Tuesday, April 23, 2024

నేటి సంపాద‌కీయం – వెన‌క్కి త‌గ్గిన వైరి దేశాలు.!

ఉక్రెయిన్‌ లో వైద్యవిద్యనభ్యసిస్తున్న నవీన్‌ అనే భారత విద్యార్ధి తల్లితండ్రులకు ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఫోన్‌ చేసి ఓదార్చారు. దేశంలో వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం దొరకకపోవడం వల్లనో, ప్రవేశార్హత (నీట్‌ ) పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంవల్లనో భారతీయ విద్యార్దులు అధిక సంఖ్యలో ఉక్రెయిన్‌కి తరలి వెళ్తున్నారు. ఉక్రెయిన్‌లోని ఖర్ఖీవ్‌లో మెడిసిన్‌ చదువుతున్న నవీన్‌ కర్నాటకకు చెందినవాడు. యుద్దం మొదలైన నాటినుంచి బంకర్‌లో తలదాచుకున్న అతడు భారత ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకునేందుకు బయటకు రావాలనుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు మంగళవారం ఉదయం రష్యన్‌ సేనల దాడుల్లో అతను మరణించాడు. ఇలాంటి అమాయకులెందరో రష్యన్‌ సేనల దాడుల్లో మరణిస్తున్నారు. ఐక్యరాజ్య సమితిరెండుసార్లు సమావేశమై రష్యాను తీవ్రంగాహెచ్చరించినప్పటికీ దారికి రాలేదు. అమెరికా నేతృత్వంలోని నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ (నాటో) కూటమిలో చేరబోమని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే దాడులు ఆపుతామని రష్యా చాలా నిష్కర్షగా స్పష్టం చేసింది.

ఈ పరిస్థితులలో రష్యాను దారికి తేవడం కోసం ఏం చేయాలనే దానిపై ప్రపంచ దేశాలుదృష్టి పెట్టాయి. నాటో సమావేశంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగానికి సభ్యులంతా ముగ్ధులయ్యారు. దాంతో ఉక్రెయిన్‌కి నాటో సభ్యత్వం ఇవ్వాలన్నఆయన అభ్యర్ధనకు అంగీకారం తెలిపారు. సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఆయన డిమాండ్‌ని అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు యుద్ధం తీవ్రత నానాటికీ పెరుగుతోంది. రష్యా వైపు కూడా సేనల నష్టం ఎక్కువగానే ఉంది. అయితే, ప్రపంచ దేశాలను పక్కదారి పట్టించడం కోసం రష్యా తమ వైపునష్టం తక్కువేనని ప్రకటిస్తోంది. ఇప్పుడున్న దాడులు కొనసాగితే చమురు, ఇతర ఇంధనాల ధరలు ఇంకా పెరగవచ్చన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే మన దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ ధరను తాజాగా సిలిండర్‌కి 105 రూపాయిలు పెంచారు. ఇంకా ఎంత పెంచుతారో తెలియదు. రష్యాకి ప్రధాన ఆదాయ వనరు అయిన చమురు, గ్యాస్‌ ధరలను పెంచేయడం ద్వారా యుద్ధం వల్ల వాటిల్లుతున్న నష్టాలను పూడ్చుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు ఒక సీనియర్‌ నాయకుడు ప్రకటన కూడా చేశారు. ఈ దాడిని రష్యా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని ఇప్పటికే తమ దేశంలో కలిపేసుకున్న పుతిన్‌ ఉక్రెయిన్‌లో స్వతంత్రం ప్రకటించుకున్న రెండు రాష్ట్రాలను కూడా అదే మాదిరిగా రష్యా ఏలుబడిలోకి తేవాలని పంతం పట్టింది. చైనా మద్దతు చూసుకుని మరింతగా విరుచుకుని పడుతోంది. ఈ యుద్ధంలో రష్యా గెలుపొందితే తైవాన్‌పైనా, తూర్పు చైనా సముద్రంపైనా ఆధిపత్యాన్ని సంపాదించేందుకు ప్రయత్నించవచ్చని చైనా ఆత్రుత చెందుతోంది. కాగా ఉక్రెయిన్‌కి పాశ్చాత్య దేశాలు మద్దతు ఇచ్చినా తమ సేనలు వెనక్కి వెళ్ళబోవనీ, ఉక్రెయిన్‌ని పూర్తిగా లొంగదీసుకున్న తర్వాతనే తమ సేనల ఉపసంహరణ జరుగు తుందని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగువే ప్రకటించారు. పుతిన్‌ నిర్ణయాలను అమలు జేస్తూ ఆయన వీరవిధే యతను ప్రదర్శిస్తున్నారు. రష్యన్‌ సేనలు, ఆయుధాల ముందు, ఉక్రెయిన్‌ను ఏ విషయంలోనూ పోల్చలేం, అయినప్పటికీ దేశభక్తి పూరితంగా ఉక్రెయిన్‌ సేనలు రష్యన్‌ దాడులను ఎదురొడ్డి పోరాడుతున్నాయి. మరో వంక ఆర్థిక పరమైన ఆంక్షలు మరింతగా బిగుస్తుండటంతో రష్యా పరిస్థితి నానాటికీ దుర్భరంగా తయారవుతోంది. ఉక్రెయిన్‌ మీదుగా రావల్సిన గోధుమలు, మొక్క జొన్న, బార్లీ మొదలైన ఆహార ధాన్యాల సరఫరా యుద్ధం కారణంగా నిలిచిపోయింది.

అలాగే, ఉక్రెయిన్‌ పై రష్యా దాడి తర్వాత స్విప్ట్‌ నుంచి రష్యాను వెలివేశారు. గోధుమనుంచి గ్యాస్‌ వరకూ అన్ని వ్యాపార లావాదేవీలకు నిధుల లావాదేవీలు స్విప్ట్‌ ద్వారానే జరుగుతాయి. అయితే, ఈ పరిస్థితిని ముందే ఊహించి రష్యా ఆహార ధాన్యాల దిగుమతులకు తగిన ఏర్పాట్లు చేసుకుంది. చైనా ఈ విషయంలో రష్యాకు అండగా నిలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగితే రష్యన్‌ సైనికులకు ఆహారం, ఇతర నిత్యావసరాలు అందడం కష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రష్యన్‌ సైనికుల్లో అంతర్‌ మథనం ప్రారంభమైనట్టు సమాచారం. కుటుంబాలకు దూరంగా ఎంత కాలం యుద్ధభూమిలో గడపాలో తెలియక వారిలో ఒక రకమైన నిస్పృహ స్థితి ఆవహిస్తోందన్న సమాచారం అందింది. పుతిన్‌ తీసుకున్న నిర్ణయం వల్ల రష్యన్లు, ఉక్రెయిన్లే కాకుండా యావత్‌ ప్రపంచ దేశాలు కష్టాల్లోకి నెట్టివేయబడ్డాయి. రెండు దేశాల మధ్య బుధవారం జరిగే చర్చలు ఫలించాలని శాంతి కాముక దేశాలు ఆకాంక్షిస్తున్నాయి.

ప్రభన్యూస్

Advertisement

తాజా వార్తలు

Advertisement