Friday, May 27, 2022

నేటి సంపాదకీయం-వోడాకు ఓ ఛాన్స్..

అప్పుల్లో ఉన్న వోడా-ఐడియా లిమిటెడ్‌ (విఐఎల్‌) చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు 16,000 కోట్ల రూపాయిలను ఈక్విటీలుగా మార్చేందుకు కేంద్రం అంగీక రించినట్టు సమాచారం. దీంతో ఆ కంపెనీలో ప్రభుత్వానికి 35 శాతం వాటా లభిస్తుంది. వోడా ఫోన్‌ గ్రూప్‌నకు 28.5 శాతం, ఆదిత్యబిర్లా గ్రూపు వాటా 17.8 శాతానికి తగ్గనున్నాయి. అయితే, ఈ కంపెనీలో హెచ్చు వాటాలను కలిగిఉన్నప్పటికీ, దీని నిర్వహణ బాధ్యతను స్వీకరించేందుకు కేంద్రం సుముఖంగా లేదని విఐఎల్‌ సీఈఓ టక్కర్‌ తెలిపారు. ప్రభుత్వానికి ఈక్విటీలు కేటాయించనున్న నేపధ్యంలో షేర్‌ హోల్డర్ల మధ్య ఒప్పందం కుదిరిందనీ, కంపెనీలో పరిపాలనా హక్కులు, డైరక్టర్ల నియామకం, కీలక పదవులకు వ్యక్తుల ఎంపిక వంటి విషయాల్లో 21 శాతం వాటాలుండాలన్న నియమాన్ని13 శాతానికి తగ్గించేందుకు అంగీకారం కుదిరిందని ఆయన చెప్పారు. దీంతో వోడా-ఐడియా సంస్థకు పాలనా పరమైన హక్కులు దక్కనున్నాయి.

అంతేకాక, ఈ కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థగా నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం నిరాకరించినట్టు సమాచారం. భారీ బకాయిలు కలిగి ఉన్న ఈ కంపెనీ ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపేందుకే ప్రభుత్వం దీని రుణాలను ఈక్విటీలుగా మార్చేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో 1.95 లక్షల కోట్ల రూపాయిల అప్పుల్లో ఉన్న వోడా-ఐడియా లిమిటెడ్‌ కంపెనీలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా మార నున్నది. ఇది ఆ కంపెనీని నిలబెట్టే చర్యగా భావించవచ్చు. అయితే లాభాలతో నడుస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు పట్టుదలతో ఉన్న ప్రభుత్వం విఐఎల్‌ పట్ల ఇంత ఔదార్యాన్ని ఎందుకు ప్రదర్శిస్తోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్పెక్ట్రమ్‌ వాయిదాల మొత్తం, సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ బకాయిలపై కట్టాల్సిన వడ్డీని ఈక్విటీల రూపంలో మార్చేందుకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఈనెల 10వ తేదీన జరిగిన విఐఎల్‌ డైరక్టర్ల బోర్డు సమావేశం పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.

వోడాఫోన్‌-ఐడియాలు చెల్లించాల్సిన రుణాలు లక్షా 95వేల కోట్లుగా గత సెప్టెంబర్‌లో నిర్ధారించింది.టెలికామ్‌ సంస్థల ఉద్దీపనల్లో భాగంగా వోడా, ఐడియా కంపెనీ కట్టాల్సిన స్పెక్ట్రమ్‌, ఏజిఏ బకాయిలను కేంద్రం వాయిదా వేసింది. టాటా టెలీ సర్వీసు కూడా తమ కంపెనీ చెల్లించాల్సిన వడ్డీ బకాయిలను ప్రభుత్వం ఈక్విటీగా తీసుకుంటే ఇచ్చేందుకు సం సిద్ధత వ్యక్తంచేసింది. దీని ద్వారా టాటా టెలీ సర్వీసులో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కుతుంది. టెలికామ్‌ రంగం ప్రభుత్వ అజమాయిషీలో ఉండటం మంచిదే. గతంలో కేంద్ర ప్రభుత్వం టెలి కమ్యూనికేషన్‌ శాఖకు భారీగా నిధులు కేటాయించేది.అయితే, నిర్వహణలో లోపం వల్ల టెలికామ్‌ శాఖ తరచూనష్టాలు వచ్చేవి. ఈశాఖలో భారీగా కుంభకోణాలు కూడా చోటు చేసుకున్నాయి. మాజీ టెలికామ్‌ శాఖ మంత్రి సుఖ్‌రామ్‌ ఈ కుంభకోణంలోజైలుకి వెళ్ళారు. ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత టెలికామ్‌ శాఖలో కూడా సంస్క రణలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కూడా ఈ శాఖలో అవినీతి కుంభకోణాలు వెలుగు చూశాయి. యూపీఏ హయాంలో స్పెక్ట్రమ్‌ వేలంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది.

ఆనాటి టెలికామ్‌ మంత్రి, డిఎంకె నాయకుడు ఎ రాజా, డిఎంకె ఎంపీ కనిమోళి జైలుకి వెళ్ళారు. ఎన్నో ఒడిదుడుకుల్లోచిక్కుకున్న టెలికామ్‌ శాఖను నిలబెట్టేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు ఉద్దీపనాలను ప్రకటిస్తూనే ఉంది. దేశంలో ప్రైవేటు రంగంలో మూడు టెలికామ్‌ కంపెనీలు ఉన్నాయి. వోడా-ఐడియా, ఎయిర్‌టెల్‌, జియో కంపెనీలు ప్రస్తుతం టెలికామ్‌ సర్వీసుల ప్రొవైడర్లుగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోని భారత సంచార్‌ నిగామ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)ను నిలబెట్టేందుకు ప్రభుత్వంచాలా ప్రయత్నాలు చేసింది. అయితే, నిర్వహణలోపంవల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ పుంజుకోలేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వీసుల్లో లోపాలు ఉంటున్నాయని ఖాతాదారుల నుంచి ఇప్పటికీ ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే, ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. వోడాఫోన్‌ మాదిరిగా ఇతర కంపెనీలు కూడా తాము చేలించాల్సిన బకాయిలను ఈక్విటీలుగా మార్చు కోమని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. వోడా-ఐడియా కంపెనీకి ఇచ్చిన ఈ వెసులు బాటును ఇతర రంగాల్లోని పరిశ్రమలకు ఇస్తే అవి కూడా నిలదొక్కుకునే అవకాశం ఉంటుం దని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement