Thursday, June 1, 2023

రాజన్‌ మాట విని ఉంటే..!

రఘురామ్‌ రాజన్‌…రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌. ముక్కు సూటి మనిషి. అందుకే ప్రభుత్వంలో ఉన్న వారి ఆదరణకు దూరమయ్యారని పలువురు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అందులో నిజముంది. ప్రభుత్వం మెప్పు కోలు కోసం ఎదురు చూడకుండా ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడుతుంటారు. ఆరేళ్ళ క్రితం పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయొద్దని ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో నిష్కర్షగా స్పష్టం చేసినట్టు అందుకే ఆయన పదవీ కాలం పొడిగింపు విషయంలో ప్రభుత్వం సుముఖత చూపలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో నిజమెంతో తెలియదు కానీ, పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇప్పటికీ బాధలు అనుభవిస్తున్న మాట నిజం. అలాగే, రఘురామ్‌ రాజన్‌ దేశంలో ఆర్థికాభివృద్ధికి చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఆర్థిక రంగం తిరోగమనంలో ఉందన్న అభిప్రాయమూ తరచూ వెల్లడవుతోంది. ఇదీ వాస్తవమే. అయితే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ మాత్రం మన ఆర్థిక వ్యవస్థ తిరుగు లేని రీతిలో ముందుకు సాగుతోందనీ, టోకు ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందనీ, రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా త్వరలోనే కిందికి దిగి వస్తుందని చెబుతున్నారు. ఆర్థికాభివృద్ధి రేటు నిర్మలా సీతారామన్‌ చెబుతున్నంత ఆశావహంగా ఏమీ లేదు. వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థకు కష్టకాలమేనని రాజన్‌ అంటున్నారు. ఐదు శాతం వృద్ధి రేటు సాధిస్తే గొప్పేనని కూడా అంటున్నారు.

- Advertisement -
   

ఆయన మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాం కాలన్నీ మదింపు చేసి చెప్పిన మాట ఇది. ఆయన ప్రభుత్వంలో లేరు. అసలు మన దేశంలోనే లేరు. అమెరికన్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మన ప్రభుత్వం నుంచి ఏ పదవినీ ఆశించడం లేదు కనుక ఆయన ఉన్నదున్నట్టు స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను పురోగమింపజేయడంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలు ఒక్కటి కూడా ఫలించడం లేదని చెప్పడానికి ఆర్థిక నిపుణులు అవసరం లేదు. పెద్ద నోట్ల విషయమే తీసుకుంటే ఎవరినీ సంప్రదించకుండా మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల మహా కుబేరులు తప్ప సమాజంలో అన్ని వర్గాలూ దెబ్బతిన్నారు. అలాగే, వ్యవసాయ చట్టాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసినప్పుడు రైతులంతా దేశవ్యాప్తంగా సంఘటితమై సాగించిన పోరాటం ఫలితంగా ఆ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితి ఖంగుతిన్న మాట వాస్తవమే కానీ, అది వెళ్ళిపోయి రెండేళ్ళు అవుతున్నా, ఇంకా కోవిడ్‌ని సాకుగా చూపడం సమంజసంగా లేదు. ఆర్థిక పరమైన లెక్కలు వేయడంలో మన దేశంలో సామాన్యులే ప్రవీణులు. రఘురామ్‌ రాజన్‌ చెప్పిన విషయాల్లో ఎంతో నిజం ఉంది.

కోవిడ్‌ తర్వాత ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ప్రభుత్వం విఫలమైంది. కోవిడ్‌ వల్ల ఎక్కువగా దెబ్బతిన్నది దిగువ మధ్యతరగతి వర్గాలెనన్నది వాస్తవమేనంటూ రఘురామ్‌ రాజన్‌ మరొక ముఖ్య విషయాన్ని ప్రజల ముందుంచారు. ముఖ్యంగా, చిన్న కారు, సన్నకారు రైతులకు, చిన్న పరిశ్రమల వారికి తోడ్పాటు నందించడంలో ప్రభుత్వం విఫలమైంది. కోవిడ్‌ వల్ల నష్టపోయినవారికి పరిహారం పేరిట 28 లక్షల కోట్ల రూపాయిలు విడుదల చేసినట్టు ప్రభుత్వం పదే పదే ప్రకటించింది. ఆ సొమ్మంతా భారీ పెట్టుబడిదారులకు చేరిందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానిని ప్రభుత్వం ఇంతవరకూ ఖండించలేదు. అలాగే, ఎంఎస్‌ఎం ఈలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు కూడాపక్కదారి పడుతున్నట్టు తరచూ విమర్శలు వస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు ఏ వర్గాలకు చేరుతున్నాయో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారికే తిరిగి రుణాలు ఇస్తున్నారు. 10 లక్షల కోట్ల మొండిబకాయిలను రైటాఫ్‌ చేసినట్టు ఆర్థికమంత్రి నిర్మల ఈ వారంలోనే పార్లమెంటు లోప్రకటించారు. ఇది మాఫీ కాదనీ, రైటాఫ్‌ అని ఆమె వివరణ ఇచ్చారు. రైటాఫ్‌ అంటే భవిష్యత్‌లో వసూలు చేసే వీలుటుందని కూడా ఆమె మరింత వివరణ ఇచ్చారు.

రైతుల రుణాల మాఫీ విషయంలో 2004 ఎన్ని కల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని యూపీఏ ప్రభుత్వం నిలబెట్టుకోవడాన్ని ఎద్దేవా చేసిన బీజేపీ ఇప్పుడు ఇంత భారీ మొత్తాన్ని ఎలా రైటాఫ్‌ చేసిందో ఆ పార్టీ నాయకులే చెప్పాలి.మొదటి నుంచి బీజేపీ పారిశ్రామిక వేత్తల పార్టీ అనీ, వ్యవసాయ రంగం పట్ల చిన్న చూపు ఆ పార్టీకి అలవాటేనన్న అపవాదు ప్రచారంలో ఉంది.ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చర్య వల్ల అది నిజమేనని రుజువైంది. రైతుల కోసం మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అసత్యం కాదేమోననిపిస్తోంది.ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల ఎవరో ఒకరిద్దరు మహాసంపన్నులు అయి ఉండవచ్చు కానీ, అధిక సంఖ్యాకులు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతు న్నారన్నది వాస్తవం.

Advertisement

తాజా వార్తలు

Advertisement