Tuesday, March 26, 2024

నేటి సంపాదకీయం–’ప్రజలకు చేరువలో గవర్నర్లు’

ప్ర‌భ‌న్యూస్ : గ‌వర్నర్లు రాజ్‌భవన్‌లకు పరిమితం కాకుండా ప్రజలతో సంబంధాలు పెంచుకో వాలని రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ పిలుపు ఇచ్చారు. కేంద్రం ప్రారంభించిన సంక్షేమ పథకాల్లో ప్రజలు భాగస్వాములయ్యేట్టు గవర్నర్లు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గవర్నర్లు ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారథులుగా పని చేయాలని ప్రధాని మోడీ పెక్కు సందర్భాల్లో సూచించారు. గవర్నర్ల పాత్రపై ఇప్పుడు విమర్శలు ఏమీ లేవు. గతంలో గవర్నర్లను కేంద్రం ఏజెంట్లుగా ఆనాటి ప్రతిపక్షాలు ఆరోపించేవి. ఇప్పుడు కూడా అలాంటి ఆరోపణలు వచ్చినా, అవి బాగా తక్కువ. రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్లు కేంద్రానికి నివేదికలు పంపడం ఏనాటి నుంచో ఉంది. అయితే, పూర్వపు గవర్నర్లు గతంలో పంపిన నివేదికల్లో వాస్తవ పరిస్థితికి అవి అద్దం పట్టినట్టు ఉండేవి. ఇప్పుుడు రాజకీయ పరమైన ద్వేషాలూ, విమర్శలు పెరిగి పోవడం వల్ల గవర్నర్లు కూడా కేంద్రం చెప్పినట్టు నడుచుకుంటున్నారన్న ఆరోపణ లు వస్తున్నాయి.

ఏది ఏమైనా గతంతో పోలిస్తే గవర్నర్లు పాక్షిక వైఖరిని అనుసరిస్తున్నారన్న విమర్శలు తక్కువే. ఇందిరాగాంధీహయాంలోనూ, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ పాలనలోనూ గవర్నర్లపై వివాదాస్పదమైన వార్తలు తరచూ వచ్చేవి. ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ థన్‌కర్‌కీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకూ మధ్య వివాదాలు అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ తిరిగి ప్రమాణం చేయడానికి ముందు జరిగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనలపై గవర్నర్‌దే బాధ్యత అని తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించడం, కేంద్రం ఈ సంఘటనలపై ప్రత్యేక నివేదికను తెప్పించుకోవడం సంచలనా న్ని సృష్టించింది. అలాగే, పుదుచ్చేరిలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడటానికి ముందు అధికారంలో ఉన్న నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికీ, ఆనాటి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీకీ మధ్య తలెత్తిన వివాదాలు గురించి ఇంకా మనకు గుర్తు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో అటువంటి వార్తలేమీ రావడం లేదు. ప్రస్తుతం ఉన్న గవర్నర్లంతా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలురే కావడం వల్ల వివాదాలు ఎక్కువగా వెలుగులోకి రావడం లేదు. రాష్ట్రపతిని రాజ్యాంగాధినేతగానూ, గవర్నర్లను రాజ్యాంగ ప్రతినిధులుగానూ తరచూ అభివర్ణిస్తూ ఉంటారు. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ హయాంలో రాజకీయాలకు అతీతంగా గవర్నర్ల వ్యవస్థ నడిచింది. ఆ తర్వాత గవర్నర్లు కేంద్ర హోం మంత్రి చెప్పినట్టు నడుచుకోవడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి గవర్నర్ల పాత్రపై వివాదాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత ఏర్పడినప్పుడు గవర్నర్ల నివేదికలకు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనేమో పరిస్థితి అంతవరకూ రావడం లేదు. గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్ల పాత్ర ప్రారంభోత్సవాలు, ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకే పరిమితం అవుతోంది.

దీనిని దృష్టిలో ఉంచుకునే గవర్నర్లు తరచూ తమ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతా ల్లో పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి తెలుసుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. ఈ విషయంలో కొందరు గవర్నర్లు చురుకైన పాత్ర వహిస్తున్నారు. ఉదారహణకు తెలంగాణ గవర్నర్‌ తమిళ సై రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో తాను చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు గురించి ఢిల్లిdలో జరిగిన గవర్నర్లసమావేశంలో వివరించారు. దీనిపై వివరంగా మాట్లాడేందుకు ఆమెకు అవకాశం లభించింది. ఆమె ప్రారంభించిన ప్రాజెక్టుకు పెద్దల ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా, పౌష్టికాహార లోపం వల్ల గిరిజనుల పిల్లలు తరచూ అస్వస్థులు కావడం జరుగుతోంది. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాల గురించి కూడా ఆమె శ్రద్ధ తీసుకుంటున్నందుకు ప్రశంసలు లభించాయి. గతంలో చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో గిరిజనుల సంక్షేమం కోసం అప్పటి గవర్నర్లు తీసుకున్న చొరవను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. రాజకీయ ప్రాధాన్యం లేకుండా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న గవర్నర్లకు ఇప్పటికీ ఆదరణ లభిస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement