Monday, January 30, 2023

కుబేరులకు మాంద్యం లేదేమి

ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోందం టూ మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడుతున్నప్పటికీ మన దేశంలో మాత్రం బిలియనీ ర్ల సంఖ్య పెరిగిపోతోంది. భౌగోళిక, రాజకీయ అనిశ్చిత స్థితుల కారణంగా రూపాయి విలువ పది శాతం తగ్గింది. అయినప్పటికీ బిలియనీర్లు మరింత శ్రీమంతులయ్యార ని ఫోర్బ్స్‌ తాజా నివేదిక వెల్లడించింది. దేశ సంపదలో 30 శాతం అదానీ, అంబానీలదేనని గణాంకాలు తెలుపు తున్నాయి. ఇంత మాంద్యంలోనూ దేశంలోని వంద మంది బిలియనీర్ల ఆస్తులు 2,500 కోట్ల డాలర్లు పెరిగి, 80 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని ఫోర్బ్స్‌ నివేదిక స్పష్టం చేసింది. వీరిలో మొదటి పదిమంది బిలియనీర్ల సంపద 38,500 కోట్ల డాలర్లు. ఆర్థిక మాంద్యాన్ని దాటుకుని బిలి యనీర్లు సంపదను పెంచుకుంటున్నారంటే వారి వద్ద మంత్ర దండం ఉందా అన్న సందేహం సామాన్యులకు కలగవచ్చు. కానీ, అదేమీ కాదు.రాజకీయ పలుకుబడి వల్లనే బిలియనీర్లు తమ సంపదను పెంచుకుంటున్నారన్నది కాదనలేని వాస్తవం.

- Advertisement -
   

దేశంలో పేదలు నిరుపేదలు గానూ, సంపన్నులు భాగ్యవంతులుగానూ మారడానికి ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమని ప్రతిపక్షాలు గతం లో ఆరోపించేవి. ఇప్పుడు అవి కూడా పెద్దగా పట్టించుకో వడం లేదు. నియంత్రణ మండళ్ళు, స్టాక్‌ ఎక్స్చేంజిల నుంచి సేకరించిన సమాచారంతో ఫోర్బ్స్‌ ఈ నివేదిక తయారు చేసింది. ఈ పరుగు పోటీలో మన దేశానికి చెందిన బిలియనీర్లే ముందుండటం గమనార్హం. ఇంత వరకూ అంబానీలే అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు అదానీ ఆ స్థానాన్ని ఆక్రమించారు. గత ఏడాదిలోనే అదానీ సంపద మూడింతలు పెరిగింది. 2008 నుంచి ఆసియా కుబేరునిగా కొనసాగుతూ వచ్చిన అంబానీని అదానీ వెనక్కి నెట్టేశారు. అంబానీ సంపద 5శాతం తగ్గి 8,800కోట్ల డాలర్లకు పడిపోయింది. కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ 2,150 కోట్ల సంపద తో నాల్గవ స్థానానికి చేరుకుంది.

ఈ సంస్థ చైర్మన్‌ సైరస్‌ పూనేవాలా అంతర్జాతీయంగా వచ్చిన ఆర్డర్లకు సకాలం లో వ్యాక్సిన్‌లను సరఫరా చేశారు. హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ శివనాడర్‌ 2,140 కోట్ల డాలర్ల సంపదతో ఐదవ స్థానం లో నిలిచారు. అయితే, రెడ్డీ లాబ్స్‌, అపోలో హాస్పటల్స్‌ వంటి సంస్థలు కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నా యి. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల సంఖ్య పెరుగుతుండటం గర్వకారణమే కానీ, దేశంలో పేదరి కం అంతకు ఎన్నో రెట్లు పెరుగుతుండటం వల్ల ప్రభు త్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ వ్యత్యా సాలు పెరుగుతున్నాయన్న అపవాదు వచ్చింది. విదేశా ల్లోని బ్యాంకుల్లో మన వారు దాచుకుంటున్న సంపద తగ్గిందన్న వార్తలు వచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ పెరుగు తోందన్న సమాచారమూ అందుతోంది. ఆర్థిక శాఖ నియంత్రణ కేవలం దేశంలో కొద్ది మంది సంపన్నులపై దాడికే పరిమితం అవుతోందన్న విమర్శలు కూడా వస్తు న్నాయి. ముఖ్యంగా, ఈ విషయాన్ని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి.

ఆర్థిక శాఖ ఎన్‌ఫోర్స్‌మెంటు (ఈడీ) విభాగం జరిపే దాడుల న్నీ ఏకపక్షంగా ఉంటున్నాయన్న ఆరోపణలు రావడాని కి పైకి కనిపించే కారణం ఈ దాడులకు గురవుతున్న వారంతా ప్రతిపక్షాలతో సంబంధాలున్న వారే అవుతుం డటమే. అయితే, గతంలో కన్నా ఈడీ విభాగం ఇప్పుడు చురుకుగా పని చేస్తోందన్న మాట బాగా వినిపిస్తోంది. గతంలో ఈ విభాగం ఒకటి ఆర్థిక శాఖలో ఉందన్న విష యం చాలా మందికి తెలియదు. అక్రమ ఆర్జన పరులపై కొరడా ఝళిపించడం అవసరమే కానీ, అది ఏక పక్షం కారాదన్నది తటస్థుల అభిప్రాయం.ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలపైనా, వారికి సంబంధించిన వ్యాపార, వాణిజ్య వేత్తలపైనా జరిగిన రీతిలోనే ఇప్పుడు ఐటి, ఈడీ దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం తన నిబద్దతనూ, పారదర్శకతనూ నిరూపిం చుకోవడం కోసం ఇలాంటి ఆరోపణలు రాకుండా చూసు కోవాలి.

దేశంలో పెట్టుబడులను ఆహ్వానించాలని ప్రధా నమంత్రే స్వయంగా పదేపదే చెబుతున్నప్పుడు ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తనిఖీ చేసే యంత్రాంగం పని చేస్తుండగా, అక్రమాలకు తావు ఎక్క డిదన్న ప్రశ్న తలెత్తుతోంది. అంటే తనిఖీ చేసే యంత్రాం గంలో కూడా డబ్బుకి ఆశపడి నేరం చేస్తున్న వారిని వదిలేస్తున్నారని అనుకోవల్సి వస్తోంది. అంతేకాకుండా విమానాశ్రయాల్లో చాలా కచ్చితంగా జరుపుతున్న తనిఖీల్లో విదేశాల నుంచి దొంగబంగారాన్ని మోసుకొ స్తున్న వారు దాదాపు ప్రతిరోజూ పట్టుబడుతున్నారు. తనిఖీలు చాలా తీవ్రంగా ఉన్నా తనిఖీ యంత్రాంగం కన్నుగప్పి దేశంలోకి దొంగబంగారాన్ని తరలిస్తున్నారం టూ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఏ ఒక్కరినో నిందిం చి ప్రయోజనం లేదు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ఈ తనిఖీలు విజయవంతమవుతాయి.దొంగ డబ్బు- దొంగ బంగారం ఆర్థిక వ్యవస్థకు పట్టిన చీడలు. వాటిని వదిలించడానికి దేశభక్తి అత్యవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement