Tuesday, April 16, 2024

రోహింగ్యాల సమస్యలపై రగడ!

మయన్మార్‌ నుంచి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రొహింగ్యా ముస్లింలను అడ్డుపెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్‌ చాలా కాలం రాజకీయం చేశాయి. ఇప్పుడు ఆమ్‌ ఆద్మీపార్టీ (ఆప్‌) తానూ తక్కువేమీ కాదంటూ రంగంలోకి ప్రవేశించింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ రొహింగ్యా ముస్లిములను అవుటర్ ఢిల్లీలోని బక్కరవాలాకు తరలించాలని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పురిపై ఒత్తిడి తెచ్చింది. ఆయన అందుకు అంగీకరించారు. బక్కర వాలా ప్రాంతంలో నిర్మించే అపార్టుమెంట్లకు తరలించేందుకు కేంద్రం సుముఖమేననీ, శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంలో ఐక్యరాజ్య సమితి ఒప్పందాలను కేంద్రం గౌరవిస్తుందంటూ హర్‌దీప్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ ప్రకటన అధికార పార్టీ అయిన బీజేపీలో కలకలం రేపింది. నిజానికి ఈ అంశంపై కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకోవాలి.

కానీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో ఆయన రొహింగ్యా ముస్లింలకు బక్కర్‌వాలా అపార్టుమెంట్లలో పునరావాసం కల్పిస్తామన్నారు. వెంటనే కేంద్ర హోంశాఖ దీనిని ఖండించింది. ఈ విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేసింది. కేంద్ర మంత్రి ప్రకటనను హోంశాఖ ఖండించడం అనేది ఆరుదైన విషయం. హర్‌దీప్‌సింగ్‌ పురి కూడా బీజేపీకి చెందిన వారే, ఆయన స్వతహాగా రాజకీయ వేత్త కాదు, విదేశాంగ శాఖలో వివిధ పదవు లు నిర్వహించారు. ఆయనకు అన్ని పార్టీల్లో మిత్రులు న్నారు. రొహింగ్యాల సమస్య రాజకీయంగా బీజేపీకి ఒక అస్త్రం వంటిది. విదేశీయులను దేశం నుంచి పంపించాలన్న నినాదంతో బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లోనూ, ఢిల్లీలోనూ తిష్టవేసిన శరణార్ధుల విషయంలో పట్టుపడుతోంది.

పౌర చట్టసవరణ (CITIZENSHIP AMENDMENT ACT)ని తెచ్చింది ఇందుకోసమే. ఈ చట్ట సవరణ కోసమే ఢిల్లీలో 2020 ఆరంభంలో ఉద్యమం జరిగింది. పలువురు మరణిం చారు. కొద్ది రోజులకే కరోనా విజృంభించడంతో ఆ అంశం మరుగున పడింది. అయినప్పటికీ నివురుగప్పిన నిప్పులా సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులు సమయం చూసుకుని విజృంభించేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ విషయం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కు తెలుసు. తదుపరి సిఏఏ చట్టం అమలుపై దృష్టి సారించనున్నట్టు ఆయన ఇటీవల ప్రకటించారు. దానిపై బీజేపీయేతర పార్టీలు తీవ్రంగా స్పందించాయి. బీహార్‌లో ఇటీవల ఆకస్మికంగా సంభవించిన రాజకీ య పరిణామాలకు ఈ ప్రకటనే మూలకారణం.

బీహార్‌లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే సంఖ్యా బలాన్నిముస్లింలు కలిగి ఉన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఈ కారణంగానే బీజేపీతో కటీఫ్‌ చేసుకు న్నారు. రొహింగ్యా ముస్లింలు అసోం, బెంగాల్‌, త్రిపురలలో కూడా అధిక సంఖ్యలోఉన్నారు. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కి ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారు. త్రిపురలో పూర్వపు లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి కూడా వీరే దన్నుగా ఉండేవారు. అసోం, త్రిపు ర, ఈశాన్యంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అందువల్ల తమ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా సీఏఏ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు జేయాలని బీజేపీ సంకల్పించింది. రొంహిగ్యా ముస్లింలకూ, స్థానిక ముుస్లింలకూ మధ్య అంతరాన్ని పెంచేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. కానీ, అది ఫలించలేదు.

హోం మంత్రి అమిత్‌ షా రొహింగ్యా ముస్లింలను తిరిగి మయన్మార్‌ కు పంపేందుకు చాలా పట్టుదలతో ఉన్నారు. పార్టీ సిద్ధాంత రీత్యా ఆయన ఆలోచన సరైనదే కావచ్చు కానీ, రొహింగ్యాలు తిరిగి స్వదేశం వెళ్తే అక్కడి సైనిక పాలకులు వారిని బతకనివ్వరు. అందుకే, వారికి మన దేశంలో ఆశ్రయం కల్పించాలని బీజేపీయేతర సెక్యులర్‌ పార్టీలు కోరుతున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం బర్మా దేశంతో మన దేశంలో చాలా ప్రాంతాల వారికి వాణిజ్య సంబంధాలుండేవి. అక్కడి ముస్లింలు, ఇతర వెనకబడిన జాతుల వారు మన దేశంలో పనుల కోసం వలస వచ్చేవారు. అలా వలస వచ్చిన కుటుంబాలు త్రిపుర, అసోంలలో స్థిరపడ్డారు. వీరిలో కొందరు వ్యాపారాలు చేసి బాగా స్థితిమంతులయ్యారు.

- Advertisement -

వీరిని కొనసాగించడం వల్ల స్థానికుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆ మధ్య అసోంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. మొత్తం మీద రొహింగ్యా ముస్లింల వల్ల భారత్‌లో చాలా ఎక్కువగానే రాజకీయ కలకలం రేగుతోంది. యూపీఏ హయాంలో వీరిని గురించి బీజేపీ ప్రధానాంశంగా చేసి ఆందోళనలు సాగించేది. ఇప్పుడు తమ హయాంలోనే ఈ సమస్య మరింత హెచ్చుగా పరిణమించడంతో కేంద్రం సీఏఏ రూపంలో దీనికి స్వస్తి పలకాలని యత్నిస్తోంది. ఇది ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement