తిరిగి రండి అంటూ లంక క్రికెటర్లకు మాజీ కెప్టెన్‌ అర్జున్‌ రణతుంగ పిలుపు ఇచ్చారు. ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం వల్ల అన్ని దేశాలూ ఆర్థిక అస్తవ్యస్తస్థితిని ఎదుర్కొంటున్న కారణంగా లంకను ఆదుకోవడానికి ఏ ఒక్క దేశమూ ముందుకు రావడంలేదు.

ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ రుణాలను చెల్లించలేమంటూ లంక ఆర్థిక శాఖ ప్రకటించింది. ప్రస్తుత సంక్షోభానికి మూలకారకుడైన మహిందా రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆయన నివాసంవద్ద వందలాది మంది ప్లకార్డులతో ప్రదర్శనలు జరిపారు. అవినీతి ద్వారా కూడబెట్టిన డబ్బును కక్కేయాలనీ, దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేందుకు ఇంతకన్నా వేరే మార్గం లేదని వారు డిమాండ్‌ చేశారు. దేశ సంపదంతా రాజపక్ససోదరులు, కుటుంబ సభ్యులవద్దే ఉందని ప్రదర్శకులు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement