Friday, April 26, 2024

నేటి సంపాదకీయం–రైతులపై నెర‌మా..

ప్రభ‌న్యూస్: ఢిల్లిలో వాయుకాలుష్యం పెరిగిపోవడానికి రైతులే కారణమన్నట్టుగా కొందరు చేస్తున్న వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నవంబర్‌ మాసంలో ఏటా ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా రైతులు పంటలు కోసిన తర్వాత వ్యవసాయ వ్యర్ధాలను తగులబెట్టినప్పుడు కాలుష్యం వ్యాపించడం ఎంతో కాలంగా ఉన్న సమస్యే. దీనిపై ఢిల్లి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని కాలుష్యం బారి నుంచి ప్రజలను గట్టెక్కిస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించేందుకు సిద్ధమేనని ఢిల్లి ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ప్రకటించేట్టు ఆదేశించాలన్న ఢిల్లి ప్రభుత్వ అభ్యర్ధనను కేంద్రం తోసిపుచ్చింది. కరోనా కారణంగా విధించిన వర్క్‌ ఫ్రమ్‌ హోం ఆదేశాలవల్ల ఇప్పటికే పనులు మందగించినట్టు ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం పేర్కొంది.

అయితే, సమస్యకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, కేవలం రైతులు వ్యవసాయ వ్యర్ధాలను కాల్చడం వల్లనే కాలుష్యం పెరిగిపోతోందంటూ టీవీ చర్చల్లో రాజకీయ నాయకులు అభిప్రాయాలను వ్యక్తంచేయడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హెచ్చరించారు. రైతుల మీదనే నెపాన్ని పూర్తిగా నెట్టివేయడం సరికాదనీ, కాలుష్య వ్యాప్తిలో వాహానాల సంఖ్య పెరగడం, పారిశ్రామిక సంస్థల నుంచి వెలువడే వాయువులు, ఇతర కారణాలు కూడా ఉన్నాయని మరువరాదన్నది కోర్టు అభిప్రాయం కావచ్చు. అది ముమ్మాటికీ నిజమే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపధ్యంలో వారే కాలుష్యాన్ని మరింత పెంచుతున్నారన్న అపోహలు ఉంటే ఉండవచ్చు, కానీ, వ్యవసాయ వ్యర్ధాలను కాల్చడం వల్ల దట్టమైన పొగలు వ్యాపించడం అనేది ఈ ఏడాది కొత్తగా తలెత్తిన పరిణామం కాదు.

అందువల్ల రైతులకు నచ్చజెప్పి వ్యవసాయ వ్యర్దాలు కాల్చకుండా వాయిదా వేసేట్టు ఒప్పించడానికి బదులు వారిని రెచ్చగొట్టే రీతిలో ప్రకటనలు చేయడం సమంజసం కాదని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఇదే సలహాను గతంలో కోర్టు కేంద్రానికి ఇచ్చిందని చెప్పారు. వ్యవసాయ వ్యర్ధాలను కాల్చడం వల్ల వెలువడే పొగ కన్నా, పారిశ్రామిక సంస్థల నుంచి వెలువడే వాయువుల్లో రసాయనాలు ఉంటాయి. అవి ప్రజల శ్వాసవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతాయి. గ్రామాల్లో శీతాకాలంలో పొగమంచు, చలి మంటలు, భోగిమంటలు వంటివన్నీ సర్వసాధారణమే తరతరాలుగా గ్రామాల్లో ప్రజలు వీటికి అలవాటు పడ్డారు. పంజాబ్‌, హర్యానాలలోనే కాదు, కోస్తా జిల్లాల్లో కూడా చెరకు పిప్పి, ఎండిపోయిన గడలను తగుల బెట్టడం సర్వసాధారణం. రసాయినాల వాయువుల ను విడుదల చేసే పరిశ్రమలు ఢిల్లి చుట్టూ ఉన్నాయి.

అలాగే, ప్రజలు మంచినీటికి ఉపయో గించే కాలవల్లోకి వ్యర్ధాలను విడుదల చేయడం కూడా చూస్తుంటాం. అలాంటి సంస్థల నుంచి వెలువడే వాయువులే ప్రమాదకర కాలుష్యాలు. వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. ఢిల్లి దేశ రాజధాని నగరం కావడం వల్లవాహనాల సంఖ్య బాగా ఎక్కువ. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబాయి వంటి మహా నగరాల్లోనే వాహన కాలుష్యం పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఢిల్లిలో కాలుష్యం మరింత ఎక్కువగాఉండటం అసహజమేమీ కాదు. అలాగే, యమునా నదిలో కాలుష్యం నురగలు కక్కుతోంది. కాలుష్యంలో గంగానదితో ఆ నది పోటీ పడుతోంది. నదీ జలాల శుభ్రత, కాలుష్య నివారణ గురించి పార్లమెంటులో చర్చలు జరగడం, కోట్లాది రూపాయిలు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం ఆనవాయితీగా మారిందే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. ఉత్తరాదిన పంజాబ్‌, బీహార్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రు లను కేంద్రం సమావేశ పర్చి కాలుష్య నివారణకు పటిష్టమైన పథకాన్ని రూపొందించడం అవసరం. సమస్యకు అందరూ బాధ్యలే అయినప్పుడు రైతులపైనే నెపాన్ని నెట్టేసి ఆరోపణలు చేయడం భావ్యం కాదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement