Saturday, April 20, 2024

మృగాళ్ళ కట్టడి ఎలా

ప్రేమలు… పెళ్ళిళ్ళు పది కాలాల పాటు నిలవకుండా, పెటాకులు కావడం నిన్నటి వార్త .ఇప్పుడు ప్రేమించిన యువతితో సహజీవనం సాగించడం,అది బెడిసి కొడితే, ఆ యువతిని ఎవరికీ తెలియకుండా చంపేసి, ముక్కలుగా నరికేయడం ఆధునిక రీతి. అలాగే, ప్రేమించానని వెంటపడటం, ఆమె తిరస్కరిస్తే, యాసిడ్‌ పోయడం, లేదా కత్తిపోట్లకు గురిచేయడం వంటి సంఘటనలు కూడా కోకొల్లలు.. ఇలాంటి వాళ్ళు నాగరిక సమాజంలో ఉండ దగిన వారు కారని అంతా అంగీకరిస్తున్నాం, కానీ, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ, బలిని కాదని దేవదాసు సినిమా కాలం నుంచి ఎంతో మంది చెప్పడమే కాక, త్యాగమయులుగా జీవితాన్ని గడుపుతున్నవారు ఇప్పటికీ ఉన్నారు. కానీ, ఆధునిక కాలంలో తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూ డదనే విపరీత బుద్ధులు కలవారు తయార వుతున్నారు. ఇది పైశాచికత్వం. మనం కొని తెచ్చుకుంటున్న నాగరికత అంతా పాశ్చాత్య దేశాల నుంచే. ఆ దేశాల్లో కూడా భగ్న ప్రేమికులు తాము ప్రేమించిన యువతులపై దాడులు చేయడంలేదు. వారిని చంపడం లేదు. ఇది ఒక మానసిక వైకల్యంగానే విజ్ఞులు పరిగణిస్తున్నారు. మానసిక వైకల్యం గలవారి చికిత్స కోసం ఎన్నో ఆస్పత్రులు ఉన్నాయి. గతంలో ఊరికి ఒకటి ఉండేది.ఇప్పుడు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి.

కానీ, అవేమీ మానసిక రోగులకు స్వస్థత చేకూర్చలేకపోతున్నాయి. అసలు ప్రేమ ఎక్కడ నుంచి పుట్టుకొస్తుంది?
యువతీయువకుల మధ్య పరస్పరం అవగాహన, భరోసా, తాత్విక దృక్కోణం వల్ల పుట్టుకొచ్చే ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. కానీ, శారీరక సౌఖ్యం కోసం, అప్పటికప్పుడు అవసరాన్ని తీర్చుకోవడం కోసం ప్రేమ పేరిట వెంట పడే వారు కపట ప్రేమికులు, ఇలాంటి వారిని గుర్తించడం ఎలా? అది తెలుసుకోలేకపోవడం వల్లనే మాయగాళ్ళ వలలో యువతులు పడుతున్నారు. అలా దగా పడిన యువతులు తమను పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. ఢిల్లిలో తాజాగా వెలుగు చూసిన సంఘటనలో 35 ముక్కలైన యువతి చేసిన నేరం అదే. ఆమెను ప్రేమించానని నమ్మబలికిన యువకుడు ఆమెను కత్తితో పొడిచి చంపడమే కాకుండా 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో ఉంచి రోజుకు రెండు ముక్కలు వంతున రోజూ అర్థరాత్రి వేళ వేర్వేరు ప్రాంతాల్లో జార విడిచాడు. ఇది ఎంత క్రూరమైనపనో తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అసలు అలాంటి వారు మన మధ్య ఉన్నారా అంటే, ఇటీవల కేరళలో చోటు చేసుకున్న ఘటన వెంటనే గుర్తుకు వస్తుంది. ఒక మహిళను హత్య చేయడమే కాకుండా, ఆమె రక్తమాంసాలను ఆరగించిన పైశాచికులు వారు. ఇందులో ప్రేమ లేదు. కేవలం శాడిస్టు మనస్తత్వమే కనిపిస్తుంది.

- Advertisement -

కానీ, ఢిల్లిలో జరిగిన సంఘటన మాత్రం పరమకిరాతకమైనదే. పదేళ్ల క్రితం ఇదే ఢిల్లిలో ఒక యువతిపై అత్యాచారం చేసి చంపిన ముగ్గురు నేరస్తులను సరైన ఆధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు సంశయ లాభం (బెనిఫి ట్‌ ఆఫ్‌డౌట్‌) కింద కిందటి వారమే విడుదల చేసింది. ముప్పయి ఒకటేళ్ళ క్రితం మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకు కుట్ర పన్నిన దోషులు సుదీర్ఘ జైలుజీవితం గడిపిన తర్వాత గత వారం చివరలో సుప్రీంకోర్టు విడుదల చేసింది. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే ఆటవిక నీతి మన సమాజంలో లేదు. అందుకే, హత్యాచారం చేసిన వారినీ,హత్య చేసిన వారిని పాయంట్‌ బ్లాంక్‌గా కాల్చి చంపడం మన రాజ్యాంగానికి వ్యతిరేకం. సుదీర్ఘ విచారణ అనంతరం వారికి కోర్టు శిక్ష విధిస్తుంది. అది వెంటనే అమలు జరగదు., ఇలా అమలు జరగకపోవడం వల్లనే నేరాల సంఖ్య నానాటికీ పెరుగుతోందన్న వాదన సహేతుకంగానే కనిపిస్తోంది. కానీ, అందుకు చట్టాలు ఒప్పవు. మన దేశంలో ఏం జరిగినా చట్ట ప్రకారమే జరగాలి. అలా కాకుండా ఎదురు కాల్పుల్లో నిందితులు మరణిస్తే ఎన్‌కౌంటర్లు పెరిగిపోతున్నా యంటూ హక్కుల సంఘాల వారు ఉద్యమాలు నడుపుతారు. ఆడ పిల్లల రక్షణ కోసం పదేళ్ళ క్రితం కేంద్రం నిర్భయ చట్టం తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ మధ్య దిశ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. అది ఇంకా ఆమోదం కాలేదు.

రాష్ట్రానికో చట్టం చొప్పున అన్ని చోట్లా యువతుల రక్షణకు చట్టాలను చేస్తున్నా, ప్రేమ పేరిట వెంటపడటం, వేదించడం, హత్యలు చేయడం నానాటికీ ఎక్కువ అవుతూనే ఉన్నది. ఒక వంక మహిళలు ఆకాశంలో సగభాగం అంటూనే మరో వంక వారిని వేధించడమే కాదు, చంపి ముక్కలు చేసే రాక్షసులు పెరిగిపోతున్నారు. ఇలాంటి వారిని మృగాళ్ళని అంటున్నారు. మృగాలకు కూడా ఒక నీతి, ధర్మం ఉంటాయి. ఏమీ లేకుండా అడ్డగొలుగా విరు చుకుని పడే వారు రాక్షసుల కంటే హీనులు. వీరి పట్ల జాలి, దయ చూపకుండా తక్షణ శిక్షల ఆలోచన చేయాలేమో!.

Advertisement

తాజా వార్తలు

Advertisement