Friday, April 19, 2024

నేటి సంపాదకీయం – పూర్వ వైభ‌వం కోసం..

ప్ర‌భుత్వ రంగంలోని ఎయిరిండియా ను 69 సంవత్సరాల తర్వాత మళ్ళీ టాటా సన్స్‌ సంస్థకు కేంద్రం అప్పగించింది. ఎయిరిండియా గడిచిన కొన్ని సంవత్సరాలుగా నష్టాలతో నడుస్తోంది. యూపీఏ హయాంలోనే ఎయిర్‌లైన్స్‌ని ఎయిరిండియాలో విలీనం చేసి ఒకే సంస్థగా నడుపుతున్నారు. అయితే, ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుని పోవడం వల్ల వంద శాతం వాటాలను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడం మినహా గత్యంతరం లేదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. టాటాగ్రూపు టాటా ఎయిర్‌ లైన్స్‌ని 1938లో ప్రారంభించింది. 1953లో దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మళ్ళీ టాటా సంస్థకే ఎయిరిండియాను అప్పగించడం చరిత్రలో కీలక ఘట్టం. అప్పుడు ఎలాంటి ఉద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయో ఇప్పుడూ అలాంటి సన్నివేశాలే చొటు చేసుకున్నట్టు ఆ సంస్థతో అనుబంధం ఉన్న వారు తెలియజేశారు. టాటా గ్రూపు అనుబంధ సంస్థ ట్యాలెస్‌ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన వేలంలో ఎయిర్‌ ఇండియాను 18వేల కోట్ల రూపాయిలకు సొంతం చేసుకుంది. 2,700 కోట్ల రూపాయిలు నగదు రూపంలో చెల్లించింది. మిగిలిన సొమ్మును రుణాల రూపంలో చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. దేశంలో టాటా గ్రూపు వైమానిక రంగంలో నెలకొల్పిన రికార్డులు అపూర్వమైన. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా టాటా ఎయిర్‌లైన్ విమాన సర్వీసులను నడిపింది. ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవాన్నితెచ్చేందుకే ఈ సంస్థను టేకోవర్‌ చేసినట్టు టాటా సన్స్‌ చైర్మన్ చంద్రశేఖరన్‌ తెలియజేశారు.

ఈ సంస్థ నిర్వహణను రతన్‌ టాటా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారనీ, ఈ సందర్భంగా ఉద్యోగులు, పైలట్లు, అధికారులందరికీ ప్రత్యేక సందేశం ఇచ్చారనీ ప్రయాణీకులకు సంతృప్తికరమైన సేవలు అందించి సంస్థ పేరును నిలబెట్టాలని కోరారని ఆయన చెప్పారు. టాటా కంపెనీ వ్యవస్థాపకుడు జేఆర్‌డీటాటా 1938లో సింగిల్‌ ఇంజన్ విమానాన్ని ప్రస్తుతం పాక్‌లో ఉన్న కరాచీ నుంచి ముంబాయికి
తానే స్వయంగా నడిపారు. టాటాల చేతుల్లో ఎయిర్‌లైన్స్‌ భద్రంగా ఉంటుందనే ఆ సంస్థకు
ఎయిరిండియా దక్కేట్టు మోడీ ప్రభుత్వం పావులు కదిపింది. స్వాతంత్య్రంవచ్చిన తొలి రోజుల్లో నవభారత నిర్మాణంలో టాటాలు, బిర్లాలు అందించిన సహకారం మరువలేనిది. అప్పట్లో భారీ పరిశ్రమలు, కర్మాగారాల స్థాపనలో టాటా, బిర్లాలు సహకారం అందించాయి. తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ దేశ సంపదను టాటా, బిర్లాలకు దోచి పెడుతున్నారన్న విమర్శలు వచ్చినప్పటికీ, ప్రభుత్వ, ప్రైవేటురంగ పరిశ్రమలు సమానంగా అభివృద్ధి పర్చేట్టు నెహ్రూ చర్యలు తీసుకున్నారు. దేశంలో నవరత్నాలుగా ప్రసిద్ధి చెందిన ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సంస్థలను ప్రభుత్వ రంగంలో ఆయన నెలకొల్పారు. దేశాభివృద్ది కృషిలో ప్రభుత్వ, ప్రైవేటురంగాలు పోటీ పడాలని అప్పట్లో ఆయన పిలుపు ఇచ్చారు.

ప్రభుత్వ రంగ సంస్థలను 1990లో ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరించే
కార్యక్రమం ప్రారంభమైంది. ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అభివృద్ది సాధిస్తున్న ఈ సంస్థలు ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు నష్టాల బారిన ఎందుకు పడ్డాయన్నది ఆ సంస్థల లో పని చేసే వారే కాకుండా, అప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. టాటా, బిర్లాలపై వామపక్షాలు అప్పట్లో ఎంత ఘాటుగా విమర్శలు చేసేవో ఆనాటి తరం వారికి గుర్తుండే ఉంటుంది. అలాగే, ఇప్పుడు ఆర్థిక సంస్కరణల పేరిట అంబానీ, ఆదానీలకు దేశంలో ప్రతిష్ఠాత్మక సంస్థలను కట్టబెడు తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈప్రైవేటీకరణ కార్యక్రమం సాగుతోంది. అన్ని జెట్ విమానాలతో ఎయిర్‌
ఇండియా ప్రపంచంలో తొలి జెట్ విమానాల సంస్థగా పేరొందింది. ఎ యిరిండియాను స్వాధీనం చేసుకున్న టాటా సన్స్ విమానాల్లో ఆయా దేశాల, ప్రాంతాల రుచులతో ఆహారాన్ని సరఫరా చేయనుంది. ప్రైవేటు విమాన సర్వీసులు పెరిగిన తర్వాత ఎయిరిండియా నష్టాలు పెరిగాయి. వాటి నుంచి గట్టెక్కించడానికి కొత్త విధానాలనూ, పద్దతులను ప్రవేశ పెట్టేందుకు టాటా గ్రూపు సిద్ధమవుతోంది. మహారాజా లోగోతో ఎయిరిండియా ప్రయాణీకులను ఆహ్వానిస్తూ తిరిగి దగ్గరయ్యేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement