Wednesday, April 24, 2024

నేటి సంపాదకీయం–సీజేఐ న్యాయోపదేశం!


ప్ర‌భ‌న్యూస్ : న్యాయమూర్తులు, న్యాయవాదులు ఒకే కుటుంబానికి చెందిన వారనీ, న్యాయవ్యవస్థపై దాడులు జరుగుతున్నప్పుడు న్యాయవాదులు సకాలంలో స్పందించడం ముదావహమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రశంసిస్తూ, న్యాయవాదులకు ఇచ్చిన పిలుపు సందర్బోచితంగా ఉంది. సమాజంలో చెడును ఎదిరించడానికి న్యాయవాదులు భయపడవద్దన్న ఆయన చేసిన న్యాయోపదేశం స్వాతంత్య్ర సమరం నాటి పరిస్థితులను గుర్తు చేసింది. స్వాతంత్య్ర సమరంలో మహాత్ముని వెంట నడిచిన యోధుల్లో అధిక సంఖ్యాకులు న్యాయవాదులే. వారిలో తెలుగువారు అనేక మంది ఉన్నారు. అప్పటి బ్రిటిష్‌ చట్టాలనూ, ఉత్తర్వులనూ ఎదిరించడంలో ఆనాటి న్యాయవాదులు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారు. అలా చేసి టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రకేసరిగా ఈనాటికీ ప్రజల నీరాజనాలను అందుకుంటున్నారు.

న్యాయవాదులు బ్రిటిష్‌ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన జరిపిన తీరు ఈనాటికీ స్ఫూర్తిదాయకమే. అప్పుడు పరాయి ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల ప్రజలను వేధించడంపైనా, ప్రజల హక్కుల అణచివేయడంపైనా ఎక్కువగా దృష్టి పెట్టేది. స్వాతంత్య్రంవచ్చినా ఇంకా బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలు కొనసాగుతున్నాయి. ప్రధానిగా అధికారాన్ని చేపట్టిన నరేంద్రమోడీ 11వందలకు పైగా చట్టాలను రద్దుచేశారు. వాటిని సరళీకరించి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటు న్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమికహక్కులకు భంగం కలగకుండా చూడటం న్యాయవ్యవస్థ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ విషయమై ప్రతి సందర్భంలోనూ న్యాయవాదులను చైతన్య పరుస్తున్నారు. అలాగే, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించే సంఘటనలు సమాజంలో తరచూచోటు చేసుకుం టున్నప్పుడు మౌనప్రేక్షకులుగా ఉండకుండా చెడును వ్యతిరేకించే ధైర్యాన్ని న్యాయవాదు లు అలవర్చుకోవాలన్న జస్టిస్‌ రమణ ఉద్బోధ సందర్భోచితంగానే ఉంది.

అయితే, న్యాయ వాదులకూ, న్యాయమూర్తులకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కొద్ది రోజుల క్రితం జార్ఖండ్‌లో ఒక న్యాయమూర్తి ఉదయం వేళ వ్యాహ్యాళికి వెళ్తుండగా, కొందరు దుండగులు ఆటోను ఢీకొట్టించి హత్య చేశారు.ఇది ప్రమాదం కాదనీ, ఉద్దేశ్య పూర్వకంగానే ఆ న్యాయమూర్తిని దుండగులు ఆటోను ఢీకొట్టించారని ప్రాథమిక దర్యాప్తు లో తేలింది.దీనిపై కూడా జస్టిస్‌ రమణ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిం చేందుకు కంకణంకట్టుకున్న న్యాయమూర్తులు,న్యాయవాదులపై దాడులు జరగడాన్ని యావత్‌ సమాజం ఖండించాలనీ, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన బహుశా ఇదే ఘటనను మనసులో ఉంచుకుని న్యాయమూర్తులకూ,న్యాయవాదులకూ రక్షణ కల్పించడం సమాజం బాధ్యత అని అన్నారు. న్యాయవాదులు సమాజంలో భాగమే కనుక,వారికి వివిధ వర్గాలు,పార్టీలతో సంబంధాలు ఉంటాయి.

కొందరు న్యాయవాదులు రాజకీయ పార్టీలలో చేరి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.ఈ నేపథ్యంలో న్యాయవాదులు తమ ప్రధాన బాధ్యతను గుర్తెరిగి మసులుకోవాలన్నదే ప్రధాన న్యాయమూర్తి ఉద్దేశ్యం. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనేవి రాజ్యాంగానికి ప్రాతిపదికలని వాటిని కాపాడుతామని న్యాయవాదులు ప్రతిన చేయాలని సిజేఐ పిలుపు ఇచ్చారు. అయితే, రాజకీయపరమైన ఒత్తిళ్ళ కారణంగా న్యాయవాదులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితులు నేటి సమాజంలో నెలకొన్నాయి. అటువంటి సందర్భాల్లో ఎటువంటి బెదిరింపులకూ, ఒత్తిళ్ళకూ లొంగకుండా పనిచేయాలన్నదే ప్రధానన్యాయమూర్తి పిలుపులోని ముఖ్యోద్దే శ్యం. రాజ్యాంగంలోని హక్కుల గురించి బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తెలియ జేయడంలో దేశంలో న్యాయవాదులు ఇప్పటికే చాలా వరకు కృతకృత్యులయ్యారు . కేవలం సంపాదనకే పరిమితం కాకుండా, బలహీనవర్గాల హక్కుల కోసం తమ జీవితాల ను అంకితం చేసిన న్యాయవాదులు మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక మంది ఉన్నారు. అటు వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నది ప్రధాన న్యాయమూర్తి ముఖ్యోద్దేశ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement