Friday, April 19, 2024

నేటి సంపాదకీయం–సాగదీయ వద్దు!

ప్ర‌భ‌న్యూస్ : ఏడాదిగా రైతులు ఏ చట్టాల రద్దు కోసమైతే ఢిల్లి సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారో ఆ చట్టాల రద్దుకు ఉద్దేశించిన మూడు బిల్లులను సోమవారంనాడు పార్లమెంటు ఆమోదించింది. ఇందుకు సంబంధించిన బిల్లులను ఎంత హడావుడిగా,జాప్యం లేకుండా పార్లమెంటు ఆమోదించిందో, ఇప్పుడు వాటి రద్దుకు సంబంధించిన బిల్లులను కూడా అంతకన్నా తక్కువ వ్యవధిలోఆమోదించింది. ప్రభుత్వం ఈ విషయంలో తన నిజాయితీని చాటుకున్నప్పటికీ, పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం ఆనాడు బిల్లులు ఆమోదించేటప్పుడు, ఇప్పుడు రద్దు చేసేటప్పుడూ చర్చకు అవకాశం కల్పించకపోవడాన్ని ప్రజాస్వామ్య హితైషులు తప్పు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న వ్యవహరణ తీరుకు ఇది నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. ఈ బిల్లులపై చర్చ జరిగితే, ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంగా అనుసరించిన విధానాన్ని ప్రతిపక్షాలు ఎండగడతాయనీ, వాటికి ఆ అవకాశం ఇవ్వరాదన్న ఉద్దేశ్యంతోనే హడావుడిగా ఆమోదించడం జరిగిం దని వారంటున్నారు.

పార్లమెంటులో సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పుడు ఆ బెదురెందుకని ప్రశ్నిస్తున్నారు. తమ నోళ్ళను మూయించడానికే ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అనుసరించిందంటూ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, టిఎంసీ, తదితర నాయకులు చేసిన ఆరోపణల్లో ఎంతో వేదన కనిపిస్తోంది. సాగు చట్టాల రద్దు కోసం ప్రభుత్వం ఓ పట్టాన అంగీకరించలేదు. ఢిల్లిd సరిహద్దుల్లో భారత కిసాన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రైతులు సాగించిన ఆందోళన ఫలితంగానే దిగి వచ్చింది. వారి ఆందోళనకు ప్రతిపక్షాలు అండగా నిలిచాయి. ఇది తమ విజయమని చెప్పుకునేందుకు పార్లమెంటులో తమ వాణిని వినిపించాలనుకున్నాయి. అయితే, అంతకుమించిన చర్చ పార్లమెంటులో గతంలో జరిగిందనీ, ప్రభుత్వ వైఖరి ఏమిటోప్రధాని వివరించిన తర్వాత చర్చ ఇక అవసరం లేదని ప్రభుత్వం సమాధాన మిచ్చింది. అయితే, ఇది సభా నియమాలకు అనుగుణంగా లేదు. ముఖ్యమైన బిల్లులు, చట్ట సవరణలపై సభలో సమగ్రమైన చర్చ జరిగితేనే వాటిపై ప్రజలకు అవగాహన ఏర్పడు తుంది. అలాగే, ప్రతిపక్షాలను సంతృప్తి పర్చినట్టు అవుతుంది.

ఈ చట్టాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రధాని ప్రభుత్వ వార్తా ప్రసారాల ద్వారా ప్రకటించినప్పుడు ఆనందించిన వారే ఇప్పుడు పార్లమెంటులోచర్చ జరగనందుకు తప్పు పడుతున్నారు. పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలూ ముఖ్యమైన అంశాలపై చర్చించడానికే ఉన్నాయి. కానీ, చట్టసభలను ప్రభుత్వమూ, ప్రతిపక్షాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడానికీ, వ్యక్తిగత ఆరోపణలకు వినియోగించుకుంటున్నాయి. రాష్ట్రాల శాసనసభల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇందుకు ప్రభుత్వమూ, ప్రతిపక్షాలూ సమానంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సాగు చట్టాలపై ప్రభుత్వం పట్టువిడుపుల వైఖరిని మొదట్లోనే ప్రదర్శించి ఉంటే సభా సమయం వృధా అయి ఉండేది కాదు. అలాగే, రైతులు రచ్చకెక్కి ఉండేవారు.ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞతను ప్రదర్శించినందుకు అభినందనీయమే. పట్టువిడుపులు అనేవి ఇరువైపులా ఉండాలి.

ప్రభుత్వం దిగి వచ్చినా, ఆందోళన సాగిస్తా మంటూ రైతుసంఘాల నాయకుడు రాకేష్‌ తికాయత్‌ ప్రకటించడం దురదృష్టకరం. మద్దతుధరపై లిఖితపూర్వక హామీ ఇవ్వడానికైనా సిద్ధమేనంటూ ప్రధాని మోడీ ప్రకటిం చిన తర్వాత ఆ హామీని రాబట్టుకోవడానికి ప్రయత్నించాలే తప్ప, ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ రైతు సంఘాలు వెనక్కి తగ్గడం సమంజసం కాదు. రైతుల ఆందోళన తో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఢిల్లిd, హర్యానా, పంజాబ్‌లలో ఆర్థికాభివృద్ది దెబ్బతింది. ఈ విషయాలను రైతుసంఘాల నాయకులు పరిగ ణనలోకి తీసుకుని ప్రభుత్వంతో చర్చలకు ఉపక్రమించాలి. ప్రభుత్వం దిగిరాక ముందే చర్చలు జరిపిన రైతుసంఘాల నాయకులు ఇప్పుడు చర్చలకు వెళ్తే అభ్యంతరం ఏమిటో ఎవరికీ అర్ధం కాదు. మద్దతు ధర మాత్రమే కాదు, తమ డిమాండ్లు ఇంకా చాలా ఉన్నాయంటూ తికాయత్‌ సన్నాయి నొక్కులు ప్రారంభించారు.ఒక్కసారే అన్ని డిమాండ్లనూ ప్రభుత్వం ఆమోదించాలనడం సమంజసం కాదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement