Thursday, April 25, 2024

బీజేపీలో ప్రక్షాళన!

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తిరుగులేదనీ, రానున్న ఎన్నికల అనంతరం కూడా ఆయనే ప్రధానమంత్రి అవుతారని జాతీయ స్థాయిలో సర్వే సంస్థలు ముందస్తు ఫలితాలను వెల్లడించడంతో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభించింది. సామాజిక సమీకరణాలనూ, సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీలో నాయకుల ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే, అత్యున్నత స్థాయిలో పార్టీ విధాన నిర్ణయవేదిక అయిన పార్లమెంటరీ బోర్డులోనూ, అభ్యర్ధులను ఎంపిక చేసే ఎన్నికల కమిటీలోనూ మార్పులపై దృష్టి సారించింది. బీజేపీ దృష్టిలో ఇప్పుడు తెలంగాణ ప్రధానాంశంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని అనుకుంటోంది. కానీ, ఇప్పటికిప్పుడు ఆంధ్రలో తమకు కావల్సిన స్థానాలను గెల్చే పరిస్థితి లేదు. ఆంధ్రలో అధికారంలో ఉన్న వైసీపీ ఎలాగూ తమ పార్టీకి అనుకూలంగా ఉన్న దృష్ట్యా, ఆ పార్టీతో వైరం కన్నా బేరంతో కొన్ని సీట్లు సాధించుకోవాలన్న ఆలోచనలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. అందువల్ల, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమల నాథులు ముందుకు సాగుతున్నారు. ఆపార్టీ గత ఎన్నికల్లో కొన్ని ఎంపీ స్థానాలనూ, ఎమ్మెల్యే సీట్లను దక్కించుకుని క్షేత్ర స్థాయిలో బలాన్ని సంపాదించుకున్న దృష్ట్యా, దానిని ఉపయోగించుకుని ఈ సారి అధికారాన్ని చేజి క్కించుకునే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రయత్నాలు సాగిస్తోంది. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తోందన్న సంకేతాన్ని ఇవ్వడం కోసం బీసీలలో సీనియర్‌ నాయకుడైన ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేట్టు చేశారు. ఇప్పుడు ఆయనకు పార్టీ పార్ల మెంటరీ బోర్డులోనూ, కేంద్ర ఎన్నికల కమిటీలోనూ సభ్యత్వాన్ని ఇచ్చారు. గతంలో తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ బీసీ నాయకునిగా బీజేపీలో ప్రధాన పదవులు నిర్వహించారు. ఆయన ఇప్పుడు హిర్యానా గవర్నర్‌గా వ్యవహరిస్తున్న దృష్ట్యా, లక్ష్మణ్‌కి ప్రాధాన్యా న్ని పెంచారు. ఆయన విద్యాధికుడే కాకుండా, బీజేపీ తెలంగాణ శాఖకు చాలా కాలం అధ్యక్షునిగా పని చేశారు. తె లంగాణాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ అన్నివర్గాలనూ కూడగట్టుకోగల నేర్పరిగా పేరొందారు. అలాగే, కర్నాటకలో పార్టీకి మూలస్తంభం వంటివారైన యెడియూరప్పను మళ్లి తెరమీదికి తెచ్చారు. ఆయన కర్నాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని విజయవం తంగా నడిపి ఉత్తరాది పార్టీగా పేరొందిన బీజేపీని దక్షిణాదిలో అడుగిడేట్టు చేశారు. ఆయనకు కర్నాటకలో పీఠాధిపతులు, మఠాధిపతుల మద్దతు ఉంది. వీరిలో ఎక్కువగా విద్యాసంస్థలను నిర్వహిస్తూ సమాజంలో అన్ని వర్గాలనూ కూడగట్టుకుంటున్న సిద్ధగంగ పీఠాధిపతి ఆశీస్సులు యెడియూరప్పకి ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయనకున్న పలుకుబడి ముందు అవి అన్నీ దిగదుడుపుగానే ఉంటున్నాయి. ఈ విషయాన్ని కర్నాటక బీజేపీ నాయకులే చాలా సార్లు వ్యాఖ్యానించారు. యెడియూరప్ప వయోభారం కారణంగా ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగి తన శిష్యుడైన బసవరాజ్‌ బొమ్మైని ముఖ్యమంత్రిగా చేశారు. అయితే, ఆయన కుమారునికి ఎటువంటి పదవి ఇవ్వ నందుకు అలిగి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న యెడియూరప్ప సేవలను వచ్చే ఏడాది జరిగే అసెంబ్లి ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో, పార్లమెంటరీ బోర్డులో ఆయనకు స్థానం కల్పించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైపై కూడా అవినీతి ఆరోపణలున్నాయి. అంతేకాక, హిజాబ్‌ (ముస్లిం మహిళలు వినియోగించే పై కండువా) విష యంలో అనవసర రాద్ధాంతం జరగడానికీ, పార్టీ పై ప్రతి పక్షాలు బురదజల్లేట్టు పరిస్థితి దిగజారడానికి ఆయన సమర్ధవంతంగా వ్యవహరించకపోవడమే కారణమన్న ఫిర్యాదులు ఇప్పటికే పార్టీ కేంద్ర నాయకత్వానికి చేరా యి. ఎన్నికల ముందు ఆయన నాయకత్వాన్ని మార్చ డం ఇష్టం లేక కొనసాగిస్తున్నారు. మళ్ళీ యెడియూరప్ప ఆధిపత్యం కొనసాగేట్టు ఆయనకు కేంద్ర కమిటీలలో సభ్యత్వం ఇచ్చారు. కర్నాటకలో బలమైన లింగాయత్‌ సామాజిక నియోజకవర్గానికి చెందిన యెడియూరప్ప కు అన్నిపార్టీల్లో మంచి మిత్రులు ఉన్నారు. ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోయినా, ఆయన సారథ్యంలోనే అసెంబ్లిd ఎన్నికలకు వెళ్ళాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. బీహార్‌లో ఇటీవల జనతాదళ్‌ (యు) బీజేపీకి దూరం కావడంతో ఆ లోటును పూడ్చడం కోసం రామవిలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ని ప్రోత్సహిస్తోంది. పార్టీలో మార్పులు, చేర్పులు చేయ డం ఏ పార్టీ నాయకత్వానికైనా ఉన్న స్వేచ్చ, సహజ పరిణామమే. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కమల నాథులు ఈ మార్పులు చేసినట్టు కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement