Thursday, November 7, 2024

నేటి సంపాద‌కీయం – ఎన్నికల కోసం మరో అడుగు!

కాశ్మీర్‌లో అసెంబ్లి నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై ఏర్పాటైన కమిటీ తన నివేదిక సమర్పించింది. ఈ కమిటీకి జస్టిస్‌ రంజనా ప్రకాష్‌ దేశాయ్‌ నేతృత్వం వహించగా, ప్రధాన ఎన్నికల కమిషన్‌ సుశీల్‌ చంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కెకెశర్మ సభ్యులుగా ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో 90 అసెంబ్లి నియోజకవర్గాలను నిర్ధారించగా, వీటిలో జమ్ములో 43, కాశ్మీర్‌లో47 నియోజక వర్గాలు ఉన్నాయి. జమ్ము, కాశ్మీర్‌ మొత్తానికి ఐదు పార్ల మెంటరీ స్థానాలు ఉంటాయి. కాశ్మీరీ వలసదారులకు రెండు సీట్లను కేటాయించారు. మొదటి సారిగా షెడ్యూల్డ్‌ తెగల వారికి ఐదు సీట్లు కేటాయించారు. కాశ్మీర్‌లో ఎన్ని కల ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ ఉత్స వాలను ప్రారంభిస్తూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే డీ లిమిటేషన్‌ నివేదికను సంబంధిత కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, ఈ కమిటీనీ, ఈ కమిటీ సిఫార్సులను తాము ఆమోదించబోమని పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. ఇది బీజేపీ కమిటీ అనీ, బీజేపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కేంద్రం పన్నిన కుట్రలో భాగంగానే ఈ కమిటీని ఏర్పాటు చేశారంటూ ఆమె ఆరోపించారు. కాశ్మీర్‌లో అధికారం ప్రజలదే కావాలనీ, కేంద్రం పై నుంచి ఎవరినో రుద్దకూడదని ఆమె అన్నారు.

ఆమె చేసిన ప్రకటనలో కొంత నిజముంది కానీ, కాశ్మీర్‌లో ప్రభుత్వాల ఏర్పాటు కోసం గతంలో యూపీఏ, తర్వాత మోడీనేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమి అనేక ప్రయత్నాలు చేసింది. యూపీఏ హయాంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఏ-1ప్రభుత్వంలో ఎన్‌డిఏ-1 ప్రభుత్వంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనాయకుడు డాక్టర్‌ ఫరూక్‌ అబ్దుల్లా మంత్రిగా కూడావ్యవహరించారు. కాశ్మీర్‌లో శాంతి కోసం, పునరావాస సౌకర్యాల కోసం కేంద్రం కోట్లాది రూపాయిలు ఖర్చు చేసినా, వేర్పాటువాదుల ప్రభావాన్నీ, ఉగ్రవాదుల దాడులను అరికట్టలేకపోయారు. ఈ విషయంలో నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీలు రెండూ ఒకే మాదిరిగా వ్యవహరించాయి. వేర్పాటు వాదులతో సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా, ప్రజాస్వామ్య ప్రక్రియ విజవంతం కావడానికి తోడ్పడలేదు. పీడీపీతో బీజేపీ జతకట్టి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించింది. అయితే, పీడీపి వేర్పాటువాదుల సంఘాల సంస్థ హురి యత్‌ కాన్ఫరెన్స్‌తో నేరుగాసంబంధాలు పెట్టుకుంది. ఈ ప్రయోగాలన్నీ విఫలం అయిన తర్వాతనే 2019 ఆగస్టులో కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధిక రణాన్ని రద్దు చేసి జమ్ము, కాశ్మీర్‌, లడఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. కాశ్మీర్‌కి అసెంబ్లి ఉంది. దీనికి ఎన్నికలు జరిపించేందుకు నాందిగా డీలిమిటేషన్‌ పై సిఫార్సులు చేసే బాధ్యతను జస్టిస్‌ రంజనా ప్రకాష్‌ దేశాయ్‌కి కేంద్రం అప్పగించింది. ఈ కమిటీ సిఫార్సులు అన్ని వర్గాల వారికీ ఆమోదయోగ్యం అవుతాయా లేదా అనేది దీనిపై వివిధ పార్టీల స్పందన వెలువడిన తర్వాత కానీ తెలియదు. అయితే, స్థూలంగా, జమ్ము ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ ఈ డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సుల పేరిట తన అజెండాను అమలు జరిపించేందుకు ప్రయత్నిస్తోందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, వామపక్షాలు ఆరోపించాయి.

అయితే, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ నుంచి వలస వచ్చిన వారికి, కాశ్మీరీ పండిట్‌లకూప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రజాస్వామ్య బద్దంగా ఈ కమిషన్‌ సిఫా ర్సులు చేసిందని కేంద్రం చెబుతోంది. కాశ్మీర్‌ విభజన తర్వాత ఉగ్రవాదుల దాడులు తగ్గాయనీ, ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాలవారితో సంబంధాలు కలిగి ఉంటూ జనజీవన స్రవంతిలో భాగం అవుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణ యాలు, ప్రవేశపెట్టిన పథకాలు కాశ్మీర్‌లో అమలు అవు తాయనీ, దేశంలోని ఇతర ప్రాంతాలతో కాశ్మీర్‌ ప్రజలు ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమాల ద్వారా సంబంధాలు కలిగి ఉంటున్నారని కేంద్రం పేర్కొంటోంది. అయితే ప్రస్తుత డీలిమిటేషన్‌ ప్రకారం ఎన్నికలను నిర్వహించడంవల్ల కాశ్మీరీలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నది పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ల వాదన. ఈ రెండు పార్టీలకు కాశ్మీర్‌ లోయలో ప్రజలతో సంబంధాలున్న దృష్ట్యా కేంద్రం ఈ పార్టీల ప్రతినిధులతో ఈ కమిషన్‌ సిఫార్సులపై చర్చలు జరపడం వాంఛనీయం. కాశ్మీర్‌ లోయలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో కూడా సంప్రదింపులు జరపడం వల్ల చిక్కులు ఉండవు. కేంద్రం ఈ విషయంలో తొందరపడకుండా అందరి అభిప్రా యాలను పరిగణనలోకి తీసుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement