Thursday, March 28, 2024

ఆదుకోవడం వేరు… తాయిలాలు వేరు!

దేశంలో నిరుపేదలకు ఉచితంగా రేషన్‌ అందజేసే పథకాన్ని ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద కేంద్రం 2020 ఏప్రిల్‌ నుంచి అమలు జేస్తోంది. కరోనా సమయంలో పనులు లేక నిరాధారులైన కోట్లాది పేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగ కరంగా ఉంది. ఈ పథకాన్ని ఒకే సారి కాకుండా దశల వారీగా పొడిస్తోంది. ఈ పథకం ఇప్పటికీ అమలులో ఉంది. దీని ద్వారా దేశంలో 94 శాతం లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం జరిగింది. కరోనా వంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు పేదలను ఆదుకోవడానికి కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ, ఇలాంటి పథకాలను అమలు చేయడంలో ఆక్షేపణ లేదు. కానీ, ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ పార్టీలు చేస్తున్న వాగ్దానాలు ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిని సవాల్‌ చేసే రీతిలో ఉంటున్నాయి, కొద్ది రోజుల క్రితం జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఉచిత పథకాలపై విమర్శలు, వాటిపై ప్రతివిమర్శలు వచ్చాయి. ఎన్నికల వాగ్దానం పేరిట రాష్ట్రాలు తలకు మించిన భారాన్ని తలకెత్తుకో కూడదని ఎవరైనా అంటే తప్పు పట్టలేం. కానీ, ఆమ్‌ ఆద్మీ సారథి, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీపై చేసిన వ్యాఖ్యలు సంబంధం లేని రీతిలో ఉన్నాయి.

కార్పొరేట్‌ సంస్థలకు పది లక్షల కోట్లు పైగా రుణాలను మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు, కరెంట్‌, ఉచితంగా అందించడాన్ని ఎలా తప్పుపడుతుందంటూ కేజ్రీ వాల్‌ ప్రశ్నించారు. కార్పొరేట్‌ రంగంలో తమ మిత్రులకు రుణాలు మాఫీ చేశారంటూ కేజ్రీ వాల్‌ విమర్శించారు. ఆయన మాత్రమే కాకుండా వామ పక్ష నాయకులు కూడా విమర్శిస్తున్నారు. అయితే, కార్పొ రేట్‌ రంగంలో మొండి బకాయిలు పెరిగి పోవడానికి కారణం ఎవరో కూడా ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలియజేసింది. పైగా మొండిబకాయిల్లో చాలా మటుకు వసూలు చేయడం జరిగిందని కూడా ఆర్థిక మంత్రి వివరించారు. పూర్వపు ప్రభుత్వ హయాంలో జల విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు కోసం అప్పటి ప్రభుత్వం భారీగా రుణాలు ఇచ్చింది. అవి పూర్తి స్థాయిలో సాకారం కాకపోవడం వల్ల మొండి బకాయిలు పెరిగిపోయాయని ప్రభుత్వమే పార్లమెంటుకు తెలియజేసింది. అలాగే, భారీగా రుణాలు తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయిన వారినుంచి క్రమంగా రికవర్‌ చేస్తున్నట్టు కూడాతెలిపింది. పరిశ్రమలు స్థాపించడానికి రుణాలు ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. అయితే, తీసుకున్న వ్యక్తులు సక్రమంగా చెల్లించకపోతే ప్రస్తుత ప్రభుత్వాన్నే నిందించడం న్యాయం కాదు. పూర్వపు యూపీఏ ప్రభుత్వ హయాం నాటి మొండి బకాయిలు తమకు వారసత్వంగా వచ్చాయని మోడీయే పార్లమెంటులో తెలిపారు.

విదేశాలకు పారిపోయిన నీరజ్‌మోడీ, విజయ్‌ మాల్య వంటి వారి నుంచి బకాయిలను వసూలు చేయడానికి దేశంలో వారికి చెందిన ఆస్తులను ఆర్థిక శాఖ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) జప్తు చేస్తోంది. వీటి ద్వారా కూడా చాలా మటుకు బకాయిలు వసూలు అవుతున్నట్టు పార్లమెంటుకు ప్రభుత్వం తెలియజేసింది. ఇది వేరు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు ఫ్యాన్లు, ఫిడ్జ్‌లు, ఇతర గృహోపకరణాలను ఉచితంగా పంపిణీ చేయడమనే పద్దతికి స్వస్తి చెప్పాలని రిజర్వు బ్యాంకు పూర్వుపు గవర్నర్లు, ఆర్థిక వేత్తలు, ఇప్పటికి చాలా సార్లు సూచించారు. యూపీఏ హయాంలో కూడా ఈ వివాదం వచ్చింది. అందుకే అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఉపాధి హామీ పథకం ద్వారా బియ్యం, రేషన్‌ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఉచితంగా ఆహార ధాన్యాలు, కరెంట్‌ సరఫరా చేయడం ఉత్పాదకతకు ముడి పెట్టాలని ఆనాడు ఆయన సూచించారు. ఇంకా వెనక్కి వెళ్తే పీవీ నరసింహారావు దీనిని పనికి ఆహార పథకంగా అమలు జేశారు. ఉత్పత్తితో జోడించి ఉచిత పథకాలను అమలు జేయడం వేరు, ఎన్నికల్లో ఓట్ల కోసం చేసిన వాగ్దానాల అమలు కోసం ఉచిత పథకాలను అమలు జేయడం వేరు.

ఈ రెండింటికీ తేడాను గమనించకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలపై ఎవరికి అవకాశం వస్తే వారు విమర్శలు చేస్తున్నారు. ఉత్పత్తిని పెంచే సంస్థలు, వ్యక్తులకు అవసరమైన చేయూతనివ్వడం ప్రభుత్వ విధా నమని కూడా మోడీ పలు సందర్భాల్లో చెప్పారు. నిజమే కార్పొరేట్‌ శక్తులకు కోట్లాది రుణాలను మాఫీ చేయడంపై ఇప్పటికీ పలు వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీకి చెందిన వరుణ్‌ గాంధీ కూడా ఈ మాఫీని తప్పు పట్టారు. ఆపన్నులకు చేయూతనివ్వడం వరకే ఈ పథకాల ఉద్దేశ్యం పరిమితం కావాలి, రాజకీయ ప్రయో జనాలకు ఉపయోగ పడే కార్పొరేట్‌ వర్గాలకు రుణాలు మాఫీ చేస్తే ఇలాంటి విమర్శలే వస్తాయి. రుణాలను పొందుతున్న వారు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఉద్యోగార్దులకు ఉద్యోగాలు ఇస్తున్నారో లేదో సరిచూసే యంత్రాంగం తన విధిని సక్రమంగా నిర్వర్తించక పోవడం వల్ల ఇలాంటి విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement